వైభవంగా సద్దుల బతుకమ్మ

ABN , First Publish Date - 2022-10-04T06:37:09+05:30 IST

సద్దుల బతుకమ్మ వేడుకలు సోమవారం వైభవంగా జరిగాయి.

వైభవంగా సద్దుల బతుకమ్మ
కరీంనగర్‌ లో బతుకమ్మ ఆడుతున్న మహిళలు


కరీంనగర్‌ కల్చరల్‌, అక్టోబరు 3: సద్దుల బతుకమ్మ వేడుకలు సోమవారం వైభవంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని పద్మనగర్‌, రాంనగర్‌, మంకమ్మతోట, విద్యానగర్‌, జగిత్యాలరోడ్‌, చైతన్యపురి, జ్యోతీనగర్‌, సుభాష్‌నగర్‌, ఆదర్శనగర్‌, దుర్గమ్మగడ్డ, సంతోష్‌నగర్‌, గాయత్రీనగర్‌, రాంపూర్‌, ప్రగతినగర్‌, కమాన్‌ చౌరస్తా, లక్ష్మీనగర్‌ మహిళల బతుకమ్మ ఆటాపాటలతో చప్పట్ల మోతలతో మార్మోగాయి.

 

 మంత్రి నివాసంలో...


మంత్రి గంగుల కమలాకర్‌ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులు బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 


 మహాశక్తి ఆలయంలో...


చైతన్యపురి మహాశక్తి ఆలయంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ, దాండియా ఆటలతో హోరెత్తించారు. కార్యక్రమంలో ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలు అమ్మవారి దయతో సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. 


భగత్‌నగర్‌లోని మేయర్‌ క్యాంపు కార్యాలయం వద్ద మేయర్‌ సతీమణి అపర్ణ సునీల్‌రావు స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. 


కమాన్‌ వద్ద ఐసోటీం ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 20 ఫీట్ల భారీ బతుకమ్మ అందరిని ఆకట్టుకుంది. 


 రాంనగర్‌ రమాసత్యనారాయణ స్వామి ఆలయం ఎదుట డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌ నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు. మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు హాజరై  శుభాకాంక్షలు తెలిపారు.


 ప్రకాశంగంజ్‌ వినాయక దేవాలయం వద్ద వ్యాపారుల కుటుంబాలకు చెందిన మహిళలు బతుకమ్మ ఆడారు. టవర్‌సర్కిల్‌ వద్ద బతుకమ్మ ఆటా పాట అలరించాయి. వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు పాల్గొన్నారు.


 మార్క్‌ఫెడ్‌ గ్రౌండ్‌లో కార్పొరేటర్‌ బోనాల శ్రీకాంత్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మంత్రిగంగుల కమలాకర్‌, మేయర్‌ సు

నీల్‌రావు పాల్గొని బతుకమ్మ, దసరా పండుగల శుభాకాంక్షలు తెలిపారు. 


 వివిధ ప్రాంతాల్లో తనివితీరా బతుకమ్మ ఆడిన తరువాత మహిళలు బతుకమ్మలను ఎత్తుకుని పాటలు పాడుతూ నిమజ్జనం చేశారు. మాండవ్య నదీతీరం, ఎల్‌ఎండీ, ఎస్‌ఆర్‌ఎస్‌పీ కెనాల్‌, పద్మనగర్‌, చింతకుంట, కొత్తపల్లి, మానకొండూరు, వేదభవన్‌ తదితర ప్రదేశాలు మహిళలతో కిటకిటలాడాయి. లేక్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద, గౌతమీనగర్‌ ప్రాంతంలో మంత్రి గంగుల, మేయర్‌ సునీల్‌రావు నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-04T06:37:09+05:30 IST