Abn logo
Sep 24 2021 @ 11:16AM

‘‘పట్టుబడితే ఏంటి.. పది, పదిహేను రోజుల్లో బయటకు రావచ్చు..’’

‘‘పట్టుబడితే ఏంటి.. పది, పదిహేను రోజుల్లో బయటకు రావచ్చు. అదృష్టవశాత్తు ఏసీబీకి చిక్కకుంటే కోట్లు గడించవచ్చు’’ అన్న సూత్రాన్ని జీహెచ్‌ఎంసీలోని కొందరు అధికారులు, ఉద్యోగులు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఏసీబీ దాడులు చేస్తున్నా, రెడ్‌ హ్యాండెడ్‌గా అక్రమార్కులను అరెస్ట్‌ చేస్తున్నా వారి అవినీతి ఆగడం లేదు. ఒకే రోజు, ఒకే సర్కిల్‌లో లంచం తీసుకుంటూ  ఇద్దరు ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. 


పైసామే పత్రం..! 

పుట్టినా.. చచ్చినా.. సర్టిఫికెట్‌ కోసం పైసలివ్వాల్సిందే

అవినీతికి కేరాఫ్‌గా జీహెచ్‌ఎంసీ

ప్రతి పౌర సేవకో ధర నిర్ణయించి వసూలు

మ్యుటేషన్‌, ట్రేడ్‌ లైసెన్స్‌ల జారీలో పెచ్చరిల్లుతోన్న అవినీతి

ఆన్‌లైన్‌ సేవలైనా.. అదే తీరు

పట్టణ ప్రణాళికా విభాగంలో మరీ ఘోరం


హైదరాబాద్‌ సిటీ: పారదర్శక పౌర సేవల కోసం ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తున్నా, గడువులోపు దరఖాస్తు పరిష్కరించేలా సాంకేతిక పరిశీలన ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. బల్దియా సేవలు అంత సులువు కాదంటూ ప్రతి పనికో ధర నిర్ణయిస్తున్నారు. కేంద్ర కార్యాలయంతో సహా మెజార్టీ జోనల్‌, సర్కిల్‌ కార్యాలయాల్లో అదే దుస్థితి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మొదలు.. ఆస్తుల మ్యుటేషన్‌, ట్రేడ్‌ లైసెన్స్‌, నిర్మాణ అనుమతుల జారీ వరకు అంతా అవినీతిమయం. కొనుగోలు చేసి రిజిస్ర్టేషన్‌ అయిన ఆస్తిని యజమాని పేరిట మార్చేందుకు(మ్యుటేషన్‌) కూకట్‌పల్లి సర్కిల్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌ రూ.8 వేలు డిమాండ్‌ చేశాడు. 2015 తర్వాత రిజిస్ర్టేషన్‌ అయి క్రయ, విక్రయాలు జరిగే ఆస్తులకు సంబంధించిన మ్యుటేషన్‌ను కొంత కాలంగా రిజిస్ర్టేషన్‌ విభాగం చేస్తోంది. అంతకుముందు రిజిస్ర్టేషన్‌ అయిన ఆస్తుల మ్యుటేషన్‌ జీహెచ్‌ఎంసీ చేస్తోంది. ప్రస్తుతం ఈ తరహా మ్యుటేషన్‌ దరఖాస్తులే బల్దియాకు వస్తున్నాయి. మ్యుటేషన్‌ అవినీతిపై ఫిర్యాదులు అందినా ఉన్నతాధికారులు పట్టించుకోక పోవడం వల్లే క్షేత్రస్థాయి సిబ్బంది అక్రమాలకు తెర తీస్తున్నారు. సర్కిల్‌ స్థాయిలో బిల్‌ కలెక్టర్‌ నుంచి ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌, ఏఎంసీ, డీఎంసీ వరకు ఫైల్‌కు ఇంత అని  వాటాలు వెళ్తాయని ప్రచారం జరుగుతోంది. 


డబ్బు డిమాండ్‌

గ్రేటర్‌లో లక్షల సంఖ్యలో వాణిజ్య, వ్యాపార సంస్థలున్నా అనుమతి ఉన్నవి మాత్రం 1.50 లక్షల్లోపే. ఇందులో ఏటా రెన్యూవల్‌ చేసుకునే వారు 40 నుంచి 50 శాతం లోపే.  క్షేత్రస్థాయిలో ఉన్న సంస్థలను పరిగణనలోకి తీసుకుంటే రూ.120 కోట్ల వరకు ఆదాయం రావాల్సి ఉంది. కానీ, రూ.45 కోట్లు దాటడం లేదు. జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం కర్రీ పాయింట్‌కూ ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోవాలి. అంత సులువుగా అనుమతి ఇవ్వకపోగా.. చేతి చమురు వదులుతుందన్న భయంతో చాలా మంది అసలు దరఖాస్తు చేయకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.


కూకట్‌పల్లి సర్కిల్‌లోని పారిశుధ్య విభాగంలో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ట్రేడ్‌ లైసెన్స్‌లో పేరు మార్చేందుకు రూ.2500 డిమాండ్‌ చేస్తూ ఏసీబీకి చిక్కాడు. కొందరు అధికారులు ఆపరేటర్లు, కింది స్థాయి సిబ్బంది ద్వారా వసూళ్లు చేస్తుంటారని, కూకట్‌పల్లిలోనూ అదే జరిగిందని చెబుతున్నారు. పై అధికారుల భరోసా లేకుండా ఆపరేటర్లు డబ్బులు డిమాండ్‌ చేసే పరిస్థితి ఉంటుందా అని ఓ సామాజిక సేవా సంస్థ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. ఇక జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ విభాగంలో అవినీతికి అడ్డూ, అదుపు లేదు. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఆపరేటర్లు, జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లు అందినకాడికి దోచుకుంటున్నారు. రూ.5 నుంచి 8 వేలు ఇస్తే.. అమెరికాలో పుట్టిన వారికి కూడా నగరంలో పుట్టినట్టు బర్త్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడం ఈ విభాగం ఉద్యోగుల ప్రత్యేకత. పౌర సేవలకు సంబంధించి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంస్థలోని మరో  సెక్షన్‌ టౌన్‌ప్లానింగ్‌. టీఎ్‌స-బీపాస్‌ అమలులోకి వచ్చినా ఈ విభాగంలో అవినీతి ఆగలేదు. కాసులు కురిపిస్తే.. కళ్ల ముందు అంతస్తులు కడుతున్నా.. క్షేత్రస్థాయి ఉద్యోగులు, అధికారులు పట్టించుకోరు.