ఘనంగా దసరా వేడుకలు

ABN , First Publish Date - 2021-10-17T05:24:59+05:30 IST

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం విజయదశమిని ప్రజలు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా దసరా వేడుకలు
గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో శమీ పూజలు చేస్తున్న ఆలయ అర్చకులు.

- ఆలయాల్లో ప్రత్యేక పూజలు

- శమీ దర్శనానికి తరలివచ్చిన జనం

- జిల్లా వ్యాప్తంగా పండుగ సందడి

ఏసీసీ, అక్టోబరు 16: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం విజయదశమిని ప్రజలు ఘనంగా  నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో  సాయంత్రం విశ్వనాధ ఆలయం నుంచి వెంకటేశ్వర స్వామి, విశ్వనాధ స్వామి శోభాయాత్రను గోదావరి తీరంలోని గౌతమేశ్వర స్వామి దేవస్ధానం వరకు నిర్వహించారు. అనంతరం శమీ పూజ నిర్వహించి భక్తులకు వేద పండితులు ఆశీస్సులు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దివాకర్‌రావు , ఏసీపీ అఖిల్‌మహాజన్‌,  మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, విశ్వనాధ ఆలయ కమిటీ చైర్మన్‌ సిరిపురం శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ మాదంశెట్టి సత్యనారాయణ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.  అలాగే గోదావరి ఒడ్డున గల గౌతమేశ్వర ఆలయంలో జమ్మిచెట్టు వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌సీ , ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు  ప్రజలతో కలిసి దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు.

బెల్లంపల్లి: పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయమే నూతన వస్ర్తాలను ధరించి ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు. పలు ఆలయాల్లో శమీ పూజలు నిర్వహిం చారు. పట్టణంలోని తిలక్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన రావణదహన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు గడ్డం వివేక్‌ హాజరయ్యారు. ఏసీపీ ఎడ్ల మహేష్‌ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్‌ఐలు బందోబస్తు నిర్వహించారు. 

తాండూర్‌: విజయ దశమి వేడుకలను తాండూర్‌ మండలంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కిష్టంపేట హనుమాన్‌ మందిర్‌, తాండూర్‌, అచ్చలాపూర్‌ గ్రామాల్లో రావణ దహనం కార్యక్రమాలు నిర్వహించి జమ్మి వృక్షాలకు పూజలు నిర్వహించారు. మాదారంలో దసరా రోజునే దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. ఇక్కడ బెల్లంపల్లి ఏరియా జీఎం సంజీవరెడ్డి శమి పూజ నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అచ్చలాపూర్‌, రేచిని, తాండూర్‌ గ్రామాల్లో దుర్గాదేవి నిమజ్జన కార్యక్రమాలను శనివారం వైభవంగా నిర్వహించారు. 

నస్పూర్‌:  నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం ప్రజలు దసరా పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జమ్మికి ప్రత్యేక పూజలు చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దుర్గాదేవితో ఇతర ఆలయాలను దర్శించారు. వాహనాల చోదకులు ఆలయాల వద్ద వాహనాలకు పూజలు చేయించగా, శ్రీరాంపూర్‌, సీసీసీ నస్పూర్‌ పోలీస్‌ స్టేషన్లలో పూజలను నిర్వహించారు.

లక్షెట్టిపేట: పట్టణంలో  మున్సిపాలిటీ ఆధ్వర్యంలో  దసరా వేడుకలు నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ నల్మాసు కాంతయ్య, వైస్‌ చైర్మన్‌ పొడేటి శ్రీనివాస్‌గౌడ్‌, తహసీల్దార్‌ వేముల రాజ్‌కుమార్‌, మున్సిపల్‌ కమినర్‌ ఆకుల వెంకటేష్‌ల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం నుంచి జమ్మి గద్దె వరకు కాలినడకన ఊరేగింపుగా వెళ్లి జమ్మి చెట్టు వద్ద శమీ పూజలు నిర్వహించారు.  అంతకుముందు మున్సిపాలిటీ కార్యాలయంలో జమ్మికి సంబంధించిన జమ్మి కత్తికి  ప్రత్యేక పూజలు నిర్వహించారు.  సీఐ కరీముల్లాఖాన్‌,  ఎస్‌ఐ చంద్రశేఖర్‌ బందోబస్తు పర్యవేక్షించారు. 

 దండేపల్లి: విజయదశమి(దసరా)పురస్కరించుకుని దండేపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి, మ్యాదరిపేటలో శ్రీలక్ష్మినారాయణ ఆలయాల్లో శుక్రవారం ఆలయ అర్చకుల వేదమంత్రోచ్చరణ నడుమ శమీ పూజలను వైభవంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వడ్లూరి అనూష, ఆల య ముఖ్య అర్చకులు గోవర్ధన రఘస్వామి ఆధ్వర్యంలో వేద పండితులు దుద్దిళ్ళ నారాయణశర్మ వేద మంత్రోచ్చరణతో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిచారు. కార్యక్రమంలో ఆలయ అధికా రులు, అర్చకులు, సిబ్బంది, ఉన్నారు. మ్యాదరిపేటలో శ్రీలక్ష్మినా రాయణ ఆలయ వ్యస్ధాపకులు శ్రీమతి ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి శమీ పూజ నిర్వహించారు. ఆయా ఆలయాల్లో భక్తులు స్వామి వారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు చేశారు.  మండలంలోని అన్ని గ్రామాల్లో దసరా వేడుకలను ఘనంగా నిర్వహంచారు. ఎస్సై శ్రీకాంత్‌ ఆఽధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పర్యావేక్షించారు.   

వేమనపల్లి: మండల వ్యాప్తంగా విజయదశమి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఒకరికి ఒకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

జైపూర్‌: మండలంలో ప్రజలు ఘనంగా దసరా పండుగను జరుపుకున్నారు. ఉదయమే పలు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. శమీ వృక్షానికి పూజలు నిర్వహించారు. జైపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో జైపూర్‌ ఏసీపీ నరేందర్‌ ఆయుధ, వాహన పూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రామకృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

కోటపల్లి: మండలంలో దసరా వేడుకలను ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహిం చారు. సాయంత్రం వేళ ఆయా గ్రామాల్లో శోభాయాత్రగా వెళ్లి శమీ వృక్షాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మరో వైపు ఆలయాలు భక్తుల తో కిటకిటలాడాయి. కోటపల్లి మండల కేంద్రంలో ఎంఎల్‌సీ పురాణం సతీష్‌కుమార్‌ గ్రామస్థులతో కలిసి ఊరేగింపుగా వెళ్లి శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు చేశారు. పోలీస్‌ స్టేషన్‌లో చెన్నూరు రూరల్‌ సీఐ నాగరాజు, ఎస్‌ఐ రవికుమార్‌లతో పాటు పోలీసు సిబ్బంది ఆయుధ పూజ నిర్వహించారు.

జన్నారం:  మండలంలోని ఆయా గ్రామాల్లో శమీ వృక్షానికి పూజలు నిర్వహించి ఒకరికి ఒకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మండలంలోని పొనకల్‌ రైతు వేదికలో అలాయ్‌ బలాయ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్‌, కో ఆప్షన్‌ మున్వర్‌ ఆలీ, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ రజాక్‌, ఎంపీటీసీ రియాజుద్దీన్‌తో పాటు మైనార్టీ నాయకులు పాల్గొని పండగ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్‌ నాయకులు పసివుల్లాతో పాటు  మైనార్టీ సభ్యులు పాల్గొన్నారు. 

మందమర్రిటౌన్‌: పట్టణంలోని మార్కెట్‌ సెంటర్‌లోని ఆంజనేయ స్వామి, రామాలయం, వెంకటేశ్వరాలయం తదితర ఆలయాల్లో శమీ పూజలు నిర్వహించారు.  రెండవ జోన్‌లోని చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీఓదెలు దంపతులకు నాయకులు, అధికారులు, స్నేహితులు జమ్మి పెట్టి శుభాకాంక్షలు తెలిపారు.

భీమారం: మండలంలో శుక్రవారం  దసరా సంబరాలు ప్రజలు ఘనంగా జరుకున్నారు. మండల కేంద్రంలో రామాలయం సమీపంలో ఏర్పాటు చేసిన శమీ వృక్షానికి పలువురు నాయకులు పూజలు చేశారు. మండల కేంద్రంలోని ఆవడం క్రాస్‌ రోడ్డు వద్ద యువత ఆధ్వర్యంలో రావణుడి బొమ్మను కాలనీ వాసులు దహనం చేశారు. సర్పంచులతో పాటు నాయకులు పాల్గొన్నారు. 

మందమర్రిరూరల్‌: మండలంలో శుక్రవారం దసరా పండగ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. పలు ఆలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.  దసరా సందర్భంగా మండలవ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. 

కాసిపేట: మండలంలో దసరా వేడుకలను మండల ప్రజలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా  జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు.  దేవాపూర్‌, కాసిపేట పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

కన్నెపల్లి:  మండలంలో దసరా పండగ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ప్రజలు శమి వృక్షానికి పూజలు చేసి ఒకరికి ఒకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ ప్రశాంత్‌రెడ్డి ఆయుధ పూజ నిర్వహించారు. శనివారం జన్కాపూర్‌ గ్రామంలో దుర్గాదేవి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. 

Updated Date - 2021-10-17T05:24:59+05:30 IST