గ్లైఫోసెట్‌ అమ్మారు!

ABN , First Publish Date - 2020-06-06T09:34:41+05:30 IST

‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే నిజమైంది. జిల్లాలో నిషేధిత కలుపు నివారణ మందు గ్లైఫోసెట్‌ను

గ్లైఫోసెట్‌ అమ్మారు!

విజిలెన్స్‌ తనిఖీల్లో వెలుగులోకి..


నెల్లూరు, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి) : ‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే నిజమైంది. జిల్లాలో నిషేధిత కలుపు నివారణ మందు గ్లైఫోసెట్‌ను అమ్మినట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అదికారులు గుర్తించారు. రెండు రోజులుగా జిల్లాలోని పలు పురుగు మందుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు ఏ ఏ ప్రాంతాల్లో ఎంతెంత విక్రయించారన్నది తేల్చారు. విజిలెన్స్‌తో పాటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా తనిఖీల్లో పాల్గొన్నారు. నెల్లూరు, సంగం, దగదర్తి, కావలి, హసనాపురంలోని పలు పురుగు మందుల దుకాణాలను పరిశీలించగా కొన్ని చోట్ల నిషేధిత క్లింటన్‌ గ్లైఫోసెట్‌ మందు దొరకగా మరికొన్ని చోట్ల విక్రయించిన ఇన్‌వాయిస్‌లు లభించాయి. హసనాపురంలోని శ్రీవిజయలక్ష్మి ట్రేడర్స్‌లో 200 లీటర్లు, సంగంలోని శ్రీనివాస ట్రేడర్స్‌లో 20 లీటర్ల మందును సీజ్‌ చేసినట్లు విజిలెన్స్‌ అధికారులు వెల్లడించారు.


నెల్లూరులోని సాయి వసుధ రైతు డిపోలో 250 లీటర్ల ఇన్‌వాయిస్‌ను, కావలిలోని శ్రీవీరరాఘవ ఫెర్టిలైజర్స్‌ నందు 500 లీటర్ల ఇన్‌వాయిస్‌ను, దగదర్తిలోని శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామి ఫెర్టిలైజర్స్‌లో 200 లీటర్ల గ్లెఫోసెట్‌ అమ్మకాలకు సంబంధించిన ఇన్‌వాయిస్‌ను గుర్తించారు. ఈ దుకాణాల యజమానులపై చట్ట ప్రకారం క్రిమినల్‌ కేసులు నమోదు చేయాల్సిందిగా సంబంధిత పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు విజిలెన్స్‌ అధికారులు తెలిపారు.


కాగా ఇదే కాకుండా ఇంకా వేల లీటర్ల గ్లైఫోసెట్‌ను జిల్లాలో విక్రయించినట్లు తెలుస్తోంది. గుంటూరు నుంచి సుమారు 20 వేల లీటర్ల నిషేధిత కలుపు మందు జిల్లాకు చేరినట్లు అక్కడి అధికారులకు ఆధారాలు లభించాయి. అయితే ఇప్పుడు తనిఖీల్లో 1170 లీటర్లు మాత్రమే పట్టుబడిందంటే మిగతాది గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంతో పాటు జిల్లాలో నిషేధిత గ్లైఫోసెట్‌ను అమ్ముతున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో విజిలెన్స్‌, వ్యవసాయ శాఖాధికారులు తనిఖీలు చేపట్టగా భాగోతం బయటపడింది. అయితే జిల్లాలో పెద్ద ఎత్తున నిషేధిత పురుగు మందులు విక్రయిస్తుంటే వ్యవసాయ శాఖాధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అధికారులు డీలర్లకు పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలకు ఈ వ్యవహారం బలం చేకూరుస్తోంది. 

Updated Date - 2020-06-06T09:34:41+05:30 IST