విశ్వవ్యాప్తంగా క‌రోనా తీవ్ర‌రూపం.. 2 కోట్ల దిశ‌గా కేసులు

ABN , First Publish Date - 2020-08-11T13:39:19+05:30 IST

విశ్వవ్యాప్తంగా అన్ని దేశాలనూ తాకిన కరోనా వైరస్‌ భీకరంగా విజృంభిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కరోనా పాజిటివ్‌ల సంఖ్య ఈ వారంలోనే 2 కోట్ల మార్కుని చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది.

విశ్వవ్యాప్తంగా క‌రోనా తీవ్ర‌రూపం.. 2 కోట్ల దిశ‌గా కేసులు

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా

వాషింగ్టన్‌, ఆగస్టు 10: విశ్వవ్యాప్తంగా అన్ని దేశాలనూ తాకిన కరోనా వైరస్‌ భీకరంగా విజృంభిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కరోనా పాజిటివ్‌ల సంఖ్య ఈ వారంలోనే 2 కోట్ల మార్కుని చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,97,78,566 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మహమ్మారి కారణంగా 7,29,692 మంది ప్రాణాలు కోల్పోయారు.


ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 50 లక్షలు ఒక్క అమెరికాలోనే ఉండడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది. వైరస్‌ తీవ్రత నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రాంతాల్లో ఆరుబయట క్లాసులు నిర్వహించాలని అమెరికా భావిస్తోంది. బ్రెజిల్‌లో కొత్తగా 22,213 మందికి వైరస్‌ సోకగా.. మొత్తం కేసుల సంఖ్య 30,35,422కి చేరుకుంది. ఆ దేశంలో ఇప్పటివరకు 1,01,049 మంది కరోనాతో చనిపోయారు. బ్రిటన్‌లో కొత్తగా వెయ్యికిపైగా కేసులు బయటపడ్డాయి. జూన్‌ 26 తర్వాత ఒక్కరోజులో ఇన్నికేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఇటలీలో మళ్లీ కరోనా అలజడి మొదలైంది. 24 గంటల్లో ఇక్కడ 463 కేసులు వెలుగుచూశాయి. ఇటలీలో వైరస్‌ తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. 

Updated Date - 2020-08-11T13:39:19+05:30 IST