నిధులు రాలే.. పనులు జరగలే..!

ABN , First Publish Date - 2021-01-27T06:38:47+05:30 IST

వందేళ్ల రికార్డు స్థాయి

నిధులు రాలే.. పనులు జరగలే..!

వరదలతో పాడైన రహదారులు

నిర్మాణం, మరమ్మతు పనుల్లో తీవ్ర జాప్యం

నిధులు లేకపోవడంతో చేతులెత్తేసిన జీహెచ్‌ఎంసీ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి చేయి

నాలుగు నెలలుగా బిల్లులు పెండింగ్‌

రూ.510 కోట్లతో పనులు


హైదరాబాద్‌ సిటీ, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : వందేళ్ల రికార్డు స్థాయి వర్షానికి నగరంలోని వందల కిలోమీటర్ల మేర రహదారులు పాడయ్యాయి. రూ.510 కోట్ల మేర నష్టం జరిగిందని ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. రోడ్ల నిర్మాణం, మరమ్మతుకు నిధులు కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపారు. దాదాపు మూడు నెలలైనా.. జీహెచ్‌ఎంసీకి పైసా నిధులు రాలేదు. సంస్థలో నిధులు లేక.. ప్రభుత్వాల నుంచి పైసా రాక నిర్మాణ పనులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికీ వరద ప్రభావిత ప్రాంతాలు కొన్ని చోట్ల రహదారుల పూర్తిస్థాయి పునరుద్ధరణ జరగలేదు. తాత్కాలిక మరమ్మతు చేసి వదిలేశారు. ముఖ్యంగా ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలోని లింగోజిగూడ, గడ్డి అన్నారం, చంపాపేట డివిజన్ల పరిధిలో ఇప్పటికీ రహదారులు అధ్వానంగా ఉన్నాయి. 


నివేదిక పంపినా.. విడుదల కాని నిధులు...

వరదల నేపథ్యంలో గ్రేటర్‌లో జరిగిన నష్టాన్ని అంచనా వేసిన జీహెచ్‌ఎంసీ రాష్ట్ర ప్రభుత్వానికి అక్టోబర్‌ రెండో వారంలో నివేదిక పంపింది. రాష్ట్ర సర్కారు కేంద్రానికి వివరాలను పంపింది. అనంతరం కేంద్ర నుంచి వచ్చిన బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాయి. ప్రజల ఇబ్బందులు, పాడైన రహదారులు, తెగిన చెరువులు తదితర నష్టాన్ని ప్రత్యక్షంగా చూశాయి. కానీ కేంద్రం నుంచి ఇప్పటికీ పైసా రాలేదని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారొకరు తెలిపారు. రాష్ట్ర సర్కారు కూడా నిధుల కేటాయింపుపై పెద్దగా దృష్టి సారించడం లేదని పేర్కొన్నారు. గ్రేటర్‌లో వరదలతో పాడైన రహదారుల నిర్మాణం, మరమ్మతు కోసం రెండు విడతలుగా ప్రతిపాద నలు సిద్ధం చేశారు. మొదట రూపొందించిన రూ.256 కోట్ల పనులకు పాలనాపరమైన అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో రూ.40 కోట్ల మేర పనులు పూర్తి కాగా.. మరో రూ.52 కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు చెప్పారు. దీనికి సంబంధించి రాష్ట్ర సర్కారు నుంచి పూర్తిస్థాయిలో నిధులు రాలేదని చెబుతున్నారు. రెండో విడతగా రూ.254 కోట్ల ప్రతిపాదనలు పంపగా.. ప్రభుత్వం పక్కన పెట్టినట్టు తెలిసింది. దీంతో అవసరాన్ని బట్టి జోనల్‌ కమిషనర్‌ అనుమతి తీసుకొని పనులు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ ఖజానా నిండుకోవడంతో ప్రతినెలా వేతనాల చెల్లింపునకే ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పనులకు సంస్థ నిధులు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. 


నాలుగు నెలలుగా పెండింగ్‌...

జీహెచ్‌ఎంసీలో రహదారుల నిర్మాణానికి సంబంధించి నాలుగు నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. అక్టోబర్‌లో రూ.40 కోట్ల బిల్లులు చెల్లించారు. అనంతరం నిధుల కొరతతో పైసా కూడా నిర్మాణ సంస్థలకు ఇవ్వలేదు. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం పనులు నిలిచిపోయాయి. పనుల్లో వేగం పెంచాలంటే కాంట్రాక్టర్లు బిల్లులివ్వమంటున్నారని, వారిని ఏమనే పరిస్థితి లేదని ఓ అధికారి వాపోయారు. కాలనీలు, బస్తీల నుంచి రహదారులు పాడయ్యాయన్న ఫిర్యాదులు వస్తున్నాయని, అయినా ఏం చేయలేకపోతున్నామని నిస్సహాయత వ్యక్తం చేశారు. ఓపెన్‌ నాలాలకు శ్లాబ్‌ల నిర్మాణంలోనూ ముందడుగు పడడం లేదు. నేరెడ్‌మెట్‌లో ఓ బాలిక ఓపెన్‌ నాలాలో పడి మృతి చెందడంతో రూ.298 కోట్లతో ప్రతిపాదించిన శ్లాబ్‌ల నిర్మాణ పనులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో కనీసం 30 శాతం పనులు కూడా పూర్తి కాకపోవడం గమనార్హం. ఇందులోనూ మెజార్టీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిసింది. 

Updated Date - 2021-01-27T06:38:47+05:30 IST