రూ.100లకు.. 17బంగారు ఉంగరాలు..!

ABN , First Publish Date - 2021-11-03T19:13:15+05:30 IST

రూ.100లకు.. 17బంగారు ఉంగరాలు..

రూ.100లకు.. 17బంగారు ఉంగరాలు..!

ఇంటర్‌నెట్‌డెస్క్: రూ.100లకు.. 17బంగారు ఉంగరాలు ఏంటి అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. దీపావళి, ధన్‌తెరాస్ సందర్భంగా చాలామంది బంగారం, వెండి ఆభరణాలు, పాత్రలు కొనుగోలు చేస్తుంటారు. దీంతో నగల దుకాణాలన్నీ కిటకిటలాడుతుంటాయి. ఇద్దరు వ్యక్తులు ఓ నగల దుకాణానికి రూ.100తీసుకెళ్లి.. ఒకటిన్నర లక్ష విలువ చేసే బంగారు రింగులను తీసుకొని బయటకు వచ్చారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లా శ్రీదున్‌గర్‌గర్గ్ పట్టణంలో జరిగింది. 


స్థానిక పట్టణానికి చెందిన రాధేశ్యామ్ సోనీ అనే వ్యక్తికి నగల దుకాణం ఉంది. దీపావళి సీజన్ కావడంతో కస్టమర్లతో షాపు కిటకిటలాడుతోంది. షాపులో రాధేశ్యామ్ ఒక్కడే ఉంటాడు. కస్టమర్లకు కావాల్సిన వస్తువులన్నీ అతనే అందిస్తుంటాడు. ఇదే అదునుగా భావించి అతని దుకాణంలోకి ఇద్దరు యువకులు ప్రవేశించారు. రూ.100 ఇచ్చి ఒక వెండి వస్తువును కొనుగోలు చేశారు. ఇంకేమి కావాలని రాధేశ్యామ్ అడగ్గా.. బంగారు ఉంగరం కావాలన్నారు. అందుకు సంబంధించి ఓ 17 బంగారు రింగులు ఉన్న బాక్స్‌ను చూపించాడు. మిగతా కస్టమర్లు పిలుస్తున్నారని శ్యామ్ అటుగా తిరిగాడు. అంతే, క్షణాల్లో ఆ యువకులు బంగారు ఉంగరాల బాక్స్‌ను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. శ్యామ్‌కు ఆ సంఘటనతో కంగుతిన్నాడు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నించినా ఆ యువకులు దొరకలేదు. సంఘటన జరిగిన గంట తర్వాత దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. శ్యామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలించినా దొరకలేదు. త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.



పోలీస్‌స్టేషన్ ఇంచార్జి మాట్లాడుతూ దీపావళి సీజన్ కావడంతో నగల దుకాణాలన్నీ కస్టమర్లతో నిండిపోతున్నాయని, ఇలాంటి సమయంలోనే షాపు యజమానులు అప్రమత్తంగా ఉండాలన్నారు. దొంగలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. రాధేశ్యామ్ నగల దుకాణంలో దొంగలు పట్టుకెళ్లిన వస్తువుల విలువ దాదాపుగా లక్షన్నర వరకు ఉంటుందన్నారు. బైక్ మీద వచ్చిన దొంగలను సీసీ కెమెరాల ద్వారా గుర్తించామని, త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు.  


  



Updated Date - 2021-11-03T19:13:15+05:30 IST