GHMC వర్సెస్ BEL.. ఏంటీ ఏటీఎస్‌సీ...!?

ABN , First Publish Date - 2021-11-20T12:17:40+05:30 IST

జీహెచ్‌ఎంసీ, భారత్‌ ఎలక్ర్టానిక్స్‌ లిమిటెడ్‌(బీఈఎల్‌)ల మధ్య సహకార లోపం...

GHMC వర్సెస్ BEL.. ఏంటీ ఏటీఎస్‌సీ...!?

  • ఆరు నెలలుగా సాంకేతిక వివరాలు అడుగుతున్న బల్దియా 
  • సహకరించని బెల్‌
  • గతంలో హెచ్‌ట్రిమ్స్‌ నిర్వహణ
  • ఐటీఎస్‌సీ ఏర్పాటులో తీవ్ర జాప్యం
  • రూ.59.86 కోట్లతో ప్రతిపాదన 
  • ఐబీఐ సంస్థకు అప్పగింత
  • 12 ప్రాంతాల్లో పూర్తి.. మరి కొన్ని చోట్ల ట్రయల్‌
  • అధునాతన సిగ్నలింగ్‌పై ప్రభావం

హైదరాబాద్‌ సిటీ : జీహెచ్‌ఎంసీ, భారత్‌ ఎలక్ర్టానిక్స్‌ లిమిటెడ్‌(బీఈఎల్‌)ల మధ్య సహకార లోపం ట్రాఫిక్‌ ఇబ్బందుల పరిష్కారానికి అవరోధంగా మారుతోంది. అధునాతన సిగ్నలింగ్‌ వ్యవస్థ ఏర్పాటులో ముందడుగు పడడం లేదు. ఇందుకు బెల్‌ సహకరించకపోవడమే కారణమని బల్దియా వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆ సంస్థకు చెల్లించాల్సిన రూ.10 కోట్ల బిల్లును పెండింగ్‌లో పెట్టినట్టు ఓ అధికారి చెప్పారు. గ్రేటర్‌లో మొత్తం 380 చౌరస్తాల్లో సిగ్నల్స్‌ ఉన్నాయి. ఇందులో ప్రధాన రహదారులపై 231 సిగ్నల్స్‌ హెచ్‌ట్రిమ్స్‌, 149 జంక్షన్లలో సాధారణ విధానంలో పని చేస్తున్నాయి. ఐదేళ్ల క్రితం 231 సిగ్నళ్ల నిర్వహణ బాధ్యతలను బెల్‌కు అప్పగించారు. త్రైమాసికానికి రూ.1.5 కోట్ల చొప్పున నిర్వహణ వ్యయం చెల్లించే వాళ్లమని జీహెచ్‌ఎంసీ అధికారొకరు చెప్పారు. మొదట మూడేళ్ల వ్యవధికి బాధ్యతలు అప్పగించి.. అనంతరం మరో రెండేళ్లు పొడిగించారు. ఆ గడువు కూడా ముగియడంతో ఐదు నెలల క్రితం టెండర్‌ నోటిఫికేషన్‌ ద్వారా ఐబీఐ సంస్థను ఎంపిక చేశారు. అడాప్టివ్‌ ట్రాఫిక్‌ సిస్టమ్‌ కంట్రోల్‌(ఐటీఎస్‌సీ) సిస్టమ్‌ ద్వారా సిగ్నళ్లు పని చేసేలా కొత్త సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి తీసుకువచ్చే బాధ్యతను ఆ సంస్థకు అప్పగించారు.


రూ.59.86  కోట్లతో..

మొత్తం 380 సిగ్నళ్లలో యూటర్న్‌ల వల్ల 21 చోట్ల సిగ్నళ్లు తొలగించారు. మిగతా 359 సిగ్నళ్ల వద్ద ఐటీఎస్‌సీ సాంకేతికతను రూ.59.86 కోట్ల వ్యయంతో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. మొదటి దశలో 149 సిగ్నల్స్‌ ఐటీఎస్‌సీ సాంకేతికతతో పని చేసేలా కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే 12 ప్రాంతాల్లో పూర్తయిందని, మరి కొన్నిచోట్ల ట్రయల్‌ నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. హెచ్‌ట్రిమ్స్‌ సిగ్నల్స్‌ వద్ద ఐటీఎస్‌సీ పూర్తిస్థాయిలో అమలుకు, బెల్‌ సాంకేతిక వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని ఓ అధికారి చెప్పారు. భెల్‌ ప్రతినిధులను అడిగితే.. రేపు, మాపు అని కాలం వెల్లదీస్తున్నారని, ఇప్పటికే ఆరు నెలలు గడిచిందని పేర్కొన్నారు. భెల్‌ సాంకేతిక వివరాలు ఇస్తే కానీ.. అనుసంధాం పూర్తి చేసి కొత్త సిగ్నలింగ్‌ వ్యవస్థను పూర్తి చేసే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.


ఏంటీ ఏటీఎస్‌సీ...!?

ఇంటెలిజెన్స్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సిస్టమ్‌(ఐటీఎస్)లో భాగంగా దేశంలోనే మొదటిసారి అడాప్టివ్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ (ఐటీఎస్‌సీ)ను గ్రేటర్‌లోని అన్ని సిగ్నళ్లకు వినియోగించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా సిగ్నళ్లు ఉండే ప్రాంతాల్లోని రహదారులను జోన్లు/కారిడార్లుగా విభజిస్తారు. కారిడార్లలోని సిగ్నళ్లను ది కాంపొజిట్‌ సిగ్నల్‌ కంట్రోల్‌ స్ర్టాటెజీ(సీఓఎస్‌ఐసీ ఓఎస్‌టీ) సాఫ్ట్‌వేర్‌తో సమన్వయం చేస్తారు. తిరువనంతపురంలోని సెంటర్‌ ఫర్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడీఏసీ) ఈ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ఒక్కో కారిడార్‌ను కామన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ సైకిల్‌తో నిర్వహించేలా సాఫ్ట్‌వేర్‌ పని చేస్తుంది. వాస్తవ సమయ డిమాండ్‌(రియల్‌ టైం డిమాండ్‌) ఆధారంగా సిగ్నళ్ల సమయం ఎంతుండాలనేది ఈ విధానంలో అప్‌డేట్‌ అవుతుంటుంది.


గ్రీన్‌ వేవ్‌ రూట్‌కు అనుగుణంగా సిగ్నళ్లు ఆటోమేటిక్‌గా పని చేస్తాయి. స్టాప్‌లైన్‌ వద్ద వాహనాలు ఆగకుంటే గుర్తించేలా ఫిల్టర్స్‌ ఏర్పాటు చేస్తారు. లేన్‌ డిసిప్లిన్‌ పాటించని వాహనాలనూ గుర్తించే అవకాశముంటుంది. రహదారులను కారిడార్లుగా విభజిస్తూ, ఆయా మార్గాల్లో సగటు వాహనాల రాకపోకలు ఏ స్థాయిలో ఉంటాయి, ఉదయం, సాయంత్రం వేళల్లో పరిస్థితి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని గ్రీన్‌ వేవ్‌ రూట్స్‌ ఎంపిక చేస్తారు. జీహెచ్‌ఎంసీ, భెల్‌ మధ్య నడుస్తున్న వివాదంతో ఈ అధునాతక సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి రావడం ఆలస్యం అవుతోంది. 

Updated Date - 2021-11-20T12:17:40+05:30 IST