పారిశుధ్య కార్మికులు విధులకు వచ్చేదెలా?

ABN , First Publish Date - 2021-05-14T19:36:32+05:30 IST

12 గంటల తర్వాత రెండో దఫా హాజరు తీసుకొని పని ముగిసిన అనంతరం

పారిశుధ్య కార్మికులు విధులకు వచ్చేదెలా?

  • పారిశుధ్య కార్మికులకు లాక్‌డౌన్‌ తిప్పలు
  • అందుబాటులో లేని ప్రజా రవాణా వ్యవస్థ
  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని అధికారులు


ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని ఓ ఏరియాలో పనిచేసే పారిశుధ్య కార్మికురాలు దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి వస్తుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రెండు రోజుల నుంచి ఉదయం 6.30 - 7 గంటల మధ్య పనికి వస్తోంది. దీంతో ఆమెకు బయోమెట్రిక్‌ హాజరు వేసుకునే అవకాశం ఉండడం లేదు. అంబర్‌పేటలో ఉండే ఓ కార్మికురాలు సికింద్రాబాద్‌లో పని చేస్తుంది. 12 గంటల తర్వాత రెండో దఫా హాజరు తీసుకొని పని ముగిసిన అనంతరం ఆమె ఇంటికి పయనమవుతోంది. రెండు రోజులుగా ఆటోలో వచ్చినందుకు ఆమెకు రూ.350 ఖర్చయ్యాయి. 


హైదరాబాద్‌ సిటీ : లాక్‌డౌన్‌లో జీహెచ్‌ఎంసీ ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయకపోవడంతో పారిశుధ్య కార్మికులు పడుతున్న ఇబ్బందులు ఇవి. అత్యవసర సర్వీసుల పరిధిలోకి వచ్చే వర్కర్లు విధులకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉండగా, ఇళ్ల నుంచి పని ప్రదేశానికి, పనులు ముగిసిన అనంతరం ఇంటికి వెళ్లడం ఇప్పుడు వారికి కష్టంగా మారింది. ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో లాక్‌డౌన్‌ సమయంలో రావడం, వెళ్లడం కష్టంగా ఉందని పలు ప్రాంతాల్లోని కార్మికులు చెబుతున్నారు. 


ఆ గంటల్లోనే హాజరు

వేసవిలో ఉదయం 5 గంటలకే పారిశుధ్య కార్మికులు విధులకు రావాలి. 5 గంటల నుంచి 6 గంటల మధ్య మాత్రమే బయోమెట్రిక్‌ ద్వారా హాజరు తీసుకునే అవకాశం ఉంటుంది. 6 తర్వాత యంత్రాలు పని చేయవు. కార్మికులు సకాలంలో విధులకు హాజరు కావాలనే ఉద్దేశంతో గతంలో యంత్రాల్లో సాంకేతిక మార్పు చేశారు. 6 గంటల తర్వాత పనికి వచ్చినా, ఆ రోజు విధులకు గైర్హాజరైనట్టు లెక్క. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి హాజరు తీసుకుంటారు. ఇదంతా కార్మికులతో సక్రమంగా పని చేయించేందుకు తీసుకున్న నిర్ణయంగా అధికారులు చెబుతున్నారు. 


లాక్‌డౌన్‌ వేళా అవే నిబంధనలు అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌తో 6 గంటల తర్వాత కానీ ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉండడం లేదు. దీంతో మెజార్టీ కార్మికులు 6 గంటల తర్వాతే విధులకు వస్తున్నారు. దీంతో వారికి హాజరు పడడం లేదు. పని ప్రదేశానికి దగ్గరగా ఉండే వాళ్లను కుటుంబ సభ్యులు సొంత వాహనాలపై వదిలిపెడ్తున్నారు. 10 గంటల తర్వాత బస్సులు, ఆటోలు అందుబాటులో ఉండడం లేదు. కానీ 12 గంటల వరకు తప్పనిసరిగా పని చేయాలని అధికారులు చెబుతున్నారని ఓ కార్మికురాలు తెలిపారు. దీంతో ఆటోలు, ఇతరత్రా వాహనాల్లో వెళ్లాల్సి వస్తోంది. పారిశుధ్య కార్మికులకు మినహాయింపు ఉన్న నేపథ్యంలో వారిని తీసుకెళ్లేందుకు కొందరు ఆటో డ్రైవర్లు ముందుకు వస్తున్నారు. కానీ రెండు, మూడింతలు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒకే ఆటోలో ఏడెనిమిది మంది వెళ్తుండడంతో వైరస్‌ సోకే ప్రమాదమూ లేకపోలేదు. 


ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏవి..? 

గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో పారిశుధ్య, ఎంటమాలజీ కార్మికుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచారు. రూట్ల వారీగా బస్సులు ఏర్పాటుచేసి ఆ మార్గంలో ఉండే కార్మికులను తీసుకు రావడం, తీసుకెళ్లడం చేసే వారు. ఇప్పుడు అలాంటి ఏర్పాట్లు చేయలేదని కార్మికులు చెబుతున్నారు. ఉప్పల్‌లో పని చేసే ఓ కార్మికురాలు బాలాపూర్‌ నుంచి రోజూ పనికి వస్తుంది. అంతకుముందు బస్సుల్లో వచ్చే ఆమె లాక్‌డౌన్‌తో విధులకు వచ్చి వెళ్లడం ఇబ్బందిగా ఉందని తెలిపారు. ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా మెజార్టీ సర్కిళ్లలో అందుబాటులోకి రాక దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో బస్సులు అందుబాటులోకి వచ్చే అవకాశముందని ఓ అధికారి తెలిపారు. 


పారిశుధ్య సూపర్‌వైజర్‌పై దాడి 

రోడ్డుపై చెత్త వేయవద్దు అన్నందుకు విధి నిర్వహణలో వున్న పారిశుధ్య సూపర్‌వైజర్‌పై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అంబర్‌పేట ఎంసీహెచ్‌ కాలనీలో ఉండే అజీమ్‌ ఖాన్‌, మదర్‌ ఖాన్‌ గురువారం ఉదయం తమ ఇంటిలోని చెత్తను మున్సిపల్‌ గ్రౌండ్‌ మెయిన్‌గేట్‌ ఎదురుగా ఉన్న రోడ్డుపై వేశారు. అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న సూపర్‌వైజర్‌ భాషా రోడ్డుపై చెత్త వేయవద్దని, ఆటోలో వేయాలని వారికి సూచించాడు. దీంతో ఆగ్రహం చెందిన వారు దాడికి పాల్పడడంతో భాషాకు గాయాలయ్యాయి. భాష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-05-14T19:36:32+05:30 IST