ఒక్క అంగుళాన్ని కూడా చైనా వదులుకోదు.. చైనా మీడియా వ్యాఖ్యలివీ..

ABN , First Publish Date - 2020-06-17T20:01:44+05:30 IST

భారత్, చైనా మధ్య మరోసారి ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి.. లద్దాఖ్‌లోని గాల్వన్‌లోయలో చైనా సైనికులు.. మన జవాన్లపై రాళ్లు విసిరి, రాడ్లతో దాడికి దిగారు. వారికి మన సైనికులు దీటుగా బదులిచ్చారు.

ఒక్క అంగుళాన్ని కూడా చైనా వదులుకోదు.. చైనా మీడియా వ్యాఖ్యలివీ..

న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య మరోసారి ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి.. లద్దాఖ్‌లోని గాల్వన్‌లోయలో చైనా సైనికులు.. మన జవాన్లపై రాళ్లు విసిరి, రాడ్లతో దాడికి దిగారు. వారికి మన సైనికులు దీటుగా బదులిచ్చారు. ఈ హింసాత్మక ఘర్షణలో 20 మంది మన జవాన్లు వీరమరణం పొందారు. చైనా సైనికుల్లో మరణించినవారుగానీ, గాయపడినవారుగానీ 43 మంది దాకా ఉన్నట్టు తెలుస్తోంది.. సోమ, మంగళవారాల్లో వాస్తవంగా ఏం జరిగిందో మన ఆర్మీ అధికారులు ఎప్పటికప్పుడు వివరాలు చెబుతూనే ఉన్నారు.. మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా భారత ప్రజలంతా వాస్తవాలు తెలుసుకున్నారు. అయితే చైనా ఆర్మీ మాత్రం తమ సైనికుల్లో ఎంత మంది చనిపోయారన్నది..? ఎంత మంది గాయాలపాలయ్యారన్నది మాత్రం చెప్పలేదు. చైనా మీడియా కూడా తప్పంతా భారత్ దే అంటూ ప్రత్యేక కథనాలను రాస్తోంది.. చైనా అధికారిక పత్రిక పీపుల్స్‌ డైలీకి చెందిన గ్లోబల్‌ టైమ్స్.... గాల్వన్ లోయలో జరిగిన ఘటన గురించి ప్రత్యేకంగా ఓ సంపాదకీయం రాసింది.. వాస్తవాలను పాతరేసి.. తప్పులను కప్పిపుచ్చుకుంటూ చైనా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించింది.. గ్లోబల్ టైమ్స్ పత్రిక సంపాదకీయం యథాతథంగా.. 


’గాల్వన్ వ్యాలీలో సోమవారం చైనా, భారత దళాలు తీవ్రమైన భౌతిక దాడులకు పాల్పడ్డాయి. ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారని భారత సైన్యం అధికారికంగా ప్రకటించుకుంది(20 మంది జవాన్లు చనిపోయారని మన సైన్యం అధికారికంగానే చెప్పింది..) . ఇరుపక్షాల మధ్య ఘర్షణలు ప్రాణనష్టానికి దారితీశాయని చైనా సైన్యం ప్రకటన విడుదల చేసింది కానీ.. ఎంత మంది మరణించారు..? ఎంత మంది గాయపడ్డారన్నది మాత్రం చెప్పలేదు. గతంతో పోల్చితే ఇప్పటివరకు చైనా, భారత సైనికుల మధ్య అత్యంత తీవ్రమైన ఘర్షణ ఇది. 1975 తరువాత ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాల్లో సైనికులు మరణించడం ఇదే మొదటిసారి అని భారత మీడియా వార్తలు ప్రసారం చేస్తోంది.. సరిహద్దు వద్ద భారత్ విస్తృతమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటోంది. నియంత్రణ రేఖను దాటి చైనా భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి మరీ నిర్మాణాలను చేపడుతోంది. దీన్ని అడ్డుకునేందుకు చైనా సైనికులు పలుమార్లు యత్నించారు. ఇందులో భాగంగానే ఇరు వర్గాల మధ్య భౌతిక దాడులు జరిగాయి. భారత ఆర్మీ అహంకారం, నిర్లక్ష్యమే.. భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తకర పరిస్థితులకు ప్రధాన కారణం. ఈ మధ్య కాలంలో చైనా-భాతర్ సరిహద్దు వివాదాలపై న్యూఢిల్లీ కాస్త కఠిన వైఖరిని అవలంబిస్తోంది. భారత్ యొక్క రెండు అపోహలే దీనికి ప్రధాన కారణాలు.. అమెరికా నుంచి పెరుగుతున్న వ్యూహాత్మక ఒత్తిడి కారణంగా.. భారత్ ఎన్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపట్టినా చైనా చూస్తూ ఊరుకుంటుందనుకున్నారు. దీనితోపాటు చైనా సైన్యం కంటే భారత సైన్యమే అత్యంత శక్తివంతమైనదని కొంత మంది భారతీయుల నమ్మకం.. ఈ రెండు అపోహల వల్లే సరిహద్దు వివాదాలు మరింత జఠిలమవుతున్నాయి. చైనా పట్ల భారత్ వ్యవహరించాల్సిన విధానాన్ని ఈ అపోహలు ప్రభావితం చేస్తున్నాయి.. 


అమెరికా తన ఇండో-పసిఫిక్ స్ట్రాటజీతో భారతదేశాన్ని బుట్టలో పడేసింది.. నమ్మకాన్ని పెంచుకుంది. అందుకే చాలా మంది భారతీయ అత్యున్నత స్థాయి అధికారులు.. పైన పేర్కొన్న అపోహల్లోనే ఉండిపోతున్నారు. 2017 లో చైనా సార్వభౌమత్వాన్ని బహిరంగంగా సవాలు చేయడానికి భారత దళాలు సరిహద్దు దాటి డోక్లాం ప్రాంతంలోకి ప్రవేశించాయి. వారి అహంకారం వల్లే దుస్సాహసానికి పాల్పడ్డారు. ఈ దుందుడుకు చర్యల ద్వారా భారత ప్రజల నుంచి ప్రశంసలను పొందారంటే.. చైనా పట్ల భారతీయ ఉన్నత వర్గాల మనస్తత్వం మరింత ప్రమాదకరమయినదని అర్థం చేసుకోవచ్చు. చైనా, భారత్ రెండూ పెద్ద దేశాలు. సరిహద్దు ప్రాంతాలలో శాంతి, స్థిరత్వం రెండు దేశాలకు మాత్రమే సంబంధించినవి. భారత్ లో అమెరికా పెట్టే పెట్టుబడుల విషయంలో న్యూఢిల్లీ ఒక స్పష్టమైన అవగాహనకు రావాల్సి ఉంటుంది.. అమెరికా పెట్టుబడులు కేవలం.. భారత్ పై ఒత్తిడిని మాత్రమే పెంచుతాయి.. అది భారత్-చైనా మధ్య సంబంధాలు మరింత దిగజారేలా చేస్తుంది. వాషింగ్టన్ ప్రయోజనాల కోసం భారత్ తనను తాను అమెరికాకు అంకితం చేసుకోకూడదు కదా.. చైనా, భారత్ బలాబలాల మధ్య అంతరం ఎంత ఉందో.. స్పష్టంగా తెలుస్తోంది. భారత్‌తో సరిహద్దు సమస్యలను ఘర్షణగా మార్చడానికి చైనా ఇష్టపడదు. ఇది చైనా యొక్క మంచితనం.. భారత్ పట్ల చైనా సంయమనానికి అదే నిదర్శనం. అదే సమయంలో సరిహద్దు వద్ద ఉన్న పరిస్థితిపై చైనా కాన్ఫిడెంట్ గా ఉంది. తమ బలంతో సరిహద్దు వద్ద గొడవలను చైనా ఎప్పటికీ సృష్టించబోదు కానీ.. భారత్ కవ్వింపులకు ఎప్పిటికీ భయపడదు. ఇదే చైనా విధానం. 


ఈసారి గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణ రెండు వైపులా ప్రాణనష్టానికి దారితీసింది. చైనా- భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అదుపులో ఉండబోవని ఈ ఘటన ద్వారా తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత రెండు సైన్యాల నాయకత్వం సంయమనం పాటించినట్లు మేం గమనించాం. ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని రెండు నాయకత్వాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చైనా సైనికుల మరణాల సంఖ్యను సైన్యం వెల్లడించకపోవడం గమనార్హం. సైనికుల మరణాల సంఖ్య మధ్య అనవసర పోలికలు వచ్చి.. రెండు ప్రాంతాల్లోనూ మనోభావాలు పెరగకుండా చైనా సైన్యం నిరోధించగలిగింది. గాల్వన్ వ్యాలీలో ఉత్రిక్తతలు తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడాలని మేం ఆశిస్తున్నాం. సరిహద్దుల్లో రెండు మిలటరీల నాయకత్వం మధ్య ఏకాభిప్రాయం వస్తుందని భావిస్తున్నాం. సరిహద్దుల్లో పరిస్థితి చల్లబడితే అది ఇరుపక్షాలకు ప్రయోజనం. దీనికి చైనా, భారత ఫ్రంట్‌లైన్ దళాల కృషి చాలా అవసరం. చైనా-ఇండియా సరిహద్దు సమస్యపై చైనా ప్రజలు ప్రభుత్వాన్ని, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని పూర్తిగా విశ్వసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరిహద్దు వివాదాల విషయంలో.. చైనా యొక్క ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు సైన్యం ఎప్పుడూ ముందుంటుంది. దేశ  ప్రయోజనాల విషయంలో రాజీ పడదు.. చైనా తన భూమిలో ఒక్క అంగుళాన్ని కూడా వదులుకోదు.. ప్రతి అంగుళాన్ని కాపాడుకునే సామర్ధ్యం, వివేకం చైనాకు ఉన్నాయి.. సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు వ్యూహాత్మక మాయోపాయాలు చైనాకు ఏమాత్రం అవసరం లేదు..‘


ఇదీ.. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ రాసిన సంపాదకీయం.. సైనికుల మరణాల సంఖ్యను వెల్లడించకపోవడానికి కూడా సకారణాలు ఉన్నాయంటూ చెప్పుకొస్తోంది.. చైనా సైన్యం, ప్రభుత్వం ఏం చెప్పినా చైనా ప్రజలు విశ్వసించాలని చెబుతోంది. భారత్ సైన్యం నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ ఘటన జరిగిందని అవాస్తవాలను ప్రచారం చేస్తోంది.. 

Updated Date - 2020-06-17T20:01:44+05:30 IST