ప్రకృతిని గౌరవిద్దాం!

ABN , First Publish Date - 2020-02-21T06:09:25+05:30 IST

శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో దైవికశక్తులంటే ఏమిటో స్పష్టంగా చెప్పాడు. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను వివరించాడు.

ప్రకృతిని గౌరవిద్దాం!

శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో దైవికశక్తులంటే ఏమిటో స్పష్టంగా చెప్పాడు. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను వివరించాడు. ప్రకృతి శక్తులను పోషించకుండా మనిషి కేవలం స్వార్థంతో వ్యవహరించడం ఎంత ప్రమాదమో భగవద్గీత మూడో అధ్యాయం పన్నెండో శ్లోకంలో హెచ్చరించాడు. 


ఇష్టాన్‌ భోగాన్‌ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః

తైర్దత్తానప్రదాయైుభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః


‘‘ఎవరివల్లనైనా మన జీవితం నిలబడింది అనుకోండి. వారిని ఇంటికి సాదరంగా ఆహ్వానించి, ‘‘మేం ఆపదలో ఉంటే మీరు ఆదుకున్నారు. మాకు ఉద్యోగం ఇప్పించారు. కూతురు పెళ్లి కోసం రుణం ఇచ్చి ఆదుకున్నారు’’ అని ఆ పెద్దాయనను పెళ్లికి పెద్దగా పిలుస్తాం. సమయానికి డబ్బు ఇచ్చిన వారి పట్ల, ప్రమాదం నుంచి కాపాడిన వారి పట్ల, ఉద్యోగం ఇప్పించిన వారి పట్ల కృతజ్ఞత చూపిస్తూ ఒక మాట అంటాం. ‘‘సమయానికి దేవుడిలా వచ్చి ఆదుకున్నారు’’ అని! మరి అలాంటి మనం కనిపిస్తున్న ప్రకృతి విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నాం? వీస్తున్న గాలి, ప్రవహిస్తున్న నీరు, సూర్యచంద్రుల కాంతిని అందిస్తున్న ఆకాశం, కురుస్తున్న మేఘం, పుష్పించి, ఫలిస్తున్న భూమి... ఇవన్నీ దేవతలే. పంటకు మూలమైన భూమినీ, పాడికి మూలమైన గోవును మనం దేవతలుగానే భావించాం. దేవతలు మీకిష్టమైన పంటలను, పాడిని ఇస్తున్నారు.


యజ్ఞాలు చేయడం వల్ల అన్నీ సమృద్ధిగా ఉండేట్లుగా ఇస్తున్నారు. యజ్ఞాలు చేస్తే వర్షాలు ఎందుకు కురుస్తాయి? అంటే మర్రి, మారేడు, జువ్వి వంటి ఔషధ వృక్షాల సమిధలు యజ్ఞంలో ఉపయోగిస్తారు. ఆ సమిధలు కాలడం వల్ల వచ్చే పొగ మేఘాలు ఏర్పడేలా చేస్తుంది. యజ్ఞాల వల్ల, యాగాదుల వల్ల దేవతలు సంతోషించి మీకు వర్షాలు కురిపిస్తున్నారు. తద్వారా పంటలు బాగా పండుతున్నాయి. పాడి బాగా పెరుగుతోంది. వీటివల్ల సంతోషించిన వారు ఆ ప్రకృతికి ఎంతో కొంత తిరిగి ఇవ్వకుండా తింటే వాళ్లు దొంగలే కదా! మనకు ఏదైనా ఉపకారం చేస్తే ఇంటికి తీసుకొచ్చి గౌరవం చేసినట్టే, పాడి పంటలు వృద్ధి చెందేలా చేస్తున్న నీటిని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, భూమిని, ఆకాశాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి! ఈవేళ కాలుష్యం ఎంత పెరిగిపోతోందో మనం చూస్తూనే ఉన్నాం. చెట్లు నరికేయకండి. నీళ్లు వృథాగా పోనీయకండి. అదీ ప్రకృతికి నైవేద్యం పెట్టడమంటే? దీన్ని మనం అందరం పాటిద్దాం. 

డా. గరికిపాటి నరసింహారావు

Updated Date - 2020-02-21T06:09:25+05:30 IST