Abn logo
Aug 1 2021 @ 23:05PM

‘గిద్దలూరు’లో మళ్లీ కరోనా

నిన్న ఒక్కరోజే పట్టణంలో 4, మండలంలో 2 పాజిటివ్‌ల నమోదు

మిగిలిన మండలాల్లో రోజూ 10 నుంచి 15 కొత్త కేసుల రాక

ఇరవై రోజుల క్రితం ఏమీలేకపోవడంతో ఊపిరిపీల్చుకున్న ప్రజలు

మూడో ముప్పుపై ప్రజల్లో ఆందోళన

కనిపించని భౌతికదూరం, మాస్క్‌లు  


గిద్దలూరు, ఆగస్టు 1 : కరోనా రెండో దశ చాలా ప్రాంతాల్లో ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. రోజూ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.  ప్రధాన కూడళ్లు, దుకాణ సముదాయాల వద్ద భౌతికదూరం కన్పించడం లేదు. మాస్కులు పెట్టుకునే వారు లేరు. ప్రస్తుతం రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌ కేసుల నేపథ్యంలోనే మూడో ముప్పు చొచ్చుకువస్తే పరిస్థితి ఏమిటని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటించాలని పాలకులు నిత్యం చెబుతున్నా ప్రజల్లో పెద్దగా స్పందన లేదు. 

గిద్దలూరు నగర పంచాయతీలో రోడ్లపైకి వచ్చే జనాభాలో సగానికి పైగా కూడా మాస్కులు పెట్టుకోవడంలేదు. భౌతికదూరాన్ని మరిచిపోయారు. కూరగాయల మార్కెట్‌, సూపర్‌బజార్లు, ఇతర అన్ని దుకాణాల వద్ద గుంపులుగా చేరుతున్నారు. నో మాస్క్‌.. నో ఎంట్రీ అని షాపుల ముందు బోర్డులు పెట్టినప్పటికీ చాలామంది వినియోగదారులు మాస్కు ధరిస్తున్న దాఖలాలు లేవు. మాస్కు పెట్టుకోవాలని కొందరు దుకాణదారులు చెప్పిన రెండుమూడు నిమిషాల వరకు పెట్టుకుని తరువాత తొలగిస్తున్నారు. మద్యం దుకాణాల వద్ద భౌతికదూరం అన్న సంగతే మరిచిపోయారు. తాజాగా సినిమా హాళ్లు తెరుచుకున్నాయి. అన్ని సీట్లలో ప్రేక్షకులు కూర్చునేందుకు అనుమతి రావడంతో భౌతికదూరం కనిపించడం లేదు. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో కూడా అన్ని సూట్ల ను ఫుల్‌ చేసి కూర్చోపెడుతున్నారు. తమ పక్కన కూర్చునే వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటో.. ఇంత రద్దీలో ఎక్కడ కరోనా వస్తుందో అన్న ఆందోళన అందరిలోనూ నెలకొంటోంది. గతంలో పోలీసు, మున్సిపల్‌ అధికారులు మాస్క్‌ లేని వారు కన్పిస్తే జరిమానాలు విధించేవారు. లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేసిన తరువాత మాస్కు లేకపోయినా, గుమిగూడినా ఎవరూ పట్టించుకోవడం లేదు. కొందరు నిర్లక్ష్యంగా రోడ్లపై మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. 

తగ్గని కేసులు

కరోనా మొదటి, రెండో దశల్లో ఈ ప్రాంతంలో పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదయ్యాయి. ప్రస్తుతం రోజూ కొత్తగా నమోదవుతున్న కేసులు కలవరం పెడుతున్నాయి. ఆదివారం ఒక్క గిద్దలూరు పట్టణంలోనే 4, రూరల్‌ ప్రాంతంలో 2 కేసులు నమోదయ్యాయి. ఇక నియోజకవర్గంలో మిగిలిన మండలాల్లో రోజూ 10 నుంచి 15 మందికి పాజిటివ్‌లు వస్తూనే ఉన్నాయి. 20 రోజుల క్రితం కేసులు భారీగా తగ్గడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత మెల్లమెల్లగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వీరికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉండడంతో హోంక్వారంటైన్‌లో ఉంటున్నారు. మూడో ముప్పు తప్పదని వస్తున్న హెచ్చరిక నేపథ్యంలో ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించి, కరోనా బారినపడకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కచ్చితంగా మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించాలి. పోలీస్‌, మున్సిపల్‌ అధికారులు మాస్కులు ధరించని వారికి అవగాహన కల్పించి జరిమానాలు విధిస్తే తప్ప థర్డ్‌వేవ్‌ ముప్పు నుంచి బయటపడలేం. 


పొదిలిలో 48 కరోనా కేసులు 

పొదిలి(రూరల్‌) : కరోనా తగ్గుముఖం పట్టిందని తాత్సారం చేయకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఉప్పలపాడు పీహెచ్‌సీ వైద్యాధికారి షేక్‌ షాహీదా చెప్పారు. ప్రస్తుతం పొదిలిలో 48 యాక్టివ్‌ కేసులు ఉన్నాయన్నారు. పట్ణణంతో పాటు గ్రామీణ ప్రాంతాలైన కుంచేపల్లి, పాముల పాడులో కేసులుత నమోదయ్యాయని వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. బయటకు వచ్చేవారు భౌతిక దూరం పాటించడంతోపాటు మాస్క్‌ను తప్పవనిసరిగా పెట్టుకోవాలన్నారు.  ఆరోగ్య సమస్య వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలన్నారు. ఇప్పటి వరకు 19 వేలకు పైగా టీకాలు వేసినట్లు షాహిదా తెలిపారు.