Abn logo
Nov 28 2020 @ 01:48AM

ప్రతిష్టాత్మకం

కేసీఆర్‌ సభకు భారీ ఏర్పాట్లు

టీఆర్‌ఎస్‌ సభ సక్సెస్‌ కోసం శ్రేణుల కసరత్తు

జన సమీకరణపై దృష్టి

డివిజన్‌ నుంచి రెండు, మూడు వేల మంది

తరలించేందుకు నేతలు, అభ్యర్థుల ఏర్పాట్లు

ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న అధికార పార్టీ

రెండు లక్షల మంది వస్తారని అంచనా

తారా స్థాయికి ప్రచారం.. రేపటితో ఆఖరు

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి) : మహాపోరు తుది అంకానికి చేరింది. డిసెంబర్‌ 1న పోలింగ్‌. రేపటితో ప్రచారానికి తెరపడనుంది. ఇప్పటికే రోడ్‌ షోలు, కుల సంఘాలు, వ్యాపార, వాణిజ్య వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తూ ఆదరించాలని అభ్యర్థిస్తున్న పార్టీలు.. ఈ రెండు రోజుల సమయాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో విమర్శలు, ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీఆర్‌ఎస్‌ నుంచి కేటీఆర్‌ గ్రేటర్‌ వ్యాప్తంగా రోడ్‌షోలు నిర్వహించగా, తమకు బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గాల్లో ఇతర మంత్రులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎల్‌బీ స్టేడియంలో నేడు జరగనున్న పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభను టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇన్నాళ్ల ప్రచారం ఒక లెక్క.. ఈ రోజు సభ ఒక లెక్క అన్నట్టుగా అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సభకు అన్ని ఏర్పాట్లు చేశామని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ తెలిపారు. కేసీఆర్‌ సభ ఒకటే ఉండడంతో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, చేయాలనుకుంటున్న పనులను ప్రజలకు వివరించడంతోపాటు ప్రతిపక్షాల విమర్శలకు సభలో తగిన సమాధానం చెప్తారని నాయకులు అభిప్రాయపడుతు న్నారు.  బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు, ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు ప్రచారంలో పాల్గొంటున్నారు. నేడు కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఉత్పత్తి జరుగుతున్న భారత్‌ బయోటెక్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రానున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ప్రసంగం ఎలా ఉంటుంది..? అన్నది ఆసక్తికరంగా మారింది. నేడు సాయంత్రం నాలుగు గంటలకే సభ ప్రారంభం కానుండగా.. మొదట కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. ఐదు గంటల ప్రాంతంలో కేసీఆర్‌ సభకు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. నివర్‌ తుఫాన్‌తో నగరంలో వర్షం కురుస్తోన్న దృష్ట్యా... నేటి పరిస్థితులను బట్టి షెడ్యూల్‌లో మార్పులూ ఉండవచ్చని చెబుతున్నా రు. 

    డివిజన్‌ నుంచి రెండు, మూడు వేలు...

సభకు భారీగా జనాలను సమీకరించాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇదే ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాటుచేసిన సభ అర్ధాంతరంగా  రద్దయింది. ప్రజలు ఆశించిన స్థాయిలో రాకపోవడం వల్లే కేసీఆర్‌ సభకు రాలేదన్న ప్రచారం అప్పట్లో జరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ప్రతి డివిజన్‌ నుంచి రెండు, మూడు వేల మందిని తరలించాలని టీఆర్‌ఎస్‌ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. సభ సక్సెస్‌ అయితే ఆ ప్రభావం పోలింగ్‌ సరళిని మార్చే అవకాశముందన్నది నాయకుల వాదన. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసినట్టు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఓ వైపు వర్షం.. శీతల వాతావరణంతో వైరస్‌ వ్యాప్తికి ఎక్కువగా అవకాశాలు ఉన్న దృష్ట్యా.. ప్రజలు సభకు వస్తారా..? లేదా..? అన్న ఆందోళన నేతల్లో కనిపిస్తోంది. 

ఎల్బీస్టేడియం సిద్ధం

హిమాయత్‌నగర్‌, నవంబర్‌ 27(ఆంధ్రజ్యోతి) : నేటి సీఎం బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లూ చేశామని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ చెప్పారు. శుక్రవారం ఆయన ఎల్బీస్టేడియంలో సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభకు వచ్చినవారు ఎక్కడున్నా సీఎం ప్రసంగాన్ని స్పష్టంగా చూస్తూ వినేందుకు ప్రాంగణంలో 12 ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేకంగా ఎన్‌క్లోజర్లు ఏర్పాటు చేస్తున్నామని, సభకు వచ్చే వాహనాల కోసం విస్తృతంగా పార్కింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కొవిడ్‌ జాగ్రత్తలను కచ్చితంగా పాటిస్తూ సభను నిర్వహిస్తామన్నారు. 

ఏర్పాట్లు ఇలా...

- ప్రవేశ మార్గాల వద్ద మెటల్‌, హ్యాండ్‌ డిటెక్టర్లతో భద్రతా ఏర్పాట్లు చేశారు.

- సి గేట్‌ ద్వారా ముఖ్యమంత్రి సభకు వచ్చి వెళ్తారు. మంత్రులు కూడా ఇదే గేట్‌ ద్వారా లోనికి ప్రవేశిస్తారు. ఇదే గేట్‌ ముందు రోడ్‌ పక్కన ముఖ్యమంత్రి కాన్వాయ్‌ కోసం పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. మంత్రులు, ఇతర వీవీఐపీల వాహనాల పార్కింగ్‌ కోసం పక్కనే ఉన్న మహబూబియా కళాశాలలో ఏర్పాట్లు చేశారు.

- కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ప్రతి గేట్‌ వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచనున్నారు. 

- ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, సాంస్కృతిక కళాకారుల బృందాల రాకపోకలకు స్టేడియం డి, ఈ గేట్లను కేటాయించారు.

- కార్పొరేటర్లు, మీడియా కోసం బి - గేట్‌ను కేటాయించారు. 

- సాధారణ ప్రజలకు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు, ఇతరులకు జి-గేట్‌ పరిధిలో నలువైపులా ఉండే ప్రవేశ మార్గాల ద్వారా స్టేడియంలోకి ప్రవేశించేందుకు కేటాయించారు. జి గేట్‌ అటు ఖాన్‌ లతీఫ్‌ఖాన్‌ భవనం వైపు, ఇటు రవీంద్రభారతి, ఇంకోవైపు ఆయకార్‌ భవన్‌, మరోవైపు నిజాం కళాశాల ఎదురుగా ఉండే ప్రవేశ మార్గాల (ఏ, ఎఫ్‌, ఎఫ్‌1, జి)ద్వారా అందరూ సభ ప్రాంగణంలోకి వెళ్లవచ్చు. 

- సభకు వచ్చే వాహనాల పార్కింగ్‌ కోసం ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల ఉన్న స్థలాలతో పాటు వ్యవసాయ భవన్‌, ఎస్‌సీఇఆర్టీ భవన్‌, అలియా మోడల్‌ స్కూల్‌, నిజాం కాలేజ్‌ రెండు వైపులా ఉన్న స్థలం, మైదానం, స్టాన్లీ కాలేజ్‌, హజ్‌హౌజ్‌, పబ్లిక్‌ గార్డెన్‌, రవీంద్రభారతి, పీపుల్స్‌ ప్లాజా ఐమాక్స్‌ పక్కన ఉండే డాక్టర్‌ కార్స్‌ తదితర ప్రాంగణాలను సిద్ధం చేశారు. 

- ముఖ్యమంత్రి, మంత్రులు సి గేట్‌ మార్గంలో వచ్చి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసినందున సి గేట్‌ ముందు ఎలాంటి ప్రైవేట్‌ వాహనాలు, సభకు వచ్చే ఇతర వాహనాలను కూడా ఆ మార్గంలో వెళ్లకుండా ఆంక్షలు విధించనున్నారు. 

- వాహనాల పార్కింగ్‌ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌, లకిడీకపూల్‌, ఆబిడ్స్‌, నాంపల్లి, హిమాయత్‌నగర్‌, హైదర్‌గూడ మార్గాల్లో వాహనాలు ఎల్బీస్టేడియం వైపు వస్తాయి. కేటాయించిన స్థలాల్లో మాత్రమే వాహనాలను పార్కు చేయాల్సి ఉంటుంది


Advertisement
Advertisement