గోడలపై గ్రేట్‌ ఆర్ట్‌!

ABN , First Publish Date - 2020-03-23T05:30:00+05:30 IST

సాధారణంగా అమ్మాయిలు త్వరగా చదువు పూర్తిచేసి, ఉద్యోగంలో స్థిరపడాలని చూస్తారు. అలాంటి కోర్సులనే ఎంచుకుంటారు. కానీ అందుకు భిన్నంగా....

గోడలపై గ్రేట్‌ ఆర్ట్‌!

సాధారణంగా అమ్మాయిలు త్వరగా చదువు పూర్తిచేసి, ఉద్యోగంలో స్థిరపడాలని చూస్తారు. అలాంటి కోర్సులనే ఎంచుకుంటారు. కానీ అందుకు భిన్నంగా ‘బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌’ (బీఎఫ్‌ఎ)ను ఎంచుకుని, అందులో రాణిస్తున్నారు కంది స్వాతి. వీధి చిత్రలేఖన ప్రదర్శన ద్వారా తన భర్త విజయ్‌తో కలిసి ఈ రంగంలో ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. ఖమ్మంలో రూ.కోటితో ఇటీవల నిర్మించిన బాస్కెట్‌బాల్‌ ఇండోర్‌ స్టేడియం ప్రవేశ ద్వారం గోడ మీద అంతర్జాతీయ బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు కోబీ బ్రయంట్‌  భారీ బొమ్మను అద్భుతంగా గీసి ప్రశంసలు అందుకున్నారు. పలు సామాజిక అంశాలను జోడిస్తూ దేశ విదేశాల్లో తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న ఆమె ‘నవ్య’తో ముచ్చటించారు. ఆ విశేషాలే ఇవి...


‘‘నాది ఖమ్మం పట్టణంలోని ద్వారకానగర్‌... అయితే ప్రస్తుతం వృత్తిరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నా. మా నాన్న నాగాచారి కో ఆపరేటివ్‌ బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేసి రిటైరయ్యారు. అమ్మ శశికళ గృహిణి. నాకొక తమ్ముడున్నాడు. ఇంటర్‌ వరకు ఇక్కడే చదివా. మా మేనమామలు కల్లూరి శ్రీధర్‌, కల్లూరి కరుణాకర్‌ ఇద్దరు కూడా చిత్రకారులే. వారికి చెందిన ‘శ్రీధర్‌ ఆర్ట్స్‌’ ఇప్పటికీ ఖమ్మంలో ఫేమస్‌. నా చిన్నప్పటి నుంచి వాళ్లు బొమ్మలు వేస్తుంటే చూసి నేనూ అలాగే వేసేదాన్ని. అలా నాకు కూడా చిత్రకారిణి కావాలనే ఆసక్తి కలిగింది. పాఠశాలలో, కాలేజీలో డ్రాయింగ్‌ వేసేదాన్ని. ఆ ఆసక్తితోనే ఇంటర్‌ పూర్తవ్వగానే ‘బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌’లో చేరాలనుకున్నా. అయితే అందుకు అమ్మానాన్న ఒప్పుకోలేదు. ‘ఈ రంగంలో పెద్దగా అవకాశాలుండవు. 


ఇంజనీరింగ్‌ చేసి ఉద్యోగం చూసుకుంటే మంచిది’ అని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ నాకు ఆసక్తి ఉన్న రంగంలోనే డిగ్రీ చేయాలనుందని చెప్పడంతో వారు కూడా సరేనన్నారు. ఆ విధంగా హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ ఫైన్‌ ఆర్ట్స్‌లో ఎంట్రన్స్‌ రాసి పెయింటింగ్‌ విభాగంలో సీటు పొందా. అక్కడే నా సహ విద్యార్థి విజయ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం, ప్రేమగా మారి ఇద్దరం చదువు అనంతరం ఇంట్లోవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. మేమిద్దరం ఇదే రంగంలో ఉండడం వల్ల ఒకరి పట్ల మరొకరికి అవగాహన ఉంది.  


ధైర్యం కావాలి...

గోడలపై పెద్ద పెద్ద పెయింటింగ్‌ కోసం అపార్టుమెంట్లు, ఎత్తయిన భవనాలకు స్ట్రక్చర్‌ ఏర్పాటుచేసుకుని, క్రేన్‌ సాయంతో వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం భద్రతపరంగా జాగ్రత్తలు తీసుకుంటాం. అంత ఎత్తున బొమ్మలు వేయాలంటే ధైర్యం కావాలి. అయుతే పెయింటింగ్‌ వేసేప్పుడు అందులో లీనమైపోతాం కాబట్టి ఎప్పుడూ భయపడలేదు. అమ్మాయిలు ఈ రంగంలో తక్కువగా ఉంటారు. అయితే ఆసక్తి ఉంటే దేన్నయినా సాధించొచ్చు. నేను నా భర్త దశాబ్దకాలంగా ‘స్ర్టీట్‌ ఆర్ట్‌’ ద్వారా అనేక బొమ్మలు వేస్తూ ఈ రంగంలో ముందుకు వెళ్తున్నాం. ఇద్దరం ఒకే రంగంలో పనిచేయడం ద్వారా ఒకరి అభిప్రాయాలు ఒకరం పంచుకుంటాం... మొదట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇప్పుడిప్పుడే ఆ ఇబ్బందుల నుంచి బయటపడి ఆనందంగా ముందుకు సాగుతున్నాం.’’




స్ట్రీట్‌ ఆర్ట్‌ వైపు... 

చదువు పూర్తి కాగానే ఆర్థికంగా నిలబడాలనుకున్నాం. అందుకు ‘స్ర్టీట్‌ ఆర్ట్‌’ను వేదికగా చేసుకున్నాం. స్వచ్ఛభారత్‌, తెలంగాణ ఉద్యమం, రైతాంగ సమస్యలు, రైతుల ఆత్మహత్యలు... ఇలా పలు కోణాల్లో వీధుల్లో ఉండే ఖాళీగోడలపై బొమ్మలు గీసేవాళ్లం. ఇందుకోసం మొదట్లో మేమే ఖర్చులు భరించి మా కళను ప్రదర్శించాం. వరంగల్‌ జిల్లా రంగశాయిపేట గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాల అధ్వాన్నంగా ఉంటే, అక్కడకు వెళ్లి మా సొంత డబ్బుతోనే ఆ పాఠశాల పైనుంచి అక్షరాలు జాలువారుతున్నట్టుగా... పిల్లలు వాటిని పట్టుకుంటున్నట్టుగా పెయింటింగ్‌ వేశాం. దాంతో ఆ పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. అది చూసి అప్పటి ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురంలో ప్రభుత్వ పాఠశాలకు పెయింటింగ్‌, బొమ్మలు వేయాలని కోరారు. ఆ పాఠశాల గోడలపై కూడా అందమైన బొమ్మల గీసి అందర్నీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దాం. 




కేటీఆర్‌ ప్రశంసించారు...

ఆమధ్య ఇవాంకా ట్రంప్‌ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు హైటెక్‌సిటీ ఫ్లైఓవర్‌ కింద మేము వేసిన స్ర్టీట్‌ ఆర్ట్స్‌ పెయింటింగ్‌ అందర్నీ ఆకట్టుకుంది. 2017లో హైదరాబాద్‌లో ‘స్ర్టీట్‌ ఆర్ట్‌’ ఇంటర్నేషనల్‌ సెమినార్‌ జరిగింది. అప్పుడు సెల్‌ఫోన్‌లో మనిషి చిక్కుకుపోయిన దృశ్యాన్ని ఇంటర్‌నెట్‌ మొబైల్‌ట్రక్‌ పేరుతో వేశాను. దాన్ని కేటీఆర్‌ చూసి మమ్మల్ని అభినందించారు. ఖమ్మంలో ఇటీవల పెవిలియన్‌ గ్రౌండ్‌లో నిర్మించిన ఇండోర్‌ బాస్కెట్‌బాల్‌ స్టేడియం గోడ మీద ఇటీవల హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు కోబీ బ్రయంట్‌ బొమ్మ గీయాలని జిల్లా కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ సూచించారు. వారం రోజుల పాటు నా భర్త, నేను, మరో నలుగురు సహాయకులతో ఆ బొమ్మ వేశాం. స్టేడియం ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ ఆ బొమ్మను చూసి మెచ్చుకున్నారు. 


నలజాల వెంకట్రావు, ఖమ్మం

ఫొటోలు: వి.రవిశంకర్


2013లో ఫ్రెంచ్‌ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాం. దానికి ఎంపిక అవడంతో నా భర్త విజయ్‌, నేను 9 నెలలు పారి్‌సలో ‘స్ర్టీట్‌ ఆర్ట్‌’పై ప్రదర్శనలు ఇచ్చాం. అక్కడి ఇళ్లపై, అపార్టుమెంట్లపై అందమైన బొమ్మలు గీశాం. జపాన్‌ ఎగ్జిబిషన్‌కు కూడా అవకాశం లభించింది. ఇందుకోసం అవసరమైన ఆర్థిక సాయాన్ని (లక్షా 50వేల రూపాయలు) తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇలా విదేశాలతో పాటు మన దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా స్ర్టీట్‌ ఆర్ట్‌ వేశాం. ‘స్ర్టీట్‌ ఆర్ట్‌’ను ప్రమోట్‌ చేస్తుండడంతో 2016లో ‘వోవ్‌’ మేగజైన్‌ నన్ను గుర్తించింది. 


‘స్ర్టీట్‌ ఆర్ట్‌’ అనేది ఇప్పుడిప్పుడే మన దేశంలో గుర్తింపు తెచ్చుకుంటోంది. ఆర్టిస్టులు చాలామంది ఉన్నప్పటికీ ‘స్ట్రీట్‌ ఆర్ట్‌’ వేసేవారు మనదగ్గర చాలా తక్కువ. అందుకే ఈ కళను ప్రభుత్వం ప్రోత్సహించాలి. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ కళాకారులు, క్రీడాకారులు, స్ఫూర్తిదాతలు, చరిత్రకారుల బొమ్మల ప్రదర్శనకు స్ర్టీట్‌ ఆర్ట్స్‌ వేదిక కావాలి. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ భవనాలు, పాఠశాలల్లోకూడా స్ఫూర్తిని కలిగించే చిత్రాలు, సూక్తులను పెయింటింగ్‌ ద్వారా వేయించాలి. 



Updated Date - 2020-03-23T05:30:00+05:30 IST