మరింత మందికి ‘గిరి పోషణ’

ABN , First Publish Date - 2021-10-15T06:28:11+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, మారుమూల ప్రాంతాల ప్రజల్లో పౌష్టికాహార లోపాలను అధిగమించేందుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది.

మరింత మందికి ‘గిరి పోషణ’

  • పౌష్టికాహార లోపాల్ని అధిగమించేందుకు పథకం.. 
  • తృణధాన్యాలతో పాటు చిరుతిళ్ల అందజేత.. 
  • గిరిజన సంక్షేమ శాఖ ప్రణాళిక


హైదరాబాద్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, మారుమూల ప్రాంతాల ప్రజల్లో పౌష్టికాహార లోపాలను అధిగమించేందుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ ‘పోషణ్‌ అభియాన్‌’ పథకాన్ని మరింత విస్తృతం చేయనుంది. ప్రస్తుతం ‘గిరి పోషణ’ కింద అందిస్తున్న తరహాలోనే ఇకపై ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో చిన్నారులు, బాలికలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. గతంలో ఆసిఫాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దశల వారీగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తూ వస్తున్నారు. 


ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 584 గ్రామాల్లో పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.8 కోట్లు ఖర్చు చేస్తోంది. రూ.3.50 కోట్లు గిరిజన సంక్షేమ శాఖ, రూ.4.50 కోట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి కేటాయించి ఖర్చు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం గిరిజనులకు మాత్రమే, అందులోనూ చిన్న పిల్లలు, కౌమార బాలికలు, గర్భిణులు, బాలింతలను మొదటి ప్రాధాన్యంగా తీసుకుని ‘గిరి పోషణ’ అందిస్తున్నారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకు చెందిన పేదలకు పోష్టికాహారం అందించే విధంగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పౌష్టికాహార సరఫరా విజయవంతంగా కొనసాగుతుండటంతో తెలంగాణలో అమలుకు సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే అధికారుల బృందం అక్కడికి వెళ్లి అధ్యయనం చేసి వచ్చింది. పోషకాహారంలో భాగంగా తృణధాన్యాలతో పాటు ఒక పూట చిరుతిళ్లను అందిస్తారు. చిరుతిళ్ల కింద తేనె, పల్లీపట్టి, నువ్వుల పట్టి, బిస్కెట్లు, చాక్లెట్లు, చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు ఇస్తారు. గిరిజన సంక్షేమ శాఖలో భాగంగా ఉన్న గిరిజన కో-ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ పలు రకాల ఉత్పత్తులు చేస్తోంది. ఇందుకు సంబంధించిన తయారీ యూనిట్లు కూడా ఉన్నాయి.


వంట పాత్రలూ అందిస్తారు!

పౌష్టికాహారం వండుకునేందుకు కూడా గిరిజనుల వద్ద సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ సమస్య పరిష్కారానికి, అవసరమైన వారికి చిన్న గ్యాస్‌ సిలిండర్లు, ప్రెషర్‌ కుక్కర్‌లు, చిన్నపాటి పాత్రలు గిరిజన సంక్షేమ శాఖ తరఫున  అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు చిరుధాన్యాలను సరిగా నిల్వ చేసుకోకపోతే ఎలుకలు, కీటకాలు వచ్చి చేరి సరుకులు పాడైపోయే అవకాశం ఉంది. దీంతో తృణధాన్యాలను నిల్వ చేసేకునేందుకు అవసరమైన డబ్బాలను కూడా అధికారులు సమకూరుస్తారు. 

Updated Date - 2021-10-15T06:28:11+05:30 IST