జీఎల్‌ఎన్‌ మూర్తి ఇకలేరు

ABN , First Publish Date - 2020-08-09T08:08:05+05:30 IST

పౌరహక్కుల సంఘం సభ్యుడు, సీనియర్‌ పాత్రికేయుడు గురజాడ లక్ష్మీనరసింహ మూర్తి(67) ఇకలేరు. కొవిడ్‌ సోకడంతో ఆయన బుధవారం సికింద్రాబాద్‌ మిలటరీ ఆస్పత్రిలో చేరారు...

జీఎల్‌ఎన్‌ మూర్తి ఇకలేరు

  • గుండెపోటుతో మృతిచెందిన పౌరహక్కుల సంఘం సభ్యుడు
  • కల్చరల్‌ రిపోర్టర్‌గా 30 ఏళ్ల ప్రస్థానం
  • హెచ్‌సీయూ యూనియన్‌లో కీలకపాత్ర
  • నేడు ఎర్రగడ్డ శ్మశానవాటికలో అంత్యక్రియలు  

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): పౌరహక్కుల సంఘం సభ్యుడు, సీనియర్‌ పాత్రికేయుడు గురజాడ లక్ష్మీనరసింహ మూర్తి(67) ఇకలేరు. కొవిడ్‌ సోకడంతో ఆయన బుధవారం సికింద్రాబాద్‌ మిలటరీ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. సతీమణి శారద ఎంపీడీవోగా పదవీవిరమణ పొందారు. ఆమె సోదరి శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు. కొద్దిగంటల్లోనే భర్త కూడా మృతిచెందడంతో శంషాబాద్‌లోని రావిరాలలోని ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.


మూర్తికి కూతురు నవ్య, కుమారుడు క్రాంతి కిశోర్‌ ఉన్నారు. నవ్య అమెరికాలో స్థిరపడ్డారు. క్రాంతి నేవీలో కమాండర్‌గా ఉన్నారు. మూర్తి స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లాలోని కైకలూరు. హెచ్‌సీయూలో సీనియర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌గా 2012లో ఉద్యోగ విరమణ పొందారు. మూడు దశాబ్దాల పాటు సెంట్రల్‌ యూనివర్సిటీ నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి, అధ్యక్ష హోదాలలో కొనసాగారు. ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. నక్సలైట్లు, ప్రభుత్వం మధ్య శాంతి చర్చల కోసం ఏర్పడిన ‘పీఎస్‌ ఇనిషేయేటివ్‌ కమిటీ’ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ‘సౌత్‌ ఏషియన్‌ పీపుల్‌ యాక్షన్‌ ఆన్‌ క్లైమెట్‌ క్రైసిస్‌’’ అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ సంస్థకు తెలంగాణ సలహాదారుగానూ వ్యవహరించారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రభూమి తదితర పత్రికల్లో కల్చరల్‌ రిపోర్టరుగా పనిచేశారు. తెలుగు నాటకరంగంలో యువతను ప్రోత్సహించారు.. మూర్తి అంత్యక్రియలు ఆదివారం ఉదయం పదిగంటలకు ఎర్రగడ్డ శ్మశానవాటికలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ‘‘జీఎల్‌ఎన్‌ మూర్తి మరణం తెలుగు సాంస్కృతిక, కళా రంగాలకు తీరని లోటు’’ అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి విచారం వ్యక్తం చేశారు. పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, కవులు యాకూబ్‌, ఒమ్మి రమేశ్‌, శిఖామణి, అనంతు, రచయితలు సంగిశెట్టి శ్రీనివాస్‌, బమ్మిడి జగదీశ్వరరావు మూర్తి మృతిపట్ల సంతాపం తెలిపారు.


Updated Date - 2020-08-09T08:08:05+05:30 IST