GHMC : ముచ్చట్లతో ముగింపు.. నామ్‌కే వాస్తేగా సమావేశం.. కీలక అంశాలపై చర్చ అంతంతే..

ABN , First Publish Date - 2021-12-09T14:56:22+05:30 IST

ప్రస్తుత పాలకమండలి హయాంలో మొదటిసారి జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశం...

GHMC : ముచ్చట్లతో ముగింపు.. నామ్‌కే వాస్తేగా సమావేశం.. కీలక అంశాలపై చర్చ అంతంతే..

  • 20 అంశాల్లో 18 ఆమోదం
  • న్యాక్‌ ఇంజనీర్ల సేవల పొడిగింపు ప్రతిపాదన పక్కకు..

హైదరాబాద్‌ సిటీ : ప్రస్తుత పాలకమండలి హయాంలో మొదటిసారి జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశం నామ్‌కే వాస్తేగా ముగిసింది. ఎజెండాలోని అంశాలపై ఎలాంటి చర్చ లేకుండానే మీటింగ్‌ను మమ అనిపించారు. ఉదయం 11.15 గంటలకు మొదలైన సమావేశం మధ్యాహ్నం 12.30 గంటలకు ముగిసింది. దాదాపు 1.15 గంటలపాటు మీటింగ్‌ జరగగా.. ప్రథమ సమావేశం కావడంతో స భ్యులు, అధికారుల పరిచయం, పుష్పగుచ్చా లు అందించి పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోవడానికే 30 నిమిషాలు పట్టింది. మరో 40 నిమిషాల్లో మీటింగ్‌ ముగించి ఎజెండాలోని 20 అంశాల్లో 18 ఆమోదిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఎన్‌ఏసీ) ద్వారా నియమించిన సైట్‌ ఇంజనీర్ల సేవలు మరో యేడాదిపాటు కొనసాగించాలనే రెండు ప్రతిపాదనలను పక్కన పెట్టారు. ఎజెండాలో అభివృద్ధి, వివిధ విభాగాల్లో పదవీ విరమణ చేసిన అధికారుల సేవల పొడిగింపు వంటి కీలక అంశాలున్నా.. సమగ్రంగా చర్చించకుండానే నిర్ణయం తీసుకున్నారు. ఏ విషయంపైనా కూలంకష చర్చ జరగలేదని ఓ సభ్యుడు తెలిపారు. ముచ్చట్లతోనే మొదటి సమావేశం మొదటి సమావేశం ముగిసిందన్నారు. ఎజెండాలో లేని పారిశుధ్యం రోడ్లు తదితర అంశాలను కొందరు సభ్యులు ప్రస్తావించడం గమనార్హం. సమావేశానికి 15 మంది సభ్యులకుగాను ఒకరు గైర్హాజరయ్యారు. సాధారణంగా మొదటి అంతస్తులోని స్టాండింగ్‌ కమిటీ హాలులో జరిగే సమావేశాన్ని ఏడో అంతస్తులోని కాన్ఫరెన్స్‌ హాలులో నిర్వహించారు.


ఆమోదించిన అంశాలు...

- నాంపల్లి సరాయి స్థలంలో నగరానికి వచ్చే మహిళా పర్యాటకుల కోసం వసతి గృహం నిర్మాణం. 187 పడకల సామర్ధ్యం, మౌలిక సదుపాయాలతో కలిపి ఇందుకు రూ.11 కోట్లు వెచ్చించనున్నారు. కూలిన సరాయి శిథిలాలు పూర్తిగా తొలగించి నూతన భవనం నిర్మించనున్నారు. 

- సాకి చెరువు నుంచి గంగారం చెరువు వరకు రూ.5.90 కోట్లతో వరద ప్రవాహ వ్యవస్థ. 

- ఎల్‌బీనగర్‌ సర్కిల్‌లో నాగోల్‌ నుంచి మూసీ వరకు రూ.11.80 కోట్లతో బాక్స్‌ డ్రైన్‌ నిర్మాణం. 

- కాటేదాన్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వద్ద రోడ్లు, వరద నీటి డ్రైన్‌ల నిర్మాణం, ఈత కొలను నిర్వహణ, విద్యుత్‌ సంబంధిత పనులు రూ.5.95 కోట్లతో చేపట్టేందుకు ప్రతిపాదన. 

- ఒకే భవనాలకు ఉన్న రెండు పీటీఐఎన్‌లలో ఒకటి బ్లాక్‌ చేయాలి. పలు సర్కిళ్లలో 13 పీటీఐఎన్‌లు ఇలా గుర్తించినవి ఉన్నాయి. 

- ఈఆర్‌పీకి సంబంధించి సాంకేతిక సహకారం అందించే ఓ ఏజెన్సీ సేవలు పొడిగింపు. 

- మూడేళ్లపాటు వివిధ సేవల కోసం సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌కు రూ.7.37 కోట్లు చెల్లించాలి. 

- జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులో చెత్త కుప్ప నుంచి వెలువడుతోన్న లీచెట్‌ను రూ.251 కోట్లతో శుద్ధి చేసే ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌. అంచనా వ్యయం రూ.240 కోట్లు కాగా... 4.59 శాతం ఎక్కువగా కోట్‌ చేసిన రాంకీ సంస్థకు గుడ్డిగా ప్రాజెక్టు అప్పగించినా స్టాండింగ్‌ కమిటీ సభ్యులు కనీసం ప్రశ్నించకపోవడం గమనార్హం. 

- రామనాయుడు స్టూడియో నుంచి సెనార్‌ వాలే వరకు 120 అడుగులతో రహదారి నిర్మాణం.


18న కౌన్సిల్‌ సమావేశం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది దాటింది. నిబంధనల ప్రకారం పాలకమండలి మూడు నెలల అనంతరం కొలువుదీరింది. తొమ్మిది నెలలు కావస్తున్నా, ఇప్పటికీ భౌతికంగా కౌన్సిల్‌ సాధారణ సమావేశం జరగలేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూన్‌లో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. సాధారణ సమావేశం నిర్వహించాలని పలుమార్లు బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్‌ చేసినా మేయర్‌ విజయలక్ష్మి పట్టించుకోలేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ దృష్ట్యా ఈ నెల 14 వరకు కౌన్సిల్‌ సమావేశం నిర్వహించ లేమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 18న సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. 

Updated Date - 2021-12-09T14:56:22+05:30 IST