Abn logo
Jun 11 2021 @ 04:03AM

ఉన్నత విద్యలో అమ్మాయిల హవా

తెలంగాణలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో వారే అధికం

ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా నమోదు

ఎన్‌రోల్‌మెంట్‌, ఉత్తీర్ణతల్లోనూ ముందడుగు

ఉన్నత విద్యపై జాతీయ స్థాయి సర్వేలో వెల్లడి

ఉన్నత విద్యలో అమ్మాయిలదే హవా


న్యూఢిల్లీ, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఉన్నత విద్య పట్ల అమ్మాయిలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వివిధ కోర్సుల్లో ఎన్‌రోల్‌మెంట్‌, ఉత్తీర్ణత పరంగా వారే ముందంజలో ఉన్నారు. అబ్బాయిల ఎన్‌రోల్‌మెంట్‌ తగ్గింది. కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన ‘అఖిల భారత ఉన్నత విద్యా సర్వే 2019-20’ ద్వారా ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వే నివేదికను కేంద్ర విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. దానిప్రకారం.. తెలంగాణలో పీహెచ్‌డీ, ఎం.ఫిల్‌., పీజీ, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్‌, పీజీ డిప్లొమా తదితర కోర్సుల్లో చేరిన మొత్తం విద్యార్థుల సంఖ్య 13,89,608. ఇందులో 7,16,840 మంది అమ్మాయిలే. ఉత్తీర్ణతలోనూ అమ్మాయిలు ఆధిక్యం చూపించారు.


మొత్తం 3,09,299 మంది పాసయితే, అమ్మాయిలు 1,73,344 మంది, అబ్బాయిలు 1,35,955 మంది ఉన్నారు. కాగా, ఉన్నత విద్యలో మొత్తంగా ఎన్‌రోల్‌మెంట్‌ తగ్గింది. 2015-16లో 14,74,235 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో చేరగా, 2019-20 నాటికి ఈ సంఖ్య 13,89,608 మందికి పడిపోయింది. అమ్మాయిల ఎన్‌రోల్‌మెంట్‌ పెరగ్గా.. అబ్బాయిల సంఖ్య తగ్గింది. ప్రైవేటు కాలేజీల్లో 9,26,945 మంది చేరగా, ప్రభుత్వ కాలేజీల్లో 1,86,272 మంది విద్యార్థులు మాత్రమే చేరినట్టు నివేదిక వెల్లడించింది. జనాభా - కాలేజీల నిష్పత్తి కూడా తెలంగాణలో  తగ్గింది. 2015-16లో లక్ష జనాభాకు 60 చొప్పున ఉంటే, 2019-20 నాటికి సంఖ్య 53కు పడిపోయింది. రాష్ట్రంలో 292 ప్రభుత్వ కాలేజీలే ఉన్నట్టు నివేదిక తెలిపింది.


ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా..

యూజీ కోర్సుల్లో వివిధ రాష్ట్రాల్లో ధోరణులను పరిశీలిస్తే.. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో అమ్మాయిల శాతం కంటే అబ్బాయిల శాతం ఎక్కువగా ఉంది. వీటికి భిన్నంగా తెలంగాణలో అమ్మాయిల శాతం ఎక్కువగా ఉండటం విశేషం. అయిదేళ్లలో జాతీయస్థాయిలో కూడా అమ్మాయిల ఎన్‌రోల్‌మెంట్‌ 18 శాతం పెరిగింది. అయితే డిగ్రీ, పీజీ స్థాయుల్లో అందించే వృత్తివిద్యా కోర్సుల్లో అమ్మాయిల శాతం తక్కువగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. విద్యాసంస్థల పరంగా చూస్తే.. జాతీయ స్థాయి ప్రాముఖ్యం ఉన్న సంస్థలు, ప్రైవేటు, ఓపెన్‌, డీమ్డ్‌ యూనివర్సిటీల్లో అమ్మాయిల శాతం తక్కువగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. వీటికంటే మెరుగ్గా స్టేట్‌ యూనివర్సిటీల్లో 50.1 శాతం మంది అమ్మాయిలు ఉన్నట్టు పేర్కొంది. సెంట్రల్‌ యూనివర్సిటీల్లో అమ్మాయిల ఎన్‌రోల్‌మెంట్‌ 48.1 శాతం ఉన్నట్టు తెలిపింది.

వివిధ కోర్సుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఇలా...

Advertisement