దయాగుణం, సత్యనిష్ఠ.. దైవ సమానాలు

ABN , First Publish Date - 2020-03-30T07:07:22+05:30 IST

మహాకవి బమ్మెర పోతన ఈ చిన్నపద్యంలోనే గొప్ప ధర్మాన్ని నిక్షేపించి చెప్పాడు. మనిషి ఆచరించాల్సిన ధర్మ విశిష్టతను తేలికైన పదజాలంలో వెల్లడించాడు. మనిషి దైవాన్ని ఆరాధించడమే కాక...

దయాగుణం, సత్యనిష్ఠ.. దైవ సమానాలు

  • చేతులారంగ శివుని పూజింపడేని
  • నోరునొవ్వంగ హరి కీర్తి నుడువడేని
  • దయయు సత్యంబు లోనుగా దలపడేని
  • కలుగనేటికి తల్లుల కడుపు చేటు

మహాకవి బమ్మెర పోతన ఈ చిన్నపద్యంలోనే గొప్ప ధర్మాన్ని నిక్షేపించి చెప్పాడు. మనిషి ఆచరించాల్సిన ధర్మ విశిష్టతను తేలికైన పదజాలంలో వెల్లడించాడు. మనిషి దైవాన్ని ఆరాధించడమే కాక.. హరిహర అభేదాన్ని కూడా పాటించాలని చెప్పకుండానే చెప్పాడు. కాయికంగా పరమ శివుని పూజిస్తూనే.. వాచికంగా శ్రీమన్నారాయణుని స్తుతించాలనడం ద్వారా అద్వైతాన్ని ప్రబోధించాడు. అంతేకాదు.. మనిషి తను జీవించే ప్రపంచంలోని సమస్త జీవరాశులపైన, తనకు బతుకునిచ్చే సర్వ ప్రకృతి విషయంలో దయాగుణంతో వ్యవహరించాలని, జీవితమంతా సత్యనిష్ఠతో గడపాలని బోధించాడు. దయ, సత్యం అనే ఈ రెండు గుణాలు భగవంతునితో సమానమైనవి గనుకనే పోతనామాత్యుడు ఈ ప్రతిపాదన చేశాడు. మానవ జీవితంలో దయ, జాలి, కరుణ అనేవి చాలా ముఖ్యమైనవి. ప్రపంచం సవ్యంగా సాగడానికి దయయే కారణభూతమవుతుంది. అందుకే భాగవతం ఈ గుణానికి దైవ సమాన స్థాయి కల్పించింది. అందుకే.. కృష్ణుడి వద్దకు వెళ్లిన కుచేలుడి చేత పోతన ‘నితాంతాపార భూత దయ’ కావాలని అడిగించాడు. జీవుల పట్ల ఎవరైనా దయారహితులై వాటికి హాని తలపెడితే లోకం సర్వనాశనమవుతుందని కూడా భాగవతం చెప్పడం గమనిస్తే భూతదయ ఎంతటి గొప్పదో తెలుస్తున్నది. అదే స్థాయి ‘సత్య’ నిష్ఠకు కూడా భాగవతం కల్పించింది. ‘సత్యమేశ్వరో లోకీ’ అన్న ధర్మాన్ని పాటించిన జాతి మన భరతజాతి. సత్యాన్నే జీవిత లక్ష్యంగా తమ జీవితాల్ని మలచుకున్న మహాపురుషుల జీవితాలనే గ్రంథరూపంలో రుషులు మనకు అందించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని విధాల ఆటంకాలు ఏర్పడినా సత్యవ్రతాన్ని తప్పని వీరులకు పుట్టినిల్లు భారతదేశం. వారి సత్యనిష్ఠయే మనకు నేటికీ  ప్రమాణమై నిలిచింది. యావద్విశ్వంలోని మానవ జాతికి ఇదొక దిక్సూచి. అందుకే పోతన సత్యనిష్ఠను దైవ పూజతో సమానంగా భావించాడు.

ఇటువంటి ఉత్తమ గుణాలు లేని మానవుని జన్మ నిరర్థకం. ఎవరైతే లోకంపై దయ, సత్య నియమం పాటించడో అటువంటి వ్యక్తి తల్లుల కడుపుచేటుగా పుట్టిన వాడని పోతన తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. అటువంటి దయారహితుడు, సత్య దూరుడు జన్మించడమే వృథా అని తీవ్రస్థాయిలో చెప్పడం వెనక ఈ గుణాల యొక్క అవసరం మానవ జాతికి ఎంత ఉన్నదో ధ్వనిస్తున్నది. భాగవతంలోని భక్తుల కథల్లోగానీ, భగవదవతార సంబంధిత కథల్లోగానీ.. దయాగుణం, సత్యనిష్ఠ రెండూ అంతర్వాహినిగా ప్రవహిస్తూనే ఉంటాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ లక్ష్యంగా సాగిన భగవంతుని లీలల నేపథ్యం దయాగుణం వల్లనే సాధ్యమైంది. లోక కంటకులైన దుష్టులను సంహరిస్తానన్న దైవ వాక్కు సత్యమై నిలిచిన కథలే భాగవత కథలు. అందుకే ఈ రెండు గుణాలూ భగవత్సమానమైన గుణాలుగా కీర్తింపబడ్డాయి.

- గన్నమరాజు గిరిజామనోహర బాబు


Updated Date - 2020-03-30T07:07:22+05:30 IST