వెరైటీగా ప్రపోజ్ చేసిన ప్రియుడు.. చూసి షాకైన ప్రేయసి.. నెట్టింట్లో వైరల్

ABN , First Publish Date - 2020-02-14T22:42:22+05:30 IST

ప్రియురాలికి వెరైటీగా పెళ్లి ప్రతిపాదన పెట్టిన ఓ యువకుడు.. తన ప్రయత్నం కాస్తా గూగుల్స్ మ్యాప్స్‌లో ప్రత్యక్షం కావడంతో ఎగిరిగంతేశాడు...

వెరైటీగా ప్రపోజ్ చేసిన ప్రియుడు.. చూసి షాకైన ప్రేయసి.. నెట్టింట్లో వైరల్

హుటెన్‌బర్గ్ (జర్మనీ): ప్రియురాలికి వెరైటీగా పెళ్లి ప్రతిపాదన పెట్టిన ఓ యువకుడు.. తన ప్రయత్నం కాస్తా గూగుల్స్ మ్యాప్స్‌లో ప్రత్యక్షం కావడంతో ఎగిరిగంతేశాడు.  ఆమె చూస్తే చాలు అనుకున్న అతడు.. ఇప్పుడు ప్రపంచం మొత్తం వైరల్ అవుతుండడంతో ఉబ్బితబ్బివుతున్నాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ వెరైటీ ప్రపోజల్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 32 ఏళ్ల సదరు యువకుడిని జపాన్‌కు చెందిన రైతు స్టీఫెన్ స్క్వార్జ్‌గా స్థానిక మీడియా పేర్కొంది.  ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా’’ అని అర్థం వచ్చేలా మొక్కజొన్న మొక్కల మధ్య ఖాళీలు వదిలి అతడు దీన్ని రూపొందించాడు. ఈ విధంగా మొక్కలు నాటేందుకు అతడు ఓ మెషీన్ ఉపయోగించాడు. సెంట్రల్ జర్మనీలోని హుటెన్‌బర్గ్‌లో ఉన్న ఈ మొక్కజొన్న తోటను తన ప్రియురాలు ఓ డ్రోన్ సాయంతో వీక్షించిందని స్టీఫెన్ పేర్కొన్నాడు. తన సందేశాన్ని చూసిన వెంటనే షాకయిందనీ.. తన ప్రపోజల్ నచ్చి.. ఆమె పెళ్లి ఒప్పుకుందంటూ గతేడాది మే నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు.


కాగా కెనడాలో ఉంటున్న తన ఆంటీ గూగుల్స్ మ్యాప్స్‌లో దీన్ని గుర్తించేంత వరకు ఇది రికార్డయ్యిందని తమకు తెలియదనీ... గూగుల్ మ్యాప్స్‌లో కనిపిస్తుందని అస్సలు ఊహించలేదని స్టీఫెన్ పేర్కొన్నాడు. తాజాగా దీని తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇది చాలా అరుదైన ప్రపోజల్ అంటూ నెటిజన్ల నుంచి స్టీఫెన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘నెక్ట్స్ లెవెల్’’ అంటూ ట్విటర్లో ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘‘మొక్కజొన్న పొత్తులా నీ ప్రయత్నం చాలా బాగుంది..’’ అంటూ మరో నెటిజన్ కితాబిచ్చాడు. అన్నట్టు స్టీఫెన్, అతడి ప్రియురాలు ఈ ఏడాది జూన్‌లో వివాహం చేసుకోనున్నారట!

Updated Date - 2020-02-14T22:42:22+05:30 IST