అర్హులకు రుణాలివ్వండి

ABN , First Publish Date - 2020-12-05T05:34:00+05:30 IST

ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారికి సత్వరమే రుణాలు ఇవ్వాలని కలెక్టర్‌ జి. వీరపాండియన్‌ బ్యాంకర్లను ఆదేశించారు.

అర్హులకు రుణాలివ్వండి

  1. బ్యాంకర్లకు కలెక్టర్‌ వీరపాండియన్‌  ఆదేశాలు


కర్నూలు, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారికి సత్వరమే రుణాలు ఇవ్వాలని కలెక్టర్‌ జి. వీరపాండియన్‌ బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న తోడు, పీఎం స్వనిధి, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ బీమా తదితర అంశాలపై బ్యాంకర్లు, మెప్మా, డీఆర్‌డీఏ అధికారులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ ఆర్థిక చేయూతనందించేందుకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింద న్నారు. ఇందులో భాగంగా జగనన్న తోడు, వైఎస్సార్‌ చేయూత పథకాలకు గ్రామ సచివాలయాల ద్వారా అర్హులైన లబ్ధిదారుల జాబితాను బ్యాంకర్లకు అందిందని తెలిపారు. వీధి వ్యాపారుల దరఖాస్తులను వెంటనే పరిశీలించి రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. తిరస్కరణకు గురైన దరఖాస్తులను కూడా మరోసారి పరిశీలించాలన్నారు. వైఎస్సార్‌ బీమా పథకానికి లబ్ధిదారులకు బ్యాంకు ఖాతా లేకపోతే వెంటనే తెరిపించి ప్రీమియం జమ చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్‌ డీకే బాలాజీ, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసులు, మెప్మా ఇన్‌చార్జి పీడీ శిరీష, ఎల్‌డీఎం వెంకట నారాయణ, పశు సంవర్థక శాఖ జేడీ రమణయ్య, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.


7 నుంచి వ్యర్థాలపై యుద్ధం

ఈ నెల 7 నుంచి 21 వరకు వ్యర్థాలపై యుద్ధం పేరుతో జిల్లా వ్యాప్తంగా 374 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ జి. వీరపాండియన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్యం, తాగునీటి విషయాల్లో ప్రజలకు చైతన్యపరిచేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోందని అన్నారు. ఇందులో భాగంగా రోజుకో ప్రభుత్వ శాఖ చేత వివిధ వర్గాల ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 


ఉపాధి పనుల్లో జాప్యం తగదు

ఉపాధి హామీ అనుసంధాన పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ జి. వీరపాండియన్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా పంచాయతీ రాజ్‌ ఈఈ, డీఈ, ఏఈలతో ఎన్‌ఆర్‌జీఎస్‌ కంపోనెంట్‌ పనులపై ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్‌ వాడీ భవనాలు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు, సీసీ రోడ్లు తదితర నిర్మాణ పనుల్లో కేటాయించిన లక్ష్యాన్ని త్వరలో పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ అనుసంధాన పనుల ప్రగతిపై ఇంజనీర్లు శ్రద్ధ చూపించడంలేదన్నారు. పనుల్లో పురోగతి చూపని మండల ఇంజనీర్లకు, ఈఈలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈని ఆదేశించారు. 125 సచివాలయాలు, 409 వైఎస్సార్‌ క్లినిక్‌లు, 476 రైతు భరోసా కేంద్రాలు ఇంకా బేస్‌మెంట్‌ స్థాయిలోనే ఉన్నాయని, పనుల ప్రగతి అధ్వానంగా ఉందని కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. వారానికి 10 కోట్ల రూపాయల పనుల జరగాలని, కేటాయించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు కేవలం 14 వారాలు మాత్రమే సమయం ఉందని అన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈ సుబ్రహ్మణ్యం, డ్వామా పీడీ అమరనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-05T05:34:00+05:30 IST