‘‘కథ సోగ్గా ఉంటే లాభం లేదు’’: కా.రా.

ABN , First Publish Date - 2021-06-07T05:44:40+05:30 IST

తెలుగు కథను జీవితాంతం మోసిన కాళీపట్నం రామారావుగారిని కలిసే అవకాశం మాకు కలిగింది. ఏడాదిన్నరక్రితం గరిమెళ్ళ సత్యనారాయణ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళంలో ఏర్పాటైన సభకు హాజరయ్యాం. కె.ముత్యం, సుంకిరెడ్డి....

‘‘కథ సోగ్గా ఉంటే లాభం లేదు’’: కా.రా.

తెలుగు కథను జీవితాంతం మోసిన కాళీపట్నం రామారావుగారిని కలిసే అవకాశం మాకు కలిగింది. ఏడాదిన్నరక్రితం గరిమెళ్ళ సత్యనారాయణ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళంలో ఏర్పాటైన సభకు హాజరయ్యాం.  కె.ముత్యం, సుంకిరెడ్డి నారాయణ వంటి రచయితల చొరవతో డిసెంబర్‌ 22, 2019 తేదీన కథానిలయాన్ని సందర్శించాం. కా.రా.మాస్టారినీ కలిశాం. కేంద్ర విశ్వవిద్యాలయ పరిశోధ కులుగా మా ఉత్సాహాన్ని చూసి 96 ఏళ్ల వయసు లోనూ మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇష్టపడ్డారు. తర్వాత కొన్ని నెలలకే దేశం మొత్తం లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చింది. బహుశా ఆయన ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ ఇదే కావచ్చు.


బి. మదన్‌, జి. సుదర్శన్‌, 

బట్టు విజయ్‌ కుమార్‌, 9505520097

కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌ విద్యార్థులు



కథ ఎలా రాయాలి?

‘‘పాఠకుడిని తుళ్ళిపడేట్టు చేయాలి’’ అనే ఉద్దేశంతో కొంతమంది రాస్తారు. అలా కాకుండా తాము చూసిందో, గమనించిందో మనసును కదిలిస్తే, అదే రాస్తే, అది నిలుస్తుంది. రాయడం వల్ల నీకొచ్చే పేరు కాదు, పాఠకుడికి కలిగే ప్రయోజనం ముఖ్యం. ఆ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని రాయాలి.


ఆధునిక కాలంలో కథ నిర్మాణంగానీ, రాసే పద్ధతులు ్ఠగానీ ఎలా మారుతున్నాయి? 

అది గమనించి చదువుకుంటూ వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను దొరికింది చదువుతాను. కానీ వెదుక్కుంటూ వెళ్ళలేను. 


ఇప్పుడు ఎలాంటి కథలు వస్తే బావుంటుంది?

రచయితలు తమ సొంత లాభం కోసం కాకుండా పాఠకులను ఎడ్యుకేట్‌ చేసేట్టు రాయాలి. పాఠకుడిని చలింప చేద్దామని రాస్తే, అది రచయిత స్వార్థం. అలా కాదు, లోకంలో జరుగుతున్నది పాఠకుడికి తెలిసేట్టు రాయాలి. అప్పుడు పాఠకుడు ప్రయోజనం పొందుతాడు.  


మీకు బాగా స్ఫూర్తి కలిగించిన, ప్రభావితం చేసిన కథా రచయితలు ఎవరు ?

కొడవటిగంటి కుటుంబరావు గారు, రావిశాస్త్రి గారు వీళ్ళు నా గురువులు. ముఖ్యంగా కుటుంబరావు గారంటే చాలా గౌరవం నాకు. ఆ ఇద్దరు రాసిన తరువాతనే నేను రాయడం మొదలెట్టాను. సిటీలో ఉన్న మనుషుల గురించి కొ.కు. రాశారు. టౌన్‌లో ఉన్న మనుషుల గురించి రావిశాస్త్రి రాశారు. మరి నేను ఎవరి మీద రాయాలని ఆలోచించాను. నేను వచ్చిన, నాకు తెలిసిన గ్రామీణ జీవితం గురించి రాశాను. ఆ గ్రామీణ ప్రజలు చదివి ప్రయోజనం పొందితే బాగుంటుందనే ఆలోచనతోనే రాసాను.


పాశ్చాత్య రచయితల్లో నచ్చే రచయితలు?

నేను పాశ్చాత్య రచయితల్ని చదువుకోలేదు. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ని.


‘యజ్ఞం’ గాక మీ కథల్లో మీకు బాగా నచ్చింది?

చివరి రోజుల్లో, అంటే నా పుస్తకం చివర్లో ఉంటాయే, ఆ కథలంటే బాగా ఇష్టం.


కథలో వస్తువును ఎలా ఎంచుకోవాలి?

ఆధునిక పాఠకులను దృష్టిలో పెట్టుకోవాలి. వారికి ఎలాంటి కథలు అవసరమో అలాంటి వస్తువు ఎంచుకోవాలి.


మీరు ప్రత్యేకించి కథలే చదువుతారా? ఇతర ప్రక్రియలూ చదువుతారా?

కవిత్వం పెద్దగా తెలియదు. కవిత్వం జోలికి నేను పోలేదు. జీవితాన్నిగానీ, సమాజాన్ని గానీ అర్థం చేసుకోవడానికి ఉప యోగపడే ఏ రచనైనా సరే, నేను చదువుతాను. అందుకు కథ, నవల అనువు.


ఎలాంటివి చదువుతారు?

కథ అందంగా ఉంటే సరిపోదు, సోగ్గా ఉంటే లాభం లేదు. మనల్ని కదిలించి దాని ద్వారా మనం లాభం పొందేట్టు చెయ్యాలి. ఏది లాభమో చెప్పటం కాదు, లాభం పొందేట్టు చెయ్యాలి. 


కథలో శిల్పాన్ని పట్టుకోవడం ఎలా? 

రాయడానికి చేసే ప్రయత్నంలో శిల్పం ఏర్పడుతుంది. శిల్పం లేనిది ఏముంటుంది? ఆ కాళ్ళు తుడుచుకునే గుడ్డకి కూడా శిల్పం ఉంది.


యువ కథా రచయితలకు మీరిచ్చే సూచనలు?

ముందు రాయడం ఎలాగో ప్రయత్నం చెయ్యాలి. రాయడం అంటే అందంగా రాయడం కాదు. చదివిన తర్వాత పాఠకు లని కథ వదలకూడదు, వెంటాడాలి. ఎవరైనా ఎలా రాస్తే మీరు వదులుకోలేకుండా చదువుతారో, మీరు అలా రాయాలి. కీర్తి కోసం రాయకూడదు. అలా రాస్తే అక్కడే ఆగిపోతాం.


మీరు దేవుణ్ణి నమ్ముతారా?

(నవ్వుతూ) అంత గొప్పవాణ్ణి అనుకోకుండా, నమ్మేవాణ్ణి, ఆ కాలంలో. (పుస్తకాల్లో ఉన్న ఒక పేపర్‌ తీసిచూపుతూ) ఇది నా జాతక చక్రం. (చూడమని అందించారు). 


ఈ జాతకం ఎవరు రాశారు?

బలివాడ కాంతారావు.


మీ జీవితం జాతకం ప్రకారమే జరిగిందా?

జరుగుతుంది అనుకున్నాను. జరగలేదు.


ఈ కథా నిలయం ఏర్పాటు చెయ్యాలనే స్ఫూర్తి ఎలా వచ్చింది?

కొన్ని కథలు ఎంత వెతికినా దొరికేవి కావు. తెలుగులో కథలన్నీ ఒకేచోట దొరికే విధంగా ఉండాలని ఆలోచించాను. 


కథానిలయంకు సంబంధించి భవిష్యత్తు ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా సర్‌?

అది ఇప్పటి తరం ఆలోచించాలి.   

Updated Date - 2021-06-07T05:44:40+05:30 IST