గులాం నబీ ఆజాద్ సొంత పార్టీ ఏర్పాటు?

ABN , First Publish Date - 2021-12-05T16:41:38+05:30 IST

జమ్మూ-కశ్మీరులో కొత్తగా ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనే

గులాం నబీ ఆజాద్ సొంత పార్టీ ఏర్పాటు?

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరులో కొత్తగా ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశం తనకు లేదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చెప్పారు. అయితే భవిష్యత్తులో రాజకీయాల్లో ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. అధికరణ 370 రద్దు తర్వాత నిలిచిపోయిన రాజకీయ కార్యకలాపాలను పునరుద్ధరించడం కోసమే తాను  సమావేశాలు, సభలను నిర్వహిస్తున్నానని చెప్పారు. 


గులాం నబీ ఆజాద్ ఇటీవల జమ్మూ-కశ్మీరులో పర్యటిస్తూ, కొన్ని చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. మరోవైపు  ఆయన సన్నిహితులు దాదాపు 20 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఆయన కాంగ్రెస్‌ను వదిలి, కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఊహాగానాలు చెలరేగాయి. 


ఈ నేపథ్యంలో ఆజాద్ రాంబన్‌లో శనివారం ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌లో విమర్శకు స్థానం ఉండేదని, ప్రస్తుతం కాంగ్రెస్‌లో విమర్శకు చోటు ఉండటం లేదని అన్నారు. నాయకత్వాన్ని ఎవరూ సవాలు చేయడం లేదన్నారు. పరిస్థితులు చెడు మార్గం పట్టినపుడు ప్రశ్నించడానికి తనకు మితిమీరిన స్వేచ్ఛను ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఇచ్చారన్నారు. విమర్శించడం తప్పు అని వారు ఎన్నడూ భావించేవారు కాదని చెప్పారు. నేటి నాయకత్వం విమర్శను తప్పుగా చూస్తోందని వివరించారు. 


యువజన కాంగ్రెస్‌లో ఇద్దరు ప్రధాన కార్యదర్శులను నియమించాలని ఇందిరా గాంధీ తనకు చెప్పారని, అయితే తాను అందుకు తిరస్కరించానని, అందుకు ఆమె ‘సరే’ అన్నారని తెలిపారు. రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో, తనను, ఆయనను ఇందిరా గాంధీ పిలిచారని చెప్పారు. రాజీవ్‌ను ఉద్దేశించి ఇందిర మాట్లాడుతూ, ‘‘గులాం నబీ నేను చెప్పినదానికి కాదని చెప్పగలరు. అలా కాదనడం అంటే అవిధేయంగా లేదా అగౌరవంతో ఉన్నట్లు కాదు. అది పార్టీ మేలు కోసమే’’ అని చెప్పారని తెలిపారు. నేడు ఆ విధంగా కాదనడాన్ని వినడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. కాదని చెప్పినందుకు నేడు అపరిచితులమైపోతున్నామని వాపోయారు. 


తాను సొంతంగా ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం గురించి మాట్లాడుతూ, తనకు అటువంటి ఉద్దేశం లేదని చెప్పారు. అయితే ఎవరు ఎప్పుడు మరణిస్తారో చెప్పలేనట్లే, రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు.


Updated Date - 2021-12-05T16:41:38+05:30 IST