పదోతరగతికే పెళ్లి!

ABN , First Publish Date - 2021-03-08T08:02:29+05:30 IST

ఆదిలాబాద్‌లోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయం(కేజీబీవీ)లో ఓ విద్యార్థిని(15) గత ఏడాది పదోతరగతి పూర్తిచేసింది.

పదోతరగతికే పెళ్లి!

  • వేలాదిమంది కేజీబీవీ విద్యార్థినులకు బాల్యవివాహాలు
  • కూలిపనుల్లోకి 2వేలమందికి పైగా బాలికలు
  • పది నుంచి ఇంటర్‌కు రాని 5వేలమంది
  • బంగారుతల్లుల భవితపై లాక్‌డౌన్‌ ప్రభావం

హైదరాబాద్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌లోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయం(కేజీబీవీ)లో ఓ విద్యార్థిని(15) గత ఏడాది పదోతరగతి పూర్తిచేసింది. ఇప్పుడు ఇంటర్‌ తరగతులకు హాజరు కావడం లేదు. ఉపాధ్యాయులు ఆరా తీస్తే.. లాక్‌డౌన్‌లోనే ఆమెకు వివాహం అయిపోయి, ఇటీవలే ఓ శిశువుకు కూడా జన్మనిచ్చిందని తేలింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మరో విద్యార్థిని(15) చదువుల తల్లిగా పేరు తెచ్చుకునేంది. ఇప్పుడు తల్లిదండ్రులతోపాటు కూలిపనులకు వెళ్తోంది. ఇది కేవలం ఇద్దరు విద్యార్థినుల పరిస్థితి మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 475 కేజీబీవీల్లో ఈ తరహా ఉదాహరణలు కోకొల్లలు. గత ఏడాది లాక్‌డౌన్‌ రాష్ట్రంలోని లక్షలాదిమంది పేద కుటుంబాలను రోడ్డుకు ఈడ్చింది. పనులు లేకపోవడంతో మరింత దారిద్య్రంలోకి నెట్టింది. ఆ ప్రభావం వందలాది విద్యార్థినుల భవిష్యత్తుపై పడింది.


ప్రతి ఏటా పోటీ.. కానీ..

గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు అరికట్టాలంటే.. వసతితో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే ఏకైక పరిష్కారమని భావించిన కేంద్రప్రభుత్వం కేజీబీవీలను ప్రారంభించింది. నిరుపేద, అనాథ బాలికలకు ఇందులో 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఉచిత విద్య అందిస్తారు. 2004లో దేశవ్యాప్తంగా వీటిని ప్రారంభించాక తక్కువ కాలంలోనే అనేక మార్పులు వచ్చాయి. 6వ తరగతిలో ప్రవేశం లభిస్తే ఇంటర్‌ పూర్తయ్యేవరకు పైసా ఖర్చు లేకుండా గురుకుల విద్య లభిస్తుండటంతో.. బాల్యవివాహాలకు చాలావరకు అడ్డుకట్ట పడింది. దీంతో వెనుకబడిన జిల్లాల్లో ప్రతి ఏటా కేంద్రం కేజీబీవీలను ఏర్పాటుచేస్తోంది. రాష్ట్రంలో 475 కేజీబీవీలకు గాను 172 విద్యాలయాల్లో ఇంటర్‌ వరకు విద్య లభిస్తోంది. కానీ గత ఏడాది మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించింది. కేజీబీవీల్లో మొత్తం 15,704 మంది 10వ తరగతి విద్యార్థులుండగా.. వారంతా ఈసారి ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు తీసుకోవాల్సి ఉంది. వీరిలో ఐదువేలకు పైగా విద్యార్థులు కేజీబీవీల్లోనే కాదు.. మరెక్కడా ఇంటర్‌ ప్రవేశాలు పొందలేదని అధికారవర్గాలు భావిస్తున్నాయి. వారిలోనూ 3వేలమందికి పైగా విద్యార్థినులకు బాల్యవివాహాలు అయిపోయి ఉండవచ్చని, 2వేలకు పైగా విద్యార్థినులు బాల కార్మికులుగా మారారని అంచనా వేస్తున్నారు.


ప్రభుత్వం వారిని తిరిగి బడికి రప్పించాలి

లాక్‌డౌన్‌లో పేద కుటుంబాల్లో తలెత్తిన ఆర్థిక సమస్యల కారణంగా బాల్యవివాహాలు ఎక్కువగా జరిగాయి. పాఠశాలలో చదువుకునే బాలికకు వివాహం నిశ్చయమైతే ఆమె స్నేహితులు, ఇరుగుపొరుగువారికి తెలుస్తుంది. దీంతో బాల్యవివాహాన్ని ఆపేందుకు పోలీసులు వెంటనే స్పందించేవారు. ఈసారి లాక్‌డౌన్‌లో ఆ పరిస్థితి లేదు. వేలమంది ఆడపిల్లలు కూలిపనులకు వెళ్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారిపై దృష్టి సారించాలి. చదువు మానేసిన విద్యార్థులను తిరిగి బడులకు తెప్పించేలా కార్యక్రమాలు చేపట్టాలి.  

వర్ష భార్గవి, సలహాదారు, బాలల హక్కుల సంరక్షణ ఫోరం (సీఆర్‌పీఎఫ్‌)

Updated Date - 2021-03-08T08:02:29+05:30 IST