పాతపద్ధతిలోనే పూడికతీత

ABN , First Publish Date - 2021-11-25T18:12:11+05:30 IST

నాలాల నిర్వహణను ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించే ప్రతిపాదనకు బ్రేక్‌ పడింది. అదనపు ఆర్థిక భారం, అత్యవసర పరిస్థితుల్లో చేయాల్సిన పనులకు సంబంధించిన

పాతపద్ధతిలోనే పూడికతీత

నాలాల నిర్వహణ ప్రైవేట్‌కు లేనట్టే ..

క్షేత్రస్థాయిలో జీహెచ్‌ఎంసీ అధ్యయనం


హైదరాబాద్‌ సిటీ: నాలాల నిర్వహణను ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించే ప్రతిపాదనకు బ్రేక్‌ పడింది. అదనపు ఆర్థిక భారం, అత్యవసర పరిస్థితుల్లో చేయాల్సిన పనులకు సంబంధించిన సమస్యలు, ఆడిట్‌లో ఇబ్బందుల నేపథ్యంలో పాత విధానంలోనే నాలాల పూడికతీత చేపట్టాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. మొబైల్‌ యాప్‌ ద్వారా సాంకేతిక పర్యవేక్షణ, సామాజిక తనిఖీ, వేర్వేరుగా పనులు చేపట్టడం వంటి చర్యల ద్వారా పారదర్శకంగా, పూర్తిస్థాయిలో పూడికతీత జరిగేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. గ్రేటర్‌లో పెద్దవి, చిన్నవి కలిపి 1800 వరకు డ్రైన్‌లు ఉన్నాయి. వర్షాకాలంలో ముంపు ముప్పు నేపథ్యంలో కాంప్రహెన్సీవ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రామ్‌(సీఆర్‌ఎంపీ) తరహాలో ప్రైవేట్‌ సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని భావించారు.


సాధ్యాసాధ్యాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయించిన అధికారులు.. ఆ నివేదిక ఆధారంగా ప్రైవేట్‌కు అప్పగింత సాధ్యం కాదన్న అంచనాకు వచ్చారు. ప్రస్తుతం ప్రతియేటా పూడిక తొలగింపునకు రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రైవేట్‌కు ఇస్తే ఈ మొత్తం 50 శాతం పెరుగుతుందని అధ్యయనంలో తేలింది.  ఆడిట్‌లోనూ ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. ఆయా కారణాల నేపథ్యంలో పాత విధానంలోనే పూడిక తొలగింపు చేపట్టాలని భావిస్తున్నారు. వచ్చే యేడాది జనవరి నుంచి డిసెంబర్‌ వరకు పనులు చేపట్టేలా టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు ఇంజనీరింగ్‌ విభాగం ఉన్నతాధికారొకరు తెలిపారు.

Updated Date - 2021-11-25T18:12:11+05:30 IST