Abn logo
Apr 8 2020 @ 05:00AM

ఇళ్ల నుంచి బయటకొస్తే జైలుకే

విపత్తుల నిర్వహణ చట్టం కింద కేసులు

గుంటూరువాసులకు హెచ్చరిక జారీ చేసిన కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌


గుంటూరు, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): గుంటూరులో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోన్న దృష్ట్యా ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రావ్దొని, ఎవరైనా ఇళ్ల నుంచి బయటకు వస్తే విపత్తుల నిర్వహణ చట్టం కింద కేసు నమోదై జైలుపాలు కావాల్సి ఉంటుందని కలెక్టర్‌ ఇందుపల్లి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్‌కి ప్రతీ ఒక్కరూ సహకరించాలన్నారు. నగరంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే నిత్యవసర సరుకుల కొనుగోలుకు అనుమతిస్తామని చెప్పారు. రెడ్‌జోన్లుగా ప్రకటించిన చోట్ల అసలు కాలు బయటకు పెట్టడానికి వీల్లేదన్నారు.


ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ మంచి అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. ప్రాణాలకు తెగించి పోలీసులు, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, పారిశుధ్య విభాగాల అధికారులు సిబ్బంది ప్రజల కోసం పోరాడుతున్నందున ప్రజలు సహకరించాలని కోరారు. కుటుంబం, సన్నిహితులు, సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఢిల్లీకి వెళ్లి ఇంకా క్వారంటైన్‌ కేంద్రాలకు రాని వారు బయటకు రావాలని తెలిపారు. ప్రజలు నెలకు సరిపడా సరుకులు, వారానికి సరిపోను కూరగాయలు, పాలడబ్బాలు సమకూర్చుకోవాలని సూచించారు. చాలా చోట్ల దాతలు ముందుకొచ్చి భౌతిక దూరం పాటించకుండా సాయం చేస్తున్నారని అలాంటి వారిపై చర్యలు చేపడతామని హెచ్చరించారు. దాచేపల్లిలో 2 లక్షల బాటిళ్లు,  తెనాలిలో రోజుకు 8 వేల పీపీఈల ఉత్పత్తి చేస్తోన్నామన్నారు.  మొత్తం 500 మంది క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్నారన్నారు.  


పిల్లలకు బైకులు ఇస్తే తల్లిదండ్రులపై కేసు 

లాక్‌డౌన్‌ కొనసాగుతోన్నందున చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తోన్నారని అర్బన్‌ ఎస్పీ రామకృష్ణ తెలిపారు. ఇప్పటికే 2,100 వాహనాలు సీజ్‌ చేశామని, 140 షాపులు కూడా మూసివేయించడం జరిగిందన్నారు. ఎవరైనా పిల్లలు వాహనాలపై బయటకు వస్తే వారితో పాటు తల్లిదండ్రుల పైనా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో  జాయింట్‌ కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ పాల్గొన్నారు.


Advertisement
Advertisement