ఎన్నాళ్లో..వేచిన ఉదయం..

ABN , First Publish Date - 2020-05-24T10:14:41+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో చిక్కుకుపోయిన ఒడిష్శా రాష్ట్ర వలస కూలీలకు ఎట్టకేలకు

ఎన్నాళ్లో..వేచిన ఉదయం..

ఒడిష్శా వలస కూలీలకు మోక్షం

ప్రత్యేక రైలులో సొంతూళ్లకు పయనం

చార్జీలు భరించనున్న రాష్ట్ర ప్రభుత్వం


మహబూబ్‌నగర్‌, మే 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో చిక్కుకుపోయిన ఒడిష్శా రాష్ట్ర వలస కూలీలకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. దక్షిణ మధ్య రైల్వే మహబూబ్‌నగర్‌ నుంచి భువనేశ్వర్‌ వరకు ఈ కూలీల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది. దీంతో శనివారం రాత్రి వీరు మహబూబ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి బయల్దేరి వెళ్లారు. మహబూబ్‌నగర్‌, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో దాదాపు 1,569 మంది కూలీలు ఉండగా, వీరు ఇటుక బట్టీలు, డెయిరీ ఫారాలు, హోటళ్లు, పౌలీ్ట్రఫారాల్లో పని చేస్తున్నారు. తాము సొంత రాష్ట్రానికి వెళతామని పలు మార్లు విజ్ఞప్తి చేసిన తరువాత స్పందించిన ప్రభుత్వం, వేళ్లే వారి జాబితాను సిద్ధం చేసింది.


తొలుత మహబూబ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌కు పనిప్రదేశాల నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఈ కూలీలందరికీ థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసి పరీక్షలు జరిపారు. వీరందరికీ రైలులో ప్రయాణించేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకొక్కరికి ఒక భోజనం ప్యాకెట్టు, మూడు లీటర్ల తాగునీరు, రెండు బిస్కట్‌ ప్యాకెట్లను అందిస్తున్నామని రెవెన్యూ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ ప్రత్యేక రైలుకు ఛార్జీలు చెల్లించిందని అధికారులు తెలిపారు. కాగా మహబూబ్‌నగర్‌ నుంచి ప్రత్యేక రైలులో ఒడిష్శాకు తరలి వెళ్తున్న వలస కూలీలను రైల్వే స్టేషన్‌ వద్ద ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కలిశారు. కార్మికులంతా మళ్లీ రావాలని, ఇక్కడ అవసరమైన పనులు కల్పిస్తామని మంత్రి చెప్పారు.

Updated Date - 2020-05-24T10:14:41+05:30 IST