విశ్వాస పరీక్ష నెగ్గిన గెహ్లోత్‌

ABN , First Publish Date - 2020-08-15T07:52:54+05:30 IST

రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లోత్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ సర్కారు అసెంబ్లీలో విశ్వాస పరీక్షను నెగ్గింది...

విశ్వాస పరీక్ష నెగ్గిన గెహ్లోత్‌

  • రాజస్థాన్‌ కాంగ్రెస్‌ సంక్షోభం సుఖాంతం


జైపూర్‌, ఆగస్టు 14: రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లోత్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ సర్కారు అసెంబ్లీలో విశ్వాస పరీక్షను నెగ్గింది. శుక్రవారం ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో మూజువాణి ఓటుతో ప్రభుత్వం విశ్వాస పరీక్షను నెగ్గినట్లు స్పీకర్‌ ప్రకటించారు. గెహ్లోత్‌పై తిరుగుబాటు జెండా ఎగరేసిన సచిన్‌ పైలట్‌.. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి తిరిగి సొంత గూటికి చేరడంతో అందరూ ఊహించినట్లే జరిగింది. ఈ తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా గెహ్లోత్‌ మాట్లాడుతూ.. తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ కుట్ర చేసిందంటూ మరోసారి ఆరోపించారు.


ఎప్పటికీ అటువంటి కుట్రలను తాను సాగనివ్వబోనన్నారు. అయితే కాంగ్రెస్‌ అంతర్గత కుమ్ములాటలకు తమపై నిందలేస్తోందని బీజేపీ విమర్శించింది. కాగా, డిప్యూటీ సీఎం పదవిని కోల్పోయిన సచిన్‌ పైలట్‌కు చివరి వరుసలో సీటు కేటాయించడం చర్చనీయాంశమయింది. గతంలో డిప్యూటీ సీఎం హోదాలో మొదటి వరుసలో సీఎం గెహ్లోత్‌ పక్క సీట్లోనే కూర్చున్న పైలట్‌కు శుక్రవారం చివరి వరుసలో ప్రతిపక్ష బీజేపీ సభ్యులకు దగ్గరగా సీటు కేటాయించారు. దీనిపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే బలమైన యోధుడిని బోర్డర్‌కు పంపించినట్లుగా తాను భావిస్తున్నానని ఆ తరువాత వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత వసుంధర రాజే అసెంబ్లీకి ఆకుపచ్చ చీర కట్టుకుని వచ్చారు. 

Updated Date - 2020-08-15T07:52:54+05:30 IST