HYD : అప్పుల ఊబిలో కూరుకుపోయిన GHMC సంచలన నిర్ణయం.. కసరత్తు షురూ.. ఇకపై..!

ABN , First Publish Date - 2021-10-29T15:15:56+05:30 IST

అప్పుల ఊబిలో కూరుకుపోయి వాయిదాలు కూడా చెల్లించే పరిస్థితి లేకపోవడం..

HYD : అప్పుల ఊబిలో కూరుకుపోయిన GHMC సంచలన నిర్ణయం.. కసరత్తు షురూ.. ఇకపై..!

  • రియల్‌ వ్యాపారంలోకి..
  • ఖాళీ స్థలాల అభివృద్ధికి యోచన
  • అవసరమైతే అమ్మకం కూడా
  • రుణాలకు వడ్డీ చెల్లించలేని దుస్థితి
  • ఆస్తులమ్మి సొమ్ము చేసుకునేందుకు రంగం సిద్ధం

జీహెచ్‌ఎంసీ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి అడుగు పెట్టబోతోందా..? సంస్థ స్థలాలను అభివృద్ధి చేసి విక్రయించనుందా..? ఆ దిశగా కసరత్తు మొదలైందా..? అంటే విశ్వసనీయ వర్గాలు ఔనని చెబుతున్నాయి. గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ విషయంపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలిసింది. అంతర్గత సమావేశమంటూ వివరాలు బయటకు పొక్కకుండా అధికారులు అత్యంత గోప్యంగా వ్యవహరిస్తున్నారు.


హైదరాబాద్‌ సిటీ : అప్పుల ఊబిలో కూరుకుపోయి వాయిదాలు కూడా చెల్లించే పరిస్థితి లేకపోవడం.. ప్రతిపాదిత ప్రాజెక్టులకు వేల కోట్ల నిధులు అవసరమున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఆస్తుల అమ్మకానికి సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వం నుంచి వచ్చిన ఉన్నతస్థాయి ఆదేశాలతో రియల్‌ వ్యాపారం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీకి ఏటా ఆస్తిపన్ను, నిర్మాణ అనుమతులు, ఇతరత్రా రుసుముతోపాటు ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా రూ.3,000-3,500 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. అయినా సంస్థ రూ.4,500 కోట్ల వరకు అప్పు చేసింది. ప్రస్తుతం ప్రతి నెలా రూ.32కోట్లు వడ్డీ రూపంలో చెల్లిస్తోంది. ప్రిన్సిపల్‌ అమౌంట్‌ చెల్లింపు మొదలైతే ఈ మొత్తం దాదాపు రూ.60 కోట్లకు పెరగనుంది. వస్తోన్న ఆదాయంతో వేతనాల చెల్లింపూ ఇబ్బందిగా మారిన దృష్ట్యా.. ఆస్తులు అమ్మి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలని సంస్థ భావిస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు.


స్థలాలతో వ్యాపారమా..? 

లే అవుట్‌ల అభివృద్ధి క్రమంలో గతంలో వదిలిన ఖాళీ స్థలాలు దాదాపు 3వేలకుపైగా ఉండాలి. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో వేల సంఖ్యలో ఇవి కనుమరుగయ్యాయి. కొన్నిస్థలాల్లో పార్కులు, కమ్యూనిటీ హాళ్లు నిర్మించారు. మరికొన్ని స్థలాలను లీజుకివ్వగా, కొన్ని కోర్టు కేసుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న స్థలాలెన్ని, రియల్‌ వ్యాపారానికి అనువుగా ఉండేవెన్ని అన్న వివరాలను క్షేత్రస్థాయిలో గుర్తించే ప్రక్రియను జీహెచ్‌ఎంసీ చేపడుతోంది. నగరంలో ఆట స్థలాలూ అంతంతమాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో మైదానాలు, పార్కులు అభివృద్ధి చేయకుండా  స్థలాలతో జీహెచ్‌ఎంసీవ్యాపారం చేయాలనుకుంటుండడం గమనార్హం. 


28 ఎకరాలకుపైగా..

అధికారిక లెక్కల ప్రకారం జీహెచ్‌ఎంసీకి 101 ప్రాంతాల్లో 28 ఎకరాలకుపైగా స్థలాలు ఉన్నాయి. ఇందులో మెజార్టీ లీజుకిచ్చింది. అత్యల్పంగా ఓ ఏరియాలో 16 చ.గ.లు ఉండగా.. అత్యధికంగా మరోచోట 90 వేల చ.గ.లకు పైగా భూమి ఉంది. వీటికి సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన, వ్యాపార సముదాయాలు నిర్మించి సంస్థలు/వ్యక్తులకు అద్దెకివ్వాలా లేక విక్రయించాలా, లీజుకివ్వ డం బెటరా అనే తదితర అంశాలను గుర్తించే బాధ్యతను కన్సల్టెన్సీకి అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. కన్సల్టెన్సీ ఎంపికకు ప్రకటించే ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) నోటిఫికేషన్‌లో ఎలాంటి నిబంధనలు ఉండాలి, ఏ ప్రాతిపదికన ఏజె న్సీ ఎంపిక జరగాలి, అందుకు పాటించాల్సిన జాగ్రత్తలు, అమలు చేయాల్సిన నిబంధనలు ఏమిటన్న అంశాలపై ఉన్నతాధికారులు చర్చించినట్టు సమాచారం.



Updated Date - 2021-10-29T15:15:56+05:30 IST