GHMC స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై పన్ను చెల్లించకుంటే.. తేల్చిచెప్పేసిన ఆఫీసర్లు..!

ABN , First Publish Date - 2021-10-30T16:16:33+05:30 IST

2021-22 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థం ముగియడం, గతేడాదితో పోలిస్తే...

GHMC స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై పన్ను చెల్లించకుంటే.. తేల్చిచెప్పేసిన ఆఫీసర్లు..!

  •  భవనం సీజ్‌.!
  • మొండి బకాయిదారులకు హెచ్చరిక
  • రెడ్‌ వారెంట్ల జారీ
  • పన్ను వసూలు తగ్గడంతో కఠిన నిర్ణయం

హైదరాబాద్‌ సిటీ : ఆస్తి పన్ను చెల్లించని మొండి బకాయిదారులపై జీహెచ్‌ఎంసీ ఉక్కుపాదం మోపుతోంది. బకాయిలు చెల్లించకుంటే భవనం సీజ్‌ చేస్తామని హెచ్చరిస్తూ రెడ్‌ వారెంట్‌ జారీ చేస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థం ముగియడం, గతేడాదితో పోలిస్తే దాదాపు రూ.250 కోట్లు తక్కువ పన్ను వసూలు కావడంతో సంస్థ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఆర్థిక అవసరాలు, ఉన్నతస్థాయి ఆదేశాలతో ముందుగానే వారెంట్‌ల జారీకి అధికారులు శ్రీకారం చుట్టారు. నివాసేతర కేటగిరీ భవనాలకు సంబంధించి రూ.లక్షలు, కోట్లలో బకాయి ఉన్న వారిని గుర్తించి రెడ్‌ వారెంట్‌ జారీ చేస్తున్నారు.


జీహెచ్‌ఎంసీ చట్టం 1955 సెక్షన్‌ 271 ప్రకారం బకాయి వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో ఆస్తులు జప్తు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఖైరతాబాద్‌, ఎల్‌బీనగర్‌, సరూర్‌నగర్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్‌, మల్కాజ్‌గిరి తదితర సర్కిళ్లలో వారెంట్‌ల జారీని అధికారులు ముమ్మరం చేశారు. ఖైరతాబాద్‌ జోన్‌ పరిధిలోని ఓ ప్రముఖ హోటల్‌ రూ.1.35 కోట్లు, మరో హోటల్‌ రూ.1.10 కోట్లు, ఓ బహుళ అంతస్తుల భవనానికి సంబంధించి రూ.2.88 కోట్లు, పేరొందిన జువెలరీ షాప్‌ భవనానికి సంబంధించి రూ.55 లక్షల పన్ను పెండింగ్‌ ఉంది. వాటి యజమానులకు అధికారులు వారెంట్‌ ఇచ్చారు. శుక్రవారం సోమాజిగూడలోని ఓ భవన్‌లో నాలుగేళ్లుగా పన్ను చెల్లించకుండా, రూ.1.54 కోట్ల బకాయి ఉన్న ఓ సంస్థకు వారెంట్‌ జారీ చేశారు. చెల్లించని పక్షంలో ప్రాంగణం సీజ్‌ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. స్పందించిన సంస్థ ప్రతినిధులు కోటి రూపాయల చెక్కు అందజేశారు.


రూ.245 కోట్లు తక్కువ..

గ్రేటర్‌లో 18 లక్షలకుపైగా ఆస్తిపన్ను చెల్లింపుదారులున్నారు. ఇప్పటి వరకు కేవలం 9.06 లక్షల మంది మాత్రమే పన్ను చెల్లించారు. ఆరు నెలల్లో రూ.887 కోట్ల పన్ను వసూలైంది. 2020-21 ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ మాసాంతానికి రూ.1,122 కోట్లు వసూలు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.245 కోట్ల పన్ను వసూలు తగ్గింది. కరోనా ప్రభావం, లాక్‌డౌన్‌ వంటి ఇబ్బందులున్నా గతంలో పన్ను మెరుగ్గా వసూలైంది. ఈ క్రమంలో బకాయిదారులకు రెడ్‌ వారెంట్‌ నోటీసులు జారీ చేసి పన్ను వసూలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలిసింది. 


రెండు శాతం జరిమానా

బకాయిలు వెంటనే చెల్లించని పక్షంలో రెండు శాతం పెనాల్టీ విధిస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక సంవత్సరంలో రెండు సార్లు పన్ను చెల్లింపునకు అవకాశముంటుంది. మొదటి అర్ధ సంవత్సరం (ఏప్రిల్‌- సెప్టెంబర్‌) పన్ను జూన్‌ నెలాఖరుకు, రెండో అర్ధ సంవత్సరం పన్ను డిసెంబర్‌ నాటికి చెల్లించాలి. గడువులోపు చెల్లించని పక్షంలో రెండు శాతం పెనాల్టీ విధిస్తారు. 

Updated Date - 2021-10-30T16:16:33+05:30 IST