ఇజ్జత్‌ కా సవాల్‌

ABN , First Publish Date - 2020-11-23T07:05:58+05:30 IST

ప్రతి ఎన్నికా..

ఇజ్జత్‌ కా సవాల్‌

కావాల్సిన వారికి టికెట్లు ఇప్పించుకున్న మంత్రి తలసాని

వద్దనుకున్న వారిని పక్కనపెట్టగలిగిన పద్మారావు గౌడ్‌

శివారు కార్పొరేషన్ల ఎన్నికలలో ఫలించిన సబితా ఇంద్రారెడ్డి ఉపాయాలు

ఇప్పుడు రెండు డివిజన్లపైనే దృష్టంతా..?

2016లో కిషన్‌రెడ్డి ఎమ్మెల్యే

అప్పుడు డివిజన్లన్నీ కొల్లగొట్టిన టీఆర్‌ఎస్‌

2018లో శాసనసభ ఎన్నికల్లో కిషన్‌రెడ్డి ఓటమి

2019లో సికింద్రాబాద్‌ ఎంపీగా ఘన విజయం

సికింద్రాబాద్‌ పరిధిలో ఇప్పుడు ఎందరిని గెలిపిస్తారు?

సికింద్రాబాద్‌ పరిధిలో డివిజన్ల సంఖ్య 39


ప్రతి ఎన్నికా.. ఎందరికో రాజకీయంగా కీలకమే. గల్లీ లీడర్‌ నుంచి అగ్రనేతల దాకా.. ఇదే  పరిస్థితి. అయితే.. కొందరికి మరింత కీలకం అవుతాయి. హైదరాబాద్‌లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలకు గ్రేటర్‌ ఎన్నికలు పెడుతున్న పరీక్షలు వింతగా ఉన్నాయి. ఒకటి, రెండు డివిజన్ల గెలుపోటములు కూడా ఈ అగ్రనేతలకు ఇజ్జత్‌ కా సవాల్‌గా పరిణమిస్తున్నాయి.


పట్టు నిలుపుకున్న తలసాని, పద్మారావు

సికింద్రాబాద్‌, నవంబర్‌ 22 (ఆంధ్రజ్యోతి) : నగర రాజకీయాలపై మొదటి నుంచీ గట్టి పట్టు కలిగి ఉన్న రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, డిప్యూటీ స్పీకర్‌ తీగుల్ల పద్మారావుగౌడ్‌లు తాజాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సిట్టింగ్‌ కార్పొరేటర్ల టిక్కెట్ల కేటాయింపు విషయంలో పరస్పరం భిన్నంగా వ్యవహరించడం ద్వారా చర్చనీయాంశమయ్యారు. గడిచిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమకు నచ్చిన వారికి టిక్కెట్లు ఇచ్చి, ఒంటి చేత్తో గెలిపించుకున్న ఈ ఇద్దరు నేతలూ..... ఈ పర్యాయం కూడా తమ మాటే నెగ్గించుకున్నారు. తాము మెచ్చిన వారికే టిక్కెట్లు ఇప్పించుకున్నారు.

ఒకరికి మాత్రమే పజ్జన్న అవకాశం

సికింద్రాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు డివిజన్లు ఉన్నాయి. గడిచిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బౌద్ధనగర్‌, సీతాఫల్‌మండి, మెట్టుగూడ, అడ్డగుట్ట, తార్నాక డివిజన్లలో పద్మారావు సిఫారసు చేసిన వారికే టికెట్లు దక్కాయి. అయితే తాజా ఎన్నికల్లో నలుగురు సిట్టింగ్‌లకు పద్మారావు ఉద్వాసన పలికారు. బౌద్ధనగర్‌, మెట్టుగూడ, అడ్డగుట్ట, తార్నాక డివిజన్‌ సిట్టింగ్‌ కార్పొరేటర్లు ధనంజనగౌడ్‌, బి.ఎన్‌.భార్గవి, విజయకుమారి, ఆలకుంట సరస్వతిలకు మొండి చేయి చూపారు. సీతాఫల్‌మండి కార్పొరేటర్‌ సామల హేమకు మాత్రమే మళ్లీ అవకాశం కల్పించారు.


ఐదుగురికి మళ్లీ ఛాన్స్‌ 

సనత్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు డివిజన్లు ఉన్నాయి. రాంగోపాల్‌పేట్‌, బన్సీలాల్‌పేట్‌, బేగంపేట్‌, అమీర్‌పేట్‌, సనత్‌నగర్‌ డివిజన్లలో గడిచిన ఎన్నికల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సూచించిన వారికే టికెట్లు ఇచ్చారు. పార్టీ ఫండ్‌ను కాదని, సొంత నిధులతో శ్రమించి మరీ వీరిని తలసాని గెలిపించుకున్నారు. వీరిలో రాంగోపాల్‌పేట్‌, బన్సీలాల్‌పేట్‌, అమీర్‌పేట్‌, సనత్‌నగర్‌ సిట్టింగ్‌లు అత్తెల్లి అరుణశ్రీనివాస్‌గౌడ్‌, కుర్మ హేమలత, శేషకుమారి, లక్ష్మీబాల్‌రెడ్డిలకు మళ్లీ తలసాని ఛాన్స్‌ ఇప్పించారు. కాగా బేగంపేట్‌ సిట్టింగ్‌ కార్పొరేటర్‌ తరుణికి నిరాశ ఎదురైంది. ఇదిలా ఉండగా తన పాత నివాసం, ప్రస్తుతం ఉండే ఇల్లు వచ్చే మోండ మార్కెట్‌ డివిజన్‌పై తలసాని మరోసారి పట్టు నిలుపుకున్నారు. ఈ డివిజన్‌లోని అత్యధిక పోలింగ్‌ బూత్‌లు కంటోన్మెంట్‌ అసెంబ్లీ  నియోజకవర్గంలో, తక్కువ బూత్‌లు సనత్‌నగర్‌ నియోజకవర్గంలో ఉన్నాయి. అయినప్పటికీ మొదటి నుంచీ ఈ డివిజన్‌పై తలసాని ప్రత్యేక దృష్టి పెట్టారు. గడిచిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తన సహచరుడు ఆకుల హరికృష్ణ సతీమణి ఆకుల రూపకు టికెట్‌ ఇప్పించుకున్న తలసాని, ఈ సారి కూడా వారికే ఛాన్స్‌ ఇచ్చారు. దీనికి కంటోన్మెంట్‌ శాసనసభ్యుడు జి.సాయన్న కూడా తలసానికి సహకరించడం విశేషం.

మంత్రి సబితారెడ్డికి అగ్ని పరీక్ష

సరూర్‌నగర్‌, నవంబర్‌ 22 (ఆంధ్రజ్యోతి): జనవరిలో జరిగిన మునిసిపల్‌ ఎన్నికల్లో భాగంగా బడంగ్‌పేట్‌, మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లలో అధికార పార్టీ అరకొర స్థానాలు దక్కించుకుంది. ఆ తర్వాత చకచకా పావులు కదిపి అతి కష్టంమీద అధికారం నిలబెట్టుకుంది. స్వయానా మంత్రి సబితారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలోని ఈ రెండు కార్పొరేషన్‌లతో పాటు తుక్కుగూడ మునిసిపాలిటీలోనూ టీఆర్‌ఎస్‌ దూకుడుకు బీజేపీ చెక్‌ పెట్టింది. మొత్తం 46 వార్డులున్న మీర్‌పేట్‌లో బీజేపీ 16 స్థానాలు దక్కించుకుని గట్టి పోటీ ఇవ్వగా, 32 వార్డులున్న బడంగ్‌పేట్‌లోనూ బీజేపీ పది స్థానాలు దక్కించుకుని సత్తా చాటింది. బడంగ్‌పేట్‌లో మరో ఏడు స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలవగా, ఇద్దరు స్వతంత్రులు విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ 13 స్థానాలకే పరిమితమైంది. అధికారం చేపట్టడానికి 17 స్థానాలు అవసరం కాగా, కాంగ్రెస్‌కు చెందిన కార్పొరేటర్‌ పారిజాతానర్సింహారెడ్డిని పార్టీలో చేర్చుకుని మేయర్‌ పీఠం, స్వతంత్ర అభ్యర్థి శేఖర్‌ను దగ్గరకు తీసుకుని డిప్యూటీ మేయర్‌ పీఠం కట్టబెట్టారు. వారికి ఇతర పార్టీల సభ్యులూ మద్దతు ఇవ్వడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. మీర్‌పేట్‌లోనూ అధికారం కోసం 24 స్థానాలు అవసరం కాగా అక్కడ సైతం టీఆర్‌ఎస్‌ 19 స్థానాలకే పరిమితమయింది. బీజేపీ 16 వార్డులు, స్వతంత్రులు ఎనిమిది స్థానాలు దక్కించుకోవడం గమనార్హం. దాంతో మీర్‌పేట్‌లో కూడా స్వతంత్రులు, ఇతర పార్టీల మద్దతుతోనే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పీఠాలను దక్కించుకోగలిగింది. అటు తుక్కుగూడలోనూ బీజేపీకే మెజారీటీ స్థానాలు రాగా, ఎక్స్‌అఫిషియో సభ్యుల మద్దతుతో టీఆర్‌ఎస్‌ చైర్మన్‌ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఫలితాలు అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశాయి.

ఇప్పుడు హోరాహోరీ..

మీర్‌పేట్‌, బడంగ్‌పేట్‌, తుక్కుగూడ ఫలితాలతో పట్టు కోల్పోయిన టీఆర్‌ఎస్‌.. త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలోని రెండు డివిజన్లలో విజయం సాధిస్తుందా లేదా?.. అన్నది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇక్కడి ఆర్‌కేపురం డివిజన్‌లో బీజేపీ, సరూర్‌నగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ఉన్నారు. 2016లో జరిగిన ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తన కోడలిని ఆర్‌కేపురంలో పోటీకి దింపగా బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. దాంతో తాజా ఎన్నికల్లో ఎలాగైనా ఆ స్థానాన్ని గులాబీ ఖాతాలో వేయాలని మంత్రి సబితారెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. రేయింబవళ్లు ఇక్కడి క్యాంప్‌ కార్యాలయంలోనే ఉంటూ నాయకులకు, కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సరూర్‌నగర్‌లో మళ్లీ గెలుస్తామనే ధీమా ఆ పార్టీలో ఉన్నప్పటికీ, ఆర్‌కేపురంలో అంత ఈజీ కాదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి ఆ స్థానాన్ని బీజేపీ ఖాతాలోకి వెళ్లకుండా చెక్‌ పెట్టి.. తమ ఖాతాలో వేసుకోవడానికిగాను మంత్రి సబితారెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంత్రిగా తన ప్రాబల్యం నిలుపుకోవాలంటే కచ్చితంగా ఇక్కడి రెండు డివిజన్లలో తమ అభ్యర్థులను గెలిపించుకుని తీరాల్సిన అవసరం ఉంది. మరి.. మంత్రి సబితారెడ్డి పడుతున్న శ్రమకు తగ్గ ఫలితం వస్తుందా.. లేదా అన్నది ఎన్నికల తర్వాతే తేలనుంది.                                                                                                                                       

ఎవరిది పై చేయి..?

ఇటు కిషన్‌రెడ్డి.. అటు కాలేరు..

ఒకరేమో ఆ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. మరొకరు అధికార పార్టీ ఎమ్మెల్యే. ఆ ఇద్దరూ ఆ నియోజకవర్గంలో ఎన్ని డివిజన్లను గెలిపించుకుంటారోనని చర్చ జరుగుతోంది. 

బర్కత్‌పుర/నల్లకుంట, నవంబర్‌ 22 (ఆంధ్రజ్యోతి) : అంబర్‌పేట్‌ నియోజకవర్గంలో అభ్యర్థులను గెలిపించుకోవడం అటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డికి, ఇటు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు కత్తిమీద సాముగా మారింది. ప్రస్తుతం కిషన్‌రెడ్డి జీహెచ్‌ఎంసీ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. 2016లో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో అంబర్‌పేట నియోజకవర్గంలోని అయిదు డివిజన్లను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. ఒక్క డివిజన్‌లో కూడా బీజేపీ గెలవలేదు. ప్రస్తుతం కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా, ఎన్నికల కమిటీ చైర్మన్‌గా ఉండడంతో ఈ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నియోజకవర్గంతోపాటు సికింద్రాబాద్‌ పార్లమెంటరీ పరిధిలో ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌, నాంపల్లి, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, సనత్‌నగర్‌ నియోజకవర్గాలలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాంపల్లి నుంచి ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తోంది. తాను ఎంపీగా ఉన్న సికింద్రాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో కనీసం 30 డివిజన్లను గెలవాలనే లక్ష్యంతో కిషన్‌రెడ్డి ఉన్నట్లు తెలిసింది. అలాగే కిషన్‌రెడ్డి నివాసం ఉంటున్న కాచిగూడ డివిజన్‌లో ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆ డివిజన్‌తోపాటు మిగతా నాలుగు కూడా క్లీన్‌ స్వీప్‌ చేయాలన్న యోచనలో కిషన్‌రెడ్డి ఉన్నట్లు తెలిసింది. కాచిగూడలో కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, యూపీ రాష్ట్రాలకు చెందిన వారు అత్యధికంగా నివాసం ఉంటున్నారు. వారి ఓట్లపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది.

సిట్టింగ్‌ స్థానాలు పదిలమేనా..? 

2016లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో అంబర్‌పేట నియోజకవర్గంలోని అయిదు డివిజన్లలో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లే గెలిచి అప్పుడు శాసనసభ్యులుగా ఉన్న కిషన్‌రెడ్డికి గట్టి షాక్‌ ఇచ్చారు. ఈసారి ఆ స్థానాలను కాపాడుకోవడం కాలేరు వెంకటేష్‌కు కత్తిమీద సామే. అన్ని డివిజన్లను గెలుచుకుంటే 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం పడుతుందని, అందు కోసం కాలేరు బాగా శ్రమించాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో ఎవరు సత్తా చాటుతారోనని చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2020-11-23T07:05:58+05:30 IST