ప్రతి శనివారం రచ్చే!

ABN , First Publish Date - 2020-10-25T10:26:21+05:30 IST

అధికార పార్టీ నాయకులు విశాఖపట్నంలో ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు.

ప్రతి  శనివారం రచ్చే!

ఇదీ రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు

అధికార పార్టీ పెద్దలు నిర్ణయించిన ముహూర్తం

ఆరోజే కూల్చివేతలు, స్వాధీనాలు

ఈ నెల మొదటి శనివారం సబ్బం హరి ఇంటిని

చుట్టుముట్టిన అధికారులు

మూడో శనివారం టీడీపీ సానుభూతిపరులుగా భావించి

ఇంజనీరింగ్‌ కళాశాల మార్గంలో దుకాణాలు తొలగింపు

ఈవారం ‘గీతం’


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): అధికార పార్టీ నాయకులు విశాఖపట్నంలో ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులపై కూడా ఇదే వైఖరి ప్రదర్శిస్తున్నారు. అందుకు...వ్యూహాత్మకంగా శనివారాన్ని ఎంచుకుంటున్నారు. ఇటువంటి వ్యవహారాల్లో అధికారులు కూడా ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తెంపరితనం ప్రదర్శిస్తున్నారు. ఆయా వ్యక్తుల నివాసాలు/సంస్థల వద్దకు తెల్లవారక ముందే వందలాది మంది పోలీసులు, పదుల సంఖ్యలో అధికారులు వెళ్లి అనుకున్న లక్ష్యం పూర్తిచేస్తున్నారు. మొదట మాజీ మేయర్‌, తెలుగుదేశం పార్టీ నాయకుడు సబ్బం హరి ఇంటిపై పడ్డారు. నానా రభస చేశారు. ఆయన ఇంటి ఆవరణలో 210 గజాలు ప్రభుత్వ స్థలం కలిసిందంటూ స్వాధీనం చేసుకున్నారు. 


ప్రేమ సమాజంపైనా అదే దాడి

ఆ తరువాత సేవే లక్ష్యంగా చేసుకుని ఏడు దశాబ్దాల క్రితం ఏర్పాటైన ప్రేమ సమాజంపై కన్నేశారు. దాతలు ఇచ్చిన భూములు వందల కోట్ల రూపాయల విలువ చేస్తాయని తెలిసి, దేవదాయ శాఖ ఆధీనంలోకి తీసుకుంటున్నట్టు శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు. మరుసటిరోజు ఆదివారం సెలవు రోజున 20 మంది దేవదాయ శాఖ అధికారులు వెళ్లి ట్రస్టును స్వాధీనం చేసుకున్నారు. రుషికొండలో సాయిప్రియా రిసార్ట్‌ యాజమాన్యం దగ్గరున్న 40 ఎకరాలు వెనక్కి తీసుకునేందుకే ఇదంతా చేశారనేది బహిరంగ రహస్యం. ఆ దిశగా దేవదాయ శాఖ అధికారులను నడిపిస్తున్నారు.


ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ దగ్గర....

విశాఖ తూర్పులో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును ఏదోలా దెబ్బ తీయాలనేది విశాఖలో వైసీపీ నాయకుల ఆలోచన. ఆయన్ను ఏమీ చేయలేక...ఆయనకు మద్దతుదారులుగా వున్న వారిపై దాడికి తెగబడ్డారు. ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ రోడ్డులో రహదారి పక్కన దుకాణాలు పెట్టుకొని టిఫిన్‌ వ్యాపారాలు చేసుకుంటున్న వారిపై కూడా శనివారం తెల్లవారుజామున ఉన్నపళంగా దాడి చేసి కూలగొట్టేశారు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు వారివి. వారికి జీవనోపాధి, నిలువ నీడ లేకుండా చేశారు. 


తాజాగా గీతంపై...

ఇప్పుడు గీతం విశ్వవిద్యాలయంపై కూడా శనివారం నాడే వందలాది మంది సిబ్బందితో దాడి చేసి నిర్మాణాలు కూలగొట్టారు. ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. ప్రపంచ స్థాయి పేరు ప్రతిష్టలున్న సంస్థపై దాడి చేస్తే దానివల్ల రాష్ట్రానికే చెడ్డపేరు వస్తుందనే చిన్న విషయాన్ని..అటు నాయకులు, ఇటు అధికారులు విస్మరించారు. గీతం రాత్రికి రాత్రి నిర్మాణాలు చేయలేదు. అయినా కూల్చివేశారు.


అన్నింటి వెనుక విజయసాయిరెడ్టి ప్రణాళిక

విశాఖలో జరుగుతున్న ఈ దాడులన్నింటి వెనుక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  హస్తం వుందని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. స్వయంగా విజయసాయిరెడ్డే ఆరు నెలల క్రితం గీతం విశ్వవిద్యాలయం వద్దకు వెళ్లి, వాహనంలో కూర్చుని...రెవెన్యూ అధికారులతో కొలతలు వేయించారంటున్నారు. ఇప్పుడు కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. సబ్బం హరి ఇంటి నిర్మాణాన్ని భూతద్దంతో పరిశీలించి కక్ష తీర్చుకున్నారంటున్నారు. పెందుర్తిలో గల అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద ఇంటి ప్రహరీ ప్రభుత్వ స్థలంలో వుందంటూ కూల్చివేయడానికి రాత్రికి రాత్రి ఎక్స్‌కవేటర్‌లతో వెళ్లారు. అయితే అందరూ వ్యతిరేకించడంతో వెనుతిరిగారు. ఇక తరువాత శనివారం ఇంకెవరిపై వైసీపీ నాయకులు దాడికి అధికారులను పంపుతారోనని అంతటా చర్చ జరుగుతోంది.


దమ్ముంటే రండి...అక్రమ నిర్మాణాలు చూపిస్తా!: జీవీఎంసీ కమిషనర్‌ సృజనకు బండారు సవాల్

అక్రమ నిర్మాణాలు ఎక్కడున్నా కూల్చివేస్తామంటూ జీవీఎంసీ కమిషనర్‌ సృజన ప్రగల్భాలు పలుకుతున్నారని, అధికార పార్టీ నేతలు చెప్పినవి మాత్రమే ఆమె చేస్తున్నారని తెలుగుదేశం నాయకులు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. ఆయన శనివారం విలేఖరులతో మాట్లాడుతూ, గీతంలో ఆక్రమణలు ఉన్నాయి..అందుకే కూల్చివేశామని చెబుతున్న జీవీఎంసీ కమిషనర్‌...ఓ ఎమ్మెల్యే అక్రమ నిర్మాణం చేపట్టారని ఫిర్యాదు అందితే...సిటీ ప్లానర్‌ దానిని చూసి కూలగొట్టడానికి వెళితే...ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. విజయసాయిరెడ్డి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చిందని, దాంతో కమిషనర్‌ ఆ కూల్చివేత ఆపేశారని బండారు ఆరోపించారు. నీతిగా, నిజాయితీగా పనిచేస్తున్నట్టు చెబుతున్న ఆమె...నిజంగా నిర్భయంగా పనిచేయాలనుకుంటే...ముగ్గురు ఎమ్మెల్యేల అనధికార నిర్మాణాలు తాను చూపిస్తానని, దమ్ముంటే వాటిని కూలగొట్టాలని సవాల్‌ చేశారు. సోమవారం దీనికి ముహూర్తం పెట్టుకుందామని ఆహ్వానించారు. ఐఏఎస్‌ అధికారులు పార్టీలకు అతీతంగా పనిచేయాలని, ఏ పార్టీ అధికారంలో వుంటే వారికి అనుకూలంగా ఉంటూ, ప్రతిపక్షాలను వేధించడం తగదని సూచించారు.  


గీతంపై దాడి...విశాఖ ప్రతిష్ఠకే దెబ్బ: టీడీపీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్

గీతం విశ్వవిద్యాలయంపై దాడి...ఒక విద్యాసంస్థపై దాడి కాదని...విశాఖ పేరు ప్రతిష్ఠలను దెబ్బ తీసే కుట్ర అని తెలుగుదేశం విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. ఆయన శనివారం విలేఖరులతో మాట్లాడుతూ, గీతం చైర్మన్‌ శ్రీభరత్‌ మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఎంపీగా పోటీ చేయడం వల్లే వైసీపీ ఇలా కక్ష సాధింపునకు దిగిందన్నారు. గీతం 108 ఎకరాల్లో ఉందని, అందులో 37 ఎకరాలు ఆక్రమణ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అదంతా ప్రభుత్వ స్వాధీనంలోనే ఉందన్నారు. అధికారులు కూడా దాడులకు వెళ్లినప్పుడు పునరాలోచన చేయాలని సూచించారు.


శనివారమే ఎందుకంటే...?

ఎటువంటి నోటీసు ఇవ్వకుండా శనివారం నిర్మాణాలు కూల్చడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. కోర్టుల్లో శనివారం కేవలం పరిపాలనా పరమైన పనులే చేస్తారు. జిల్లా స్థాయిలో పిటిషన్లు ఏవీ తీసుకోరు. హై కోర్టులో కూడా హౌస్‌ మోషన్‌ పెడితే తప్ప ఆ ఫైల్‌ పరిశీలించరు. అందులో సీరియస్‌నెస్‌ లేకపోతే సోమవారానికి వాయిదా వేసేస్తారు. అంటే కోర్టులకు వెళ్లినా ఆ రోజు చేయగలిగేది ఏమీ ఉండదు. మరుసటిరోజు ఆదివారం పూర్తిగా సెలవు. ఈ రెండు రోజుల్లో అధికారులు తాము అనుకున్నది పూర్తి చేసేస్తారు. అంటే నిర్మాణం ఏమీ మిగలనీయరు. సోమవారం ఏ కోర్టు నుంచి ఏమి తెచ్చుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకే ప్రభుత్వ పెద్దలు, అధికారులు కూల్చడానికి శనివారాన్ని ఎంచుకుంటున్నారు.

Updated Date - 2020-10-25T10:26:21+05:30 IST