రైతులకు విరివిగా రుణాలివ్వండి

ABN , First Publish Date - 2020-05-27T10:20:03+05:30 IST

ఖరీఫ్‌లో రైతులకు విరివిగా పంట రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ బ్యాంకు మేనేజర్లను కోరారు.

రైతులకు విరివిగా రుణాలివ్వండి

బ్యాంకర్లకు కలెక్టర్‌ ఆదేశం


కర్నూలు, మే 26(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌లో రైతులకు విరివిగా  పంట రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ బ్యాంకు మేనేజర్లను కోరారు. కలెక్టరేట్‌లో మంగళవారం డీసీసీ జిల్లా స్థాయి అధికారుల సమీక్షా సమావేశం జరిగింది. ఖరీఫ్‌ సీజన్‌ 2020-21 వార్షిక ప్రణాళికను రూ.15,580 కోట్లతో రూపొందించారు. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.12,050 కోట్లు కేటాయించారు. ఇందులో స్వల్ప కాలిక పంట ఉత్పత్తులకు రూ.7,240 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బ్యాంకర్లు వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత రంగాలకు సకాలంలో రుణాలు ఇచ్చి పోత్సహించాలని కోరారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రుణాలను వెంటనే ఇవ్వాలని సూచించారు. జిల్లాలో నిర్దేశించిన మేరకు రుణాలను పంపిణీ చేసి లక్ష్యాలను చేరుకోవాలని బ్యాంకర్లను ఆదేశించారు. పొదుపు మహిళలకు జీవనోపాధి రుణాలు కూడా సకాలంలో అందేలా చూడాలన్నారు. కొవిడ్‌-19 విపత్తును దృష్టిలో ఉంచుకుని బ్యాంకుకు వచ్చే ఖాతాదారులు మాస్కులు తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్యాంకుల్లో హ్యాండ్‌ శాని టైజర్లు అందుబాటులో ఉంచాలని, సిబ్బంది గ్లౌవ్స్‌, మాస్కులు తప్పని సరిగా ధరించాలని సూచించారు. 


ఈ ఏడాదీ సహకరించండి..

గత ఏడాది బ్యాంకర్లు బాగా సహకరించారని, ఈ ఏడాది కూడా అదేలా సహకారం అందించాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసులు కోరారు. పొదుపు సంఘాల మహిళలకు ఈ ఏడాది కూడా వంద శాతం రుణాలు ఇవ్వాలని మెప్మా పీడీ కోరారు. సబ్సిడీ రిటర్న్‌ ఇంతవరకు ఇవ్వలేదని, వెంటనే వచ్చేలా చూడాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖల అధికా రులు బ్యాంకర్లను కోరారు. జిల్లాలోని 3,098 మంది చేనేత కార్మికులకు ప్రభుత్వం రూ.24 వేలు ఆర్థిక సాయం చేసిందని, బ్యాంకర్లు ఆ సొమ్మును పాత బకాయిల కింద జమ చేసుకున్నారని చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు తెలిపారు. జేసీలు రవిపట్టన్‌శెట్టి, సయ్యద్‌ ఖాజామొహిద్దీన్‌, డీఆర్వో పుల్లయ్య, ఎల్‌డీఎం నగేశ్‌, నాబార్డు ఏజీఎం పార్థసారథి పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-27T10:20:03+05:30 IST