దక్షిణ కొరియాను అనుసరిస్తున్న జర్మనీ

ABN , First Publish Date - 2020-03-30T21:52:47+05:30 IST

కరోనాను కట్టడి చేయడంలో దక్షిణ కొరియా అనుసరించిన పద్దతినే జర్మనీ కూడా పాటించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే నిత్యం రెండు లక్షల మందికి పరీక్షలు

దక్షిణ కొరియాను అనుసరిస్తున్న జర్మనీ

బెర్లిన్: కరోనాను కట్టడి చేయడంలో దక్షిణ కొరియా అనుసరించిన పద్దతినే జర్మనీ కూడా పాటించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే నిత్యం రెండు లక్షల మందికి పరీక్షలు నిర్వహించేందుకు సిద్దమైంది. యూరప్‌లోని మిగతా దేశాలతో పోల్చుకుంటే జర్మనీ అధికంగా వారానికి ఐదు లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పుడు ఈ సంఖ్యను మరింత పెంచాలని నిశ్చయించుకుంది. దక్షిణ కొరియాలో జీపీఎస్ ట్రాకింగ్, క్రెడిట్ కార్డ్ హిస్టరీని ఉపయోగించి కరోనా సోకిన వారిని ప్రభుత్వం వెంటనే గుర్తించగలిగింది. అంతేకాకుండా కరోనా సోకిన ప్రాంతాల్లో వేరే వారు ప్రయాణించకుండా ఆపగలిగింది. మరోపక్క దక్షిణ కొరియాలో వైద్య రంగం అడ్వాన్స్‌డ్‌గా ఉండటం కూడా కరోనా కట్టడికి ఉపయోగపడింది. తమ దేశంలో మొదటి కరోనా కేసు నమోదైనప్పుడే ప్రభుత్వం అలర్ట్ అయినట్టు ఓ అధికారి తెలిపారు. వెంటనే 2 లక్షల 60 వేల మందికి పరీక్షలు నిర్వహించామని చెప్పారు. 


ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా వైద్య పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. ఈ కారణంగా ప్రజలు స్వచ్చంధంగా ఆసుపత్రులకు వచ్చి పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. కేవలం ఐదు నుంచి ఆరు గంటల్లో ఫలితాలను ఆయా వ్యక్తులకు చేరవేశామన్నారు. పాజిటివ్ అని తెలిసిన వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని.. వారు వేరొకరికి వైరస్ అంటించకుండా జీపీఎస్ ట్రాకింద్ ద్వారా జాగ్రత్తలు తీసుకున్నామని అధికారి పేర్కొన్నారు. ప్రైవేట్ కంపెనీలు, ల్యాబ్స్‌ భాగస్వామ్యంతో వేగంగా స్పందించామని, టెక్నాలజీని కూడా సద్వినియోగం చేసుకోగలిగామని అన్నారు. ఆదివారం దక్షిణ కొరియాలో కేవలం 78 కేసులు మాత్రమే నమోదైనట్టు ప్రభుత్వం వెల్లడించింది. కాగా.. ఇప్పుడు ఇవే పద్దతులను జర్మనీ అనుసరించనుంది. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా కరోనా సోకిన వారి వివరాలను తెలుసుకోనుంది. కాగా.. జర్మనీలో ఆదివారం ఒక్కరోజే 4,751 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు 52,547 మంది కరోనా బారిన పడ్డారు. అంతేకాకుండా మృత్యువాతపడిన వారి సంఖ్య 455కు చేరింది. 

Updated Date - 2020-03-30T21:52:47+05:30 IST