Abn logo
Mar 6 2021 @ 01:31AM

జనరేటర్‌పై వివాదం

కరెంట్‌ కోతలున్నాయి.. జనరేటర్‌ కావాలని కమిషనర్‌కు లేఖ

రెప్పపాటు కోతల్లేకుండా విద్యుత్‌ సరఫరా అంటోన్న సర్కారు

తద్విరుద్ధంగా మేయర్‌ లేఖ

నెటిజన్ల బిన్నాభిప్రాయాలు

తవ్వకాల ఇబ్బందుల వల్లే జనరేటర్‌ అడిగానన్న మేయర్‌


హైదరాబాద్‌ సిటీ, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): తరచూ జరుగుతోన్న విద్యుత్‌ కోతల వల్ల తన క్యాంపు కార్యాలయంలో రోజువారీ పనులపై ప్రభావం పడుతోందని, వెంటనే 25 కేవీ జనరేటర్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ కమిషనర్‌ డీఎస్‌ లోకే్‌షకుమార్‌కు మేయర్‌ గద్వాల్‌ ఆర్‌ విజయలక్ష్మి లేఖ రాశారు. ఆ లేఖ బయటకు లీక్‌ కావడంతో సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వం కోతలు లేని విద్యుత్‌ సరఫరా చేస్తున్నామంటుంటే.. అధికార పార్టీకి చెందిన బాధ్యతాయుతమైన వ్యక్తి తద్విరుద్ధమైన అభిప్రాయం వ్యక్తం చేశారంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. 25 కేవీ సామర్ధ్యం ఉన్న జనరేటర్‌ కొనుగో లుకు కంపెనీని బట్టి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని జీహెచ్‌ఎంసీ విద్యుత్‌ విభాగం అధికారొకరు తెలిపారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-12లోని తన నివాసంలోనే ప్రస్తుతం ఆమె క్యాంపు కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. ఇంటి వద్ద ప్రజాధనంతో జనరేటర్‌ ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఆమె లేఖ రాసి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ వివాదంపై గద్వాల్‌ విజయలక్ష్మి స్పందించారు. తన నివాసం వద్ద నూతన విద్యుత్‌ లైన్ల నిర్మాణం కోసం తవ్వకాలతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగు తుందని, ఆ ప్రభావం పనులపై పడకుండా ఉండేందుకు తాత్కాలికంగా జనరేటర్‌ ఏర్పాటు చేయాలని కోరినట్టు పేర్కొన్నారు. సామాజిక, ప్రసార మాధ్యమాల్లో జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఇలాంటి వార్తల పట్ల తాను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్‌కు రెండు విశాల ఛాంబర్లు ఉన్నాయి. అధికారిక కార్యకలాపాలు అక్కడే చేసుకునే అవకాశం ఉంది. అయినా.. ప్రస్తుతానికి ఆమె తన నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా కొనసాగిస్తున్నారు. 


విశ్వసనీయత లేని ర్యాంకులు

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నివేదికపై మేయర్‌ అభ్యంతరం

హైదరాబాద్‌ సిటీ, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌లో హైదరాబాద్‌ 24వ స్థానంలో ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన నివేదికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు మేయర్‌ గద్వాల్‌ ఆర్‌ విజయలక్ష్మి పేర్కొన్నారు. హైదరాబాదీలు ఈ విషయాన్ని అంగీకరించరని అభిప్రాయపడ్డారు. దేశంలోని అన్ని మెట్రో నగరాలతో పోలిస్తే గ్రేటర్‌ సమశీతోష్ణ వాతావరణ పరిస్థితులతో, మౌలిక వసతుల కల్పనలో అగ్రగామిగా దూసుకుపోతుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, మహిళలకు రక్షణ, నేరస్తుల గుర్తింపులో ఏ ఇతర నగరాలు హైదరాబాద్‌కు దరిదాపుల్లో కూడా లేవన్నారు. అంతర్జాతీయ సర్వే సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు గతంలో పలుమార్లు ఉత్తమ నివాసయోగ్య నగరంగా ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో గ్రేటర్‌ ఉందని ప్రకటించిన విషయాన్ని కేంద్ర అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. ర్యాంకుల నిర్ధారణకు ఉపయోగించిన మెథడాలజి, సమాచార సేకరణ విధానం, ప్రశ్నలు అసంబద్ధంగా ఉన్నాయని విజయలక్ష్మి అసంతృప్తి వ్యక్తం చేశారు. 79 ఇండికేటర్లను నాలుగు విభాగాలుగా రూపొందించి నిర్ధారించిన ర్యాంకుల్లో.. పౌర జీవనానికి ఎంతో ప్రాధాన్యమైన విద్య, వైద్యం, ఆవాసం, త్రాగునీరు తదితర అంశాలకు కేవలం 35 శాతం మార్కులు కేటాయించడం.. అందులో హైదరాబాద్‌కు కేవలం 15 మార్కులివ్వడంలో ఔచిత్యం ఏంటని ప్రశ్నించారు. కేంట్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించిన ర్యాంకుల్లో విశ్వసనీయత లోపించిందని పేర్కొన్నారు. జాతీయ పత్రికలు ర్యాంకింగ్‌లను తప్పుపట్టిన విషయాన్ని విజయలక్ష్మి ప్రస్తావించారు. 

Advertisement
Advertisement