కౌంటిక్.. టిక్..టిక్..!

ABN , First Publish Date - 2020-12-04T12:42:51+05:30 IST

18 యేళ్ల అనంతరం ప్రస్తుత జీహెచ్‌ఎంసీ ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిన జరిగాయి. 35 లక్షల మందికిపైగా ఓటు వేసిన నేపథ్యంలో లెక్కింపునకు ఎంత సమయం పడుతుందన్నది ...

కౌంటిక్.. టిక్..టిక్..!

రెండు రౌండ్లలో తేలిపోనున్న 138 డివిజన్ల ఫలితాలు

11 చోట్ల మూడు రౌండ్లలో

ఒకే రౌండ్‌లో మెహిదీపట్నం ఫలితం

2016లో మధ్యాహ్నం 3 గంటల నుంచి లెక్కింపు


1 మొదటి రౌండ్‌లో ఫలితం వచ్చే డివిజన్లు 

138 రెండు రౌండ్లలో ఫలితం వచ్చే డివిజన్లు 

11 మూడు రౌండ్లలో ఫలితం వచ్చే డివిజన్లు 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి) :  18 యేళ్ల అనంతరం ప్రస్తుత జీహెచ్‌ఎంసీ ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిన జరిగాయి. 35 లక్షల మందికిపైగా ఓటు వేసిన నేపథ్యంలో లెక్కింపునకు ఎంత సమయం పడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్‌ ద్వారా నిర్వహిస్తారు. ఐదారు వందల నుంచి నాలుగైదు వేలలోపు ఓటర్లున్న చోట బ్యాలెట్‌ ఎన్నికలు నిర్వహించినా.. లెక్కింపునకు అంత సమయం పట్టదు. గ్రేటర్‌కు సంబంధించి లక్షల మంది ఓట్లు వేశారు. కనిష్ఠంగా మెహిదీపట్నం డివిజన్‌లో 11 వేలపైచిలుకు... అత్యధికంగా మైలార్‌దేవ్‌పల్లిలో 37 వేల పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈవీఎంలతో పోలిస్తే బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ఆలస్యం కానుంది. బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపునకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 14 టేబుళ్లు ఏర్పాటు చేసి ఓట్లు లెక్కిస్తున్నారు. ఒక్కో రౌండ్‌కు 14 వేల ఓట్లు లెక్కించనున్నారు. ఈ ప్రాతిపదికన మెహిదీపట్నం డివిజన్‌ ఫలితం మొదట వెలువడనుంది. 14 వేల నుంచి 28 వేల వరకు ఓట్లు పోలైన 138 డివిజన్లలో లెక్కింపు రెండు రౌండ్లలో పూర్తవుతుంది. 28 వేల కంటే ఎక్కువ ఓట్లు పోలైన మరో 11 డివిజన్ల ఫలితాలు మూడు రౌండ్లలో తేలనున్నాయి. 


2016లో మధ్యాహ్నం 3 గంటల నుంచి లెక్కింపు... 

 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఫలితాలు అర్ధరాత్రి వరకు వెలువడ్డాయి. కౌంటింగ్‌ రోజు పురానాపూల్‌లో రీ పోలింగ్‌ ఉండడంతో అన్ని వార్డుల ఓట్ల లెక్కింపు వాయిదా వేశారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరగగా.. 3 గంటలకు లెక్కింపు మొదలైంది. సాయంత్రం 4 గంటల తర్వాత ఫలితాల వెల్లడి మొదలైంది. ప్రస్తుత ఎన్నికల్లో ఓల్డ్‌మలక్‌పేట డివిజన్‌లో రీ పోలింగ్‌ గురువారం జరిగింది. దీంతో నేటి కౌంటింగ్‌ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. 

Updated Date - 2020-12-04T12:42:51+05:30 IST