Abn logo
May 13 2021 @ 06:07AM

ఘోర కలి

తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక పెద్దసంఖ్యలో కొవిడ్‌ బాధితులు కన్నుమూసిన ఘటన అత్యంత విషాదకరమైనది. రాయలసీమలో అతిపెద్దదిగా పేరొందిన ఈ ఆస్పత్రిలో ఇంతటి ఘోరం చోటుచేసుకోవడం ఉభయ తెలుగు రాష్ట్రాలనే కాక, యావత్‌ దేశాన్ని నిర్ఘాంత పరచింది. యాంత్రిక వైఫల్యమో, ఆక్సిజన్‌ లభించకపోవడమో కాక, కేవలం మానవవైఫల్యం ఈ పెనువిషాదానికి దారితీసింది. 


చుట్టుపక్కల జిల్లాలవారికి కూడా రుయా ఆస్పత్రే పెద్దదిక్కు. కొవిడ్‌ కష్టకాలంలో మరింత కిటకిటలాడుతున్న ఈ ఆసుపత్రిలో మొత్తం బెడ్లలో ఆక్సిజన్‌ వసతి ఉన్నవి దాదాపు సగం. ప్రాణవాయువు అందనిపక్షంలో ప్రాణం పోతుందనుకున్నవారికి మాత్రమే వీటి కేటాయింపులు ఉంటాయి కనుక, ఇక్కడ ఆక్సిజన్‌ నిరవధిక సరఫరాకు ఏమాత్రం అంతరాయం లేకుండా చూడటం ఆస్పత్రి పెద్దల బాధ్యత. ఆక్సిజన్‌ కొరతవల్లనో, కొనుగోలు చేయనందునో కాక, అది సకాలంలో చేరనందుకు ఇన్ని ప్రాణాలు పోవడం మరింత విషాదం. చెన్నైనుంచి వచ్చి ట్యాంకులు నింపాల్సిన ఆక్సిజన్‌ లారీ మరింత ఆలస్యంగా వచ్చివుంటే మరిన్ని ప్రాణాలు పోయేవని అర్థం. దాని రాకకు మార్గమధ్యంలో ఎన్ని అవాంతరాలు ఏర్పడితే, ఎంత ఆలస్యం జరిగితే అంత ఎక్కువమంది ఇక్కడ ప్రాణాలు వదిలేయాల్సి వస్తుందన్నమాట. కచ్చితంగా నివారించదగ్గ, నిర్వహణా వైఫల్యాన్ని విస్పష్టంగా తెలియచెప్పిన ఘోరకలి ఇది. దీనికి ముందు అనంతపురం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఆక్సిజన్‌ కొరతతో పెద్ద సంఖ్యలో రోగులు మరణించిన ఘటనలు కళ్ళెదుటే ఉన్నందున పాలకులు కాస్తంత ప్రత్యేక శ్రద్ధపెట్టి, వ్యవస్థలోనూ, విధానాల్లోనూ ఉన్న లోపాలను గమనించి సరిదిద్దివుంటే ఈ ఘోరం జరిగేది కాదు. 


ఆక్సిజన్‌ లేని కారణంగా రాష్ట్రంలో కనీసం డెబ్బయ్‌ఐదుమంది మరణించారని విపక్షాలు అంటున్నాయి. ముందుగానే ఎంతోకొంత సిద్ధంగా ఉంచాల్సిన ప్రాణవాయువును అప్పటికప్పుడు ఎక్కడినుంచో తెచ్చి ఇలా నింపుకోవడమేమిటన్నది సరైన విమర్శే. మృతుల సంఖ్య, అక్సిజన్‌ సరఫరా స్తంభించిన కాలం విషయంలోనూ ప్రభుత్వం అసత్యాలే చెబుతున్నదని విపక్షాలు అంటున్నాయి. పదకొండు కాదు, ముప్పైమంది మరణించారని ప్రత్యక్షసాక్షులు వాదిస్తుంటే, సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ 23మంది మృతుల పేర్లను మీడియాకు విడుదల చేశారు. ప్రభుత్వం ఒక ఘోరాన్ని జరగనివ్వడమేకాక, అసత్యాలు అర్థసత్యాలతో దానిని కప్పిపుచ్చడానికి ప్రయత్నించడం విచిత్రం. అవసరమైనంత ఆక్సిజన్‌ మీరు అందించగలరా, టోకున టీకా తెప్పించగలరా అంటూ ప్రశ్నించినవారిపై మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు. ఆక్సిజన్‌ అందక చనిపోయింది పదకొండుమందే అని వాదించే క్రమంలో ఆ ఆస్పత్రిలో రోజూ నలభైనుంచి నలభైఐదుమంది కన్నుమూస్తున్న విషయాన్ని రుయా అధికారులు తమకుతాముగా బయటపెట్టారు. కానీ, జిల్లా మొత్తం మరణాల సంఖ్యమాత్రం అందులో సగం కూడా చూపకపోవడం మరో విన్యాసం. 


రోగతీవ్రతతో కాక, ప్రాణవాయువు అందక ఆత్మీయులు కళ్ళెదుట కన్నుమూయడం బాధితుల కుటుంబీకులకు తీవ్ర మనోవేదన కలిగించే అంశం. ఆస్పత్రి పడకలమీద ఆక్సిజన్‌ అందక ఎగిరెగిరిపడుతున్నవారికి చేతనైన సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. ట్యాంకర్‌ వచ్చి నింపేలోగా ఆస్పత్రి సిబ్బంది చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఫలితాన్నివ్వలేకపోయాయి. కళ్ళెదుట తమవారు గిలగిలా కొట్టుకొని కన్నుమూయడం చూసి భరించలేక రోగుల బంధువులు కన్నీళ్ళు పెట్టుకున్నారు, ఆగ్రహంతో దాడులు చేశారు. ప్రధాని నరేంద్రమోదీని ఎవరూ గట్టిగా ప్రశ్నించని కాలంలో, ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ ఓ మాట అనగానే మోదీని వెనకేసుకొస్తూ సొరేన్‌కు సుద్దులు చెప్పిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, ఆక్సిజన్‌ నుంచి టీకాల వరకూ రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు కొరతల పరిష్కారానికి ముందు చూపుతో కృషిచేయడం ముఖ్యం.

Advertisement