పదోన్నతులు ఇవ్వరా?

ABN , First Publish Date - 2021-06-23T06:00:28+05:30 IST

ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

పదోన్నతులు ఇవ్వరా?

  1. ఎయిడెడ్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ 
  2. రేషనలైజేషన్‌, సర్దుబాటు.. ఆ తర్వాత నియామకాలు
  3. అంతకుముందే పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల  డిమాండ్‌


కర్నూలు(ఎడ్యుకేషన్‌), జూన్‌ 22: ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల అమలు దిశగా చర్యలు చేపట్టింది. ఈ నెల 14వ తేదీన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌ జీవో.ఎంఎస్‌.నెంబర్‌.37 ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1:40 ఉండేలా మొదట ఎయిడెడ్‌ పాఠశాలల్లోని టీచర్‌ పోస్టులను రేషనలైజేషన్‌ చేస్తారు. 2020-21 విద్యాసంవత్సరం పాఠశాలల చివరి పనిదినం ఆధారంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఏప్రిల్‌ 19, ఉన్నత పాఠశాలలకు ఏప్రిల్‌ 30 పరిగణనలోకి తీసుకోవాలి. విద్యార్థుల సంఖ్య, మంజూరైన పోస్టుల ఆధారంగా మిగులు ఉపాధ్యాయులు ఎక్కడ అవసరమో గుర్తించి అక్కడ సర్దుబాటు చేస్తారు. ఆ తర్వాత పోస్టుల కొరత ఏర్పడితే.. అవసరాన్ని బట్టి నియామకాలు చేపడుతారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు, విద్యాహక్కు చట్టానికి అనుగుణంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియకు ముందే ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. లేకుంటే ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం కలుగుతుందని భావిస్తున్నారు. 


జిల్లాలో 173 ఎయిడెడ్‌ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 18,436 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే 653 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. చాలా పాఠశాలల్లో విద్యార్థులు ఉన్న చోట ఉపాధ్యాయులు లేరు. ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు లేరు. ఇప్పటికే విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను జిల్లా విద్యాశాఖ సేకరిస్తోంది. రేషనలైజేషన్‌ విధానానికి కొంతమంది పాఠశాలల కరస్పాండెంట్లు అంగీకారం తెలుపగా.. మరికొందరు సుముఖంగా లేరని తెలుస్తోంది. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించాలని, లేదంటే ప్రైవేటుగా నిర్వహించుకోవాలని గతంలో విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విధానానికి పాఠశాలల కరస్పాండెంట్లు ససేమిరా అన్నారు. 9 మంది మాత్రమే విలీనానికి ముందుకు వచ్చారు. ప్రభుత్వం కూడా అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టబోయి మ్లల వెనక్కి తగ్గింది. ప్రభుత్వంలోని ఎయిడెడ్‌ పాఠశాలలు విలీనం చేసే ఆలోచనను విరమించుకుని మళ్లీ ఈ నెల 14వ తేదీన జీవో 37 ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవోతో ఉపాధ్యాయులకు గానీ, కరస్పాండెంట్లకు గానీ నష్టం లేదని విద్యావేత్తలు భావిస్తున్నారు. 



పదోన్నతులు చేపట్టాలి..


ఎయిడెడ్‌ పాఠశాలల్లో హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్‌) చేపట్టేముందు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి. లేకుంటే ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతోంది. అలాగే హేతుబద్ధీకరణలో ఉపాధ్యాయులకు ఆర్థిక నష్టం కలగకుండా అదే ప్రాంతంలోని సమీప పాఠశాలలకు బదిలీ అయ్యేలా చూడాలి. ఏ ఒక్క పాఠశాల కూడా మూతపడకూడదు. పోస్టులు అవసరం ఉన్న చోట నియామకాలు చేపట్టాలి. ప్రతిపాఠశాలలో పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టి ఎయిడెడ్‌ పాఠశాలలను బలోపేతం చేయాలి. 

- చంద్రశేఖరశర్మ,  జిల్లా ప్రధాన కార్యదర్శి, 

ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ గిల్డ్‌



1:30 నిష్పత్తి ప్రకారం చేపట్టాలి..

ప్రభుత్వం జీవో.ఎంఎస్‌.37 ప్రకారం రేషనలైజేషన్‌ నియామకాలను చేపట్టడంపై అభ్యంతరం లేదు. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి 1:30 ప్రకారం ఉండాలి. కానీ జీవో.37 ప్రకారం 1:40గా ఉంది. ఈ విధానం వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. రేషనలైజేషన్‌ సర్దుబాటు, మిగులు పోస్టులకు నియామకాలు చేపట్టడం వల్ల ఇబ్బంది ఉండదు. 

- జిలానీ బాషా, కరస్పాండెంట్‌, కేవీఎన్‌ ఎయిడెడ్‌ హై స్కూల్‌, ఆళ్లగడ్డ

Updated Date - 2021-06-23T06:00:28+05:30 IST