గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ ఐపీఓ ధర రూ.695-720

ABN , First Publish Date - 2021-07-22T06:19:28+05:30 IST

ఈ నెల 27న ప్రారంభమయ్యే గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఐపీఓ ధర ఖరారైంది. ఒక్కో షేరును రూ.695-720 ధరల శ్రేణిలో జారీ చేస్తారు.

గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ ఐపీఓ ధర రూ.695-720

న్యూఢిల్లీ: ఈ నెల 27న ప్రారంభమయ్యే గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఐపీఓ ధర ఖరారైంది. ఒక్కో షేరును రూ.695-720 ధరల శ్రేణిలో జారీ చేస్తారు. ఈ నెల 29న ముగిసే ఈ ఐపీఓ ద్వారా కంపెనీ మొత్తం రూ.1,513.6 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ.1,060 కోట్లు కొత్త ఈక్విటీ షేర్ల జారీ ద్వారా సమీకరిస్తారు. మిగతా మొత్తాన్ని ప్రధాన ప్రమోటర్‌ గ్లెన్‌మార్క్‌ ఫార్మా తన వాటా నుంచి 63 లక్షల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయిస్తుంది. మొత్తం ఇష్యూలో 50 శాతం క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ బయ్యర్స్‌కు, 35 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించారు. 


త్వరలో పాలసీ బజార్‌...

మరో స్టార్టప్‌ కంపెనీ పాలసీబజార్‌ ఐపీఓకు సిద్ధమవుతోంది. ఈ నెల 5న జరిగిన ఈజీఎంలో కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఇందుకు ఆమోద ముద్ర వేసింది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ దాదాపు రూ.6,500 కోట్ల వరకు సమీకరించనున్నట్టు సమాచారం. ఐపీఓ కోసం పాలసీబజార్‌ మాతృ సంస్థ ‘పిబీ ఫిన్‌టెక్‌’ త్వరలోనే సెబీకి దరఖాస్తు చేయనుంది. ఈ ఏడాది డిసెంబరులోగానే కంపెనీ ఈ ఐపీఓ పూర్తి చేయాలని భావిస్తోంది. జపాన్‌ సాఫ్ట్‌బ్యాంక్‌ ‘విజన్‌ ఫండ్‌’తో పాటు పీఈ సంస్థ ట్రూనార్త్‌, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌, టైగర్‌ గ్లోబల్‌ టీమ్‌సెక్‌  ఇప్పటికే పాలసీబజార్‌లో వాటాదారులు. 


జింజర్‌ హోటల్స్‌...

టాటా గ్రూపులోని జింజర్‌ హోటల్స్‌ కూడా ఐపీఓకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడే  కాకపోయినా మూడు నాలుగేళ్లలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఈ హోటల్స్‌ను నిర్వహించే రూట్స్‌ కార్పొరేషన్‌  లిమిటెడ్‌ (ఆర్‌సీఎల్‌) ఎగ్జిక్యూటివ్‌ వైస్‌  ప్రెసిడెంట్‌, సీఎ్‌ఫఓ గిరిధర్‌ సంజీవి ఇటీవల జరిగిన ఇన్వెస్టర్స్‌ డే ఫంక్షన్‌లో చెప్పారు. ఆర్‌సీఎల్‌ ఈక్విటీలో టాటా గ్రూపునకు చెందిన ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ(ఐహెచ్‌సీఎల్‌)కు 67 శాతం వాటా ఉంది. 


పతంజలి ఇష్యూపై త్వరలో నిర్ణయం

బాబా రాందేవ్‌ నిర్వహణలోని పతంజలి ఆయుర్వేద్‌ కూడా ఐపీఓకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. డిసెంబరులోగా దీనిపై నిర్ణయం తీసుకుంటామని రాందేవ్‌ చెప్పారు. రూ.4,300 కోట్లు సేకరించేందుకు తమ నిర్వహణలోని ‘రుచి సోయా’ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఇష్యూకి మదుపరుల నుంచి మంచి ఆసక్తి వ్యక్తమవుతోందన్నారు. రుచి సోయాను మెగా ఎఫ్‌ఎంసీజీ కంపెనీగా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమన్నారు. ప్రస్తుత ఇన్వెస్టర్లతో పాటు, రాబోయే ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రుచి సోయా  ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఇష్యూ ధరను నిర్ణయించినట్టు రాందేవ్‌ తెలిపారు.

Updated Date - 2021-07-22T06:19:28+05:30 IST