బాధితులకు ఉదారంగా సాయం

ABN , First Publish Date - 2020-10-21T08:07:05+05:30 IST

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో ముంపునకు గురయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

బాధితులకు ఉదారంగా సాయం

వరద మృతులకు రూ.5 లక్షలు

ప్రతి ఇంటికీబియ్యం, పప్పు, ఉల్లి, ఆలూ 

నెలాఖరులోగా పంట, ఆస్తి నష్టం నివేదికలు

సీజనల్‌ అంటువ్యాధులపై అప్రమత్తం

కరోనా పాజిటివిటీ తగ్గడం సంతోషకరం

నేడు బీమా పథకం ప్రీమియం చెల్లింపు

వారంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ

15లోగా అక్టోబరు నెల ఇన్‌పుట్‌ సబ్సిడీ

కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ వీసీ


అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో ముంపునకు గురయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. వరద ప్రాంత బాధితుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని, ముంపునకు గురైన ప్రతి ఇంటికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు పామాయిల్‌,  కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు తప్పనిసరిగా పంపిణీ చేయాలన్నారు. మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్‌ కలెక్టర్లతో ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘‘సహాయ శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 చేతిలో పెట్టండి. వరద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలి. ఇప్పటి వరకూ 19 మంది చనిపోగా, 14 మందికి పరిహారం అందింది. మిగతావారికీ పరిహారం త్వరలోనే చెల్లించా’’లని సీఎం జగన్‌ ఆదేశించారు. వరద నష్టం అంచనాతోపాటు, కావాల్సిన బడ్జెట్‌ అంచనాలపై ఈ నెలాఖరులోగా నివేదికలు పంపాలన్నారు.


కాగా, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని వైఎస్సార్‌ భరోసా రెండో విడత చెల్లింపుతో పాటు ఇస్తామని తెలిపారు. ‘‘జూన్‌, జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల ఇన్‌పుట్‌ సబ్సిడీని ఈ నెల 27న అందిస్తాం. ఖరీఫ్‌ పంటలకు సంబంధించి రూ.113 కోట్లు, ఉద్యాన పంటలకు సంబంధించి రూ.32 కోట్లు... మొత్తం రూ.145 కోట్లు చెల్లిస్తున్నాం. అక్టోబరు ఇన్‌పుట్‌ సబ్సిడీని నవంబరు 15లోగా చెల్లించాలి. అటవీభూముల పట్టాలు ఇచ్చిన గిరిజన రైతులకూ వైఎస్సార్‌ రైతు భరోసాకింద రూ.11,500 ఇవ్వనున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు.  రాష్ట్రంలో కొవిడ్‌ పరీక్షలు రోజుకు 70,000 చేస్తున్నామని.. పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని సంతోషం వ్యక్తం చేశారు.  గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, స్కూళ్లకు ప్రహారీల నిర్మాణాలు వచ్చే ఏడాది మార్చి నెలాఖరునాటికి పూర్తి చేయాలని  ఆదేశించారు. స్కూళ్లలో ‘నాడు-నేడు’ విషయంలో జాయింట్‌ కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. వైఎస్సార్‌ బీమా పథకానికి గాను బ్యాంకు ఖాతాల్లో బుధవారం ప్రీమియం జమ చేస్తామని, వారం రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ మొత్తం చేరుతుందన్నారు. ఉచిత విద్యుత్తు రైతు హక్కు అని, అందుకే మీటర్లను బిగిస్తున్నామన్నారు.


హస్తకళాకారులకు ఏటా 10వేలు

హస్తకళల ద్వారా జీవనోపాధి పొందుతున్న వారికి ఏటా రూ.10వేల ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం ప్రకటించారు. ప్రాచుర్యం పొందిన కళలు, వృత్తులకు మరింత గుర్తింపు తెచ్చేందుకు వారి ఉత్పత్తులకు ఆప్కో ఆన్‌లైన్‌ స్టోర్‌, లేపాక్షి వెబ్‌స్టోర్‌ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఉత్పత్తులకు మరింత మార్కెటింగ్‌ కల్పించే ‘ఆప్కో-లేపాక్షి’ ఆన్‌లైన్‌ పోర్టల్స్‌ను మంగళవారం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం ఆవిష్కరించి.. ఆన్‌లైన్‌లో ఒక చీర కొనుగోలు చేశారు.

Updated Date - 2020-10-21T08:07:05+05:30 IST