అవకాశమివ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం

ABN , First Publish Date - 2021-10-23T06:11:24+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో అమ్మకాల బీజేపీకి నమ్మకాల టీఆర్‌ఎస్‌కు మధ్య పోటీ జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు.

అవకాశమివ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం
హుజూరాబాద్‌లో ధూంధాం కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు

 - రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు

హుజూరాబాద్‌ రూరల్‌, అక్టోబరు 22: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో అమ్మకాల బీజేపీకి నమ్మకాల టీఆర్‌ఎస్‌కు మధ్య పోటీ జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శుక్రవారం హుజూరాబాద్‌ పట్టణంలోని సూపర్‌ బజార్‌ చౌరస్తా వద్ద జరిగిన ధూంధాం కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, స్ముృతిఇరానీ, మురళీధర్‌గౌడ్‌లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అబద్ధాల ప్రచారం చేస్తున్నారన్నారు. హుజూరాబాద్‌లో మూడు నెలలుగా జరుగుతున్న అభివృద్ధి కళ్ల ముందే కనబడుతుందన్నారు. హుజూరాబాద్‌లో అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే రూ.60 కోట్లు నిధలు  కేటాయించామని, ఈ పనులు పూర్తి కావాలంటే విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలన్నారు. ఒక్కసారి అవకాశమివ్వండి హుజూరాబాద్‌ రూపు రేఖలు మార్చి చూపిస్తా అన్నారు. ఈటల రాజేందర్‌ ఏడేళ్లు మంత్రిగా ఉన్న సమయంలో హుజూరాబాద్‌ ప్రజలను పట్టించుకోలేదన్నారు. హూజూరాబాద్‌లో ప్రచారం చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ప్రధాని మోదీతో మాట్లాడి గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించి ఓట్లు అడుగాలన్నారు. దేశంలో ఆస్తులన్నీ అమ్మకానికి పెట్టిన పార్టీ బీజేపీ అన్నారు. హూజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌కు పేదలపై ప్రేమ లేక ఒక ఇల్లు కూడా కట్టలేదని, రానున్న రోజుల్లో ఐదు వేల డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టించే బాధ్యత నాదేనన్నారు.  హుజూరాబాద్‌లో అత్యద్భుతమైన స్టేడియం, మోడల్‌గా మోడల్‌ చెరువును నిర్మిస్తామన్నారు. కరీంనగర్‌ ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌ రెండున్నర సంవత్సరాలుగా హుజూరాబాద్‌ నియోజకవర్గానికి రూ. 10 లక్షలైనా ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు వొడితెల ఇంద్రనీల్‌ ప్రజల మధ్య కూర్చొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, ఎర్రోల్ల శ్రీనివాస్‌, బండ శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- సంక్షేమాన్ని ఇచ్చే పార్టీ టీఆర్‌ఎస్‌

- మంత్రి గంగుల కమలాకర్‌

తెలంగాణలో సంక్షేమాన్ని ఇచ్చే పార్టీ టీఆర్‌ఎస్‌ అని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఏడేళ్లు మంత్రిగా పనిచేసి హుజూరాబాద్‌ను అభివృద్ధి చేయలేని వ్యక్తి రేపు ప్రతిపక్షంలో ఉండి ఏం చేయగలడో ఆలోచించాలన్నారు. ఈటల వల్లే హుజూరాబాద్‌ యువకులకు ఉద్యోగాలు రాకుండా పోయాయన్నారు. హుజూరాబాద్‌లో అభివృద్ధికి పట్టం కట్టి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు.

Updated Date - 2021-10-23T06:11:24+05:30 IST