‘హంగ్‌’ బల్దియా

ABN , First Publish Date - 2020-12-05T07:19:11+05:30 IST

ఎవరికీ దక్కని పూర్తి మెజారిటీ

‘హంగ్‌’ బల్దియా

ఎవరికీ దక్కని పూర్తి మెజారిటీ

75 మార్క్‌ కూడా చేరుకోని పార్టీలు

మేజిక్‌ మైల్‌ దాటని కార్‌

ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపినా...

సొంతబలంపై మేయర్‌ స్థానం దక్కదు

మరో పార్టీ మద్దతు అవసరం

చరిత్ర పునరావృతం

1986 నుంచి ఇదే స్టోరీ

2016లో తప్ప..!


బల్దియా చరిత్ర పునరావృతమైంది. ఎవరికీ సంపూర్ణ మెజార్టీ దక్కని పరిస్థితి. 150 డివిజన్ల నుంచి 150 మంది కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. 49 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 199. మేయర్‌ పీఠం దక్కించుకోవడానికి 100 మంది సభ్యులుండాలి. అలా ఎవరికీ లేని విచిత్ర పరిస్థితిని సిటీ ఓటర్‌ పార్టీలకు కల్పించారు. ఒక్క 2016లో మాత్రం ఒకే  పార్టీకి సంపూర్ణ మెజారిటీ (99) కట్టబెట్టిన ఓటరు ఇక చాలు అనుకున్నట్లుంది. హంగ్‌ల చరిత్ర ప్రారంభం. మజ్లిస్‌ మరోసారి కింగ్‌ మేకర్‌..!


సిటింగ్‌లతో టీఆర్‌ఎ్‌సకు షాక్‌..!

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 4 (ఆంధ్రజ్యోతి): మెజారిటీ డివిజన్లలో సిట్టింగ్‌లను బరిలోకి దించిన టీఆర్‌ఎ్‌సకు ఊహించని షాక్‌ తగిలింది. 2016 గ్రేటర్‌ ఎన్నికల్లో పార్టీకి చెందిన 99 మంది అభ్యర్థులు విజేతలుగా నిలిచారు. వీరిలో 72 మందికి మరోసారి పోటీకి అధిష్ఠానం అవకాశం కల్పించింది. ఇందులో 35 మంది ఓటమి చెందారు. వీరిలో కొందరు మూడోసారి పోటీ చేయగా, కొందరు రెండోసారి బరిలోకి దిగారు. చాలా మందిపై స్థానికంగా వ్యతిరేకత ఉన్నా, అధిష్ఠానం వారిని బరిలో నిలిపింది. ఇదే ఇప్పుడు కొంప ముంచిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

- అంబర్‌పేట నియోజకవర్గంలో ఐదు డివిజన్లు ఉండగా.. నల్లకుంట, బాగ్‌అంబర్‌పేటలో సిట్టింగ్‌లు గరిగంటి శ్రీదేవీరమేష్‌, పద్మావతిరెడ్డిలకు అవకాశం ఇచ్చారు. వారిద్దరూ  ఓటమి చవిచూశారు. 

- సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో నాలుగు చోట్ల సిట్టింగ్‌లను బరిలో నిలిపారు. అమీర్‌పేట నుంచి శేషుకుమారి, రాంగోపాల్‌పేట సిట్టింగ్‌ కార్పొరేటర్‌ అత్తెల్లి అరుణగౌడ్‌లు ఓటమి చెందారు. మరో ఇద్దరు విజయం సాధించారు. 

- ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో సిట్టింగ్‌లకు మరో చాన్స్‌ ఇచ్చారు. రాంనగర్‌, ముషీరాబాద్‌, అడిక్‌మెట్‌, గాంధీనగర్‌, కవాడిగూడలో శ్రీనివా్‌సరెడ్డి, ఎడ్లభాగ్యలక్ష్మి, హేమలత, పద్మ, లాస్య నందితలు ఓటమి పాలయ్యారు. 

- గోషామహల్‌లోని ఆరు డివిజన్లలో మూడు చోట్ల సిట్టింగ్‌లు బరిలో నిలిపారు. మంగళ్‌హట్‌, గన్‌ఫౌండ్రి, గోషామహల్‌ పరమేశ్వరీసింగ్‌, మమతాగుప్తా, ముఖే్‌షసింగ్‌లు పరాజయం పాలయ్యారు. 

- ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో 11 డివిజన్లు ఉండగా, టీఆర్‌ఎస్‌ ఖాతాలోని 10 స్థానాల్లో సిట్టింగ్‌లకు అవకాశమిచ్చారు. వారంతా ఓడిపోయారు. 

- ఉప్పల్‌ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో సిట్టింగ్‌లకు అవకాశం ఇచ్చారు. రామంతాపూర్‌, హబ్సిగూడ, ఉప్పల్‌, ఏఎ్‌సరావునగర్‌లో ప్రస్తుత కార్పొరేటర్లుగా ఉండి బరిలో నిలిచిన వారు ఓటమి పాలయ్యారు. 

- ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో ఐదు చోట్ల సిట్టింగ్‌లకు అవకాశం ఇవ్వగా, జూబ్లీహిల్స్‌, హిమాయత్‌నగర్‌ డివిజన్లలో ఖాజా సూర్యనారాయణ, ప్రేమలతలు పరాజితులయ్యారు. 

- మలక్‌పేట నియోజకవర్గంలో సైదాబాద్‌, ఐఎస్‌ సదన్‌, ముసారాంబాగ్‌ల నుంచి పోటీ చేసిన సిట్టింగ్‌లు సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి, సామ స్వప్న, సునరితారెడ్డిలు ఓటమి పాలయ్యారు. 

- కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఆరుగురు సిట్టింగ్‌లకు అవకాశం ఇవ్వగా, మూసాపేటలో తూము శ్రవణ్‌కుమార్‌ ఓడిపోయారు. 

- కుత్బుల్లాపుర్‌ నియోజకవర్గంలో ఏడుగురు సిట్టింగ్‌ లను మళ్లీ బరిలో నిలపగా, జీడిమెట్ల సిట్టింగ్‌ కార్పొరేటర్‌ పద్మ పరాజయం పాలయ్యారు. 


ఆరెకపూడి ఇలాకాలో గులాబీ రెపరెపలు 

మియాపూర్‌, డిసెంబర్‌ 4 (ఆంధ్రజ్యోతి) : హైటెక్‌సిటీ నియోజకవర్గంపై మరోసారి గులాబీజెండా రెపరెపలాడింది. నియోజకవర్గంలోని పది డివిజన్లలో 9 డివిజన్లను కైవసం చేసుకుని టీఆర్‌ఎస్‌ సత్తా చాటింది. మియాపూర్‌, చందానగర్‌, శేరిలింగంపల్లి, కొండాపూర్‌, మాదాపూర్‌, హఫీజ్‌పేట, హైదర్‌నగర్‌, వివేకానందనగర్‌, ఆల్విన్‌కాలనీ డివిజన్లలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించగా ఒక్క గచ్చిబౌలిలో మాత్రం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై బీజేపీ విజయం సాధించింది. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో డివిజన్ల వారీగా కేటాయించిన ఇన్‌చార్జిలను సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయడంతో ఎమ్మెల్యే ఆరెకపూడి కీలకంగా వ్యవహరించారు. సిట్టింగ్‌లను మూడు డివిజన్లలో తప్పించి తన అనుచరులకు టికెట్లు ఇప్పించడమే కాకుండా మరో డివిజన్‌లో ఖాళీ అయిన స్థానాన్ని కూడా తన ముఖ్య అనుచరుడికి టికెట్‌ గెలిపించుకున్నారు. 

చక్రం తిప్పిన హరీశ్‌రావు

పటాన్‌చెరు, డిసెంబరు 4: సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వాడలో గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలలో టీఆర్‌ఎస్‌ దుమ్మురేపింది. అంచనాలను పూర్తిగా తలకిందులు చేస్తూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మూడు డివిజన్లలో ఘన విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ గెలుపులో మంత్రి హరీశ్‌రావు కీలక పాత్ర పోషించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


Updated Date - 2020-12-05T07:19:11+05:30 IST