ఉక్కు వారధి నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

ABN , First Publish Date - 2020-08-09T08:49:26+05:30 IST

ఇందిరా పార్కు సమీపంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) తలపెట్టిన ఉక్కు వారధి (స్టీల్‌ బ్రిడ్జి) నిర్మాణానికి లైన్‌ క్లియర్‌ అయ్యింది...

ఉక్కు వారధి నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

  • పాదచారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటాం
  • తొలగించే వృక్షాలను ‘రీలొకేట్‌’ చేస్తామని జీహెచ్‌ఎంసీ హామీ

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఇందిరా పార్కు సమీపంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) తలపెట్టిన ఉక్కు వారధి (స్టీల్‌ బ్రిడ్జి) నిర్మాణానికి లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఇందిరా పార్కును వినియోగించే పాదచారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని, టెన్నిస్‌ కోర్టును మరొకటి ఏర్పాటు చేయడంతోపాటు తొలగించే వృక్షాలను ‘రీ-లొకేట్‌ ’ చేస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ హైకోర్టుకు హామీ ఇచ్చారు. పాడైన టెన్నిస్‌ కోర్టును ఐదు నెలల్లో పునరుద్ధరిస్తామని, ఇందుకు పిటిషనర్లు సైతం అంగీకరించారని కోర్టుకు తెలిపారు. ఈ హామీని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరాం ఈ వ్యాజ్యంలో విచారణను ముగిస్తున్నట్లు స్పష్టం చేస్తూ ఇటీవల ఆదేశాలు జారీచేశారు.


స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం ఇందిరా పార్కులోని వృక్షాలను నరికివేస్తున్నారని, పార్కులో ఉన్న సింథటిక్‌ టెన్నిస్‌ కోర్టుకు నష్టం జరుగుతుందని ఈ బ్రిడ్జిని మరో చోటుకు మార్చాలని కోరుతూ డాక్టర్‌ ఏటీ రాఘవేందర్‌ మరో 101 మంది నిరుడు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. ఇందిరా పార్కులోని చెట్లకు, టెన్నిస్‌ కోర్టుకు ఎటువంటి నష్టం కలగజేయరాదని మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. ఈ వ్యాజ్యంలో జీహెచ్‌ఎంసీ కౌంటర్‌ దాఖలు చేస్తూ స్టీల్‌ బ్రిడ్జి కోసం ప్రైవేటు భూములు సేకరించడం భారీ వ్యయంతో కూడుకున్నదని, ఇందిరా పార్కు జీహెచ్‌ఎంసీకి చెందినదే అయినందున ఎవరికీ పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉండదని తెలిపింది. తర్వాత అదనపు అఫిడవిట్‌ దాఖలు చేస్తూ... టెన్నిస్‌ కోర్టును 5 నెలల్లో అదే ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో న్యాయమూర్తి విచారణను ముగించారు.


Updated Date - 2020-08-09T08:49:26+05:30 IST