జర్మనీ.. జీవించనీ!

ABN , First Publish Date - 2020-04-09T08:24:44+05:30 IST

వైరస్‌ నిజం! ముప్పు నిజం! ఇలాంటి సమయంలో వీలైనన్ని ప్రాణాలను కాపాడటమే ముఖ్యం! జర్మనీ విజయవంతంగా ఈ పని చేయగలుగుతోంది. కరోనాతో ఐరోపా మొత్తం తల్లడిల్లుతుండగా...

జర్మనీ.. జీవించనీ!

  • కరోనాపై ప్రణాళికాబద్ధ పోరు.. అతి స్వల్పంగా మరణాలు 


వైరస్‌ నిజం! ముప్పు నిజం! ఇలాంటి సమయంలో వీలైనన్ని ప్రాణాలను కాపాడటమే ముఖ్యం! జర్మనీ విజయవంతంగా ఈ పని చేయగలుగుతోంది. కరోనాతో ఐరోపా మొత్తం తల్లడిల్లుతుండగా.. ప్రణాళికబద్ధమైన కార్యాచరణతో జర్మనీలో మృతుల సంఖ్యను గణనీయంగా తగ్గించగలుగుతున్నారు. 


దీనికి కారణాలేమిటంటే... 


‘పరీక్ష’కు సిద్ధం: జర్మనీలోకి కరోనా అడుగు పెట్టకముందే, బెర్లిన్‌లోని ఛారిటీ ఆస్పత్రి వైరస్‌ టెస్టింగ్‌ పద్ధతిని కనిపెట్టింది. ఈ ఫార్ములాను ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో ఉంచింది. ఫిబ్రవరి నాటికి దేశంలోని అన్ని ప్రయోగశాలలు టెస్ట్‌ కిట్‌లను సిద్ధంగా ఉంచుకున్నాయి.

లక్షల్లో పరీక్షలు: ఐరోపాలోని మరే ఇతర దేశంలోనూ చేయనన్ని కరోనా పరీక్షలు జర్మనీలు (వారానికి 3.5 లక్షలు) చేస్తున్నారు.

అందరికీ పరీక్షలు: చాలా దేశాల్లో కరోనా లక్షణాలు ఉన్న, లేదా వైరస్‌ సోకిన వారితో నేరుగా ‘కాంటాక్ట్‌’ అయిన వారికే పరీక్షలు చేస్తున్నారు. జర్మనీలో అలా కాదు. ఒక్కరికి పాజిటివ్‌ వచ్చినా... ఆ ఆవరణలోని అందరికీ పరీక్షలు చేసేస్తున్నారు. 

ఇంట్లోనే వైద్యం: వైరస్‌ సోకిన వారందరిలో చాలామందికి ఇళ్లలోనే చికిత్స అందిస్తున్నారు. ‘కరోనా ట్యాక్సీ’ అని పిలుచుకునే వాహనాల్లో వైద్య సిబ్బంది రోగుల ఇళ్లకు వెళ్లి పరిశీలిస్తున్నారు. 4/5 రోజులకోసారి నమూనాలు సేకరిస్తారు. పరిస్థితి మెరుగు పడకపోతేనే ఆస్పత్రికి తరలిస్తారు.

సిద్ధంగా ఆస్పత్రులు: కరోనా తీవ్రంగా ప్రబలకముందే జర్మనీలోని అన్ని ప్రధాన ఆస్పత్రుల్లో ఐసీయూల్లో పడకల సంఖ్య పెంచారు. వెంటిలేటర్లను సమకూర్చుకున్నారు. సిబ్బంది సంఖ్యను దాదాపు 50ు పెంచారు.

రక్షకులకు రక్ష: కరోనా కట్టడిలో కీలక పాత్ర పోషిస్తున్న వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బందికి ప్రతి వారం కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

క్రమశిక్షణతో ప్రజలు: భౌతిక దూరాన్ని పాటించడంతోపాటు ప్రభుత్వ మార్గదర్శకాలను జర్మన్‌ పౌరులు క్రమశిక్షణతో పాటిస్తున్నారు.


Updated Date - 2020-04-09T08:24:44+05:30 IST