పరిశోధన, అభివృద్ధికి ‘జీఎంఆర్‌ ఇన్నోవెక్స్‌’

ABN , First Publish Date - 2021-04-04T05:53:08+05:30 IST

ఇన్నోవేషన్‌పై దృష్టి సారించేందుకు ‘జీఎంఆర్‌ ఇన్నోవెక్స్‌’ పేరుతో జీఎంఆర్‌ గ్రూప్‌ ప్రత్యేక వ్యాపార విభాగాన్ని ప్రారంభించింది.

పరిశోధన, అభివృద్ధికి ‘జీఎంఆర్‌ ఇన్నోవెక్స్‌’

హైదరాబాద్‌ విమానాశ్రయ ప్రాంగణంలో ప్రత్యేక సదుపాయం


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఇన్నోవేషన్‌పై దృష్టి సారించేందుకు ‘జీఎంఆర్‌ ఇన్నోవెక్స్‌’ పేరుతో జీఎంఆర్‌ గ్రూప్‌ ప్రత్యేక వ్యాపార విభాగాన్ని ప్రారంభించింది. హైదరాబాద్‌ విమానాశ్రయ ప్రాంగణంలో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల కోసం ప్రత్యేక సదుపాయాన్ని నిర్మించినట్లు జీఎంఆర్‌ గ్రూప్‌ వెల్లడించింది. శనివారం నాడిక్కడ తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తో కలిసి విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ ఖరోలాఇన్నోవెక్స్‌ను ప్రారంభించారు. ‘ఓపెన్‌ ఇన్నోవేషన్‌’ మోడల్‌ను ఇది అనుసరిస్తుంది. స్టార్ట్‌పలు, కార్పొరేట్‌ కంపెనీలు, ఇన్నోవేషన్‌ ప్లాట్‌ఫామ్‌లు, పరిశోధన, విద్యా సంస్థలకు ‘ఇన్నోవేషన్‌ ఎక్స్ఛేంజీ’గా పని చేస్తుందని జీఎంఆర్‌ పేర్కొంది.


పరిశోధన, అభివృద్ధి సంస్కృతిని పెంచడం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, కొత్త ఆలోచనలు, సొల్యూషన్ల అభివృద్ధికి మద్దతు ఇవ్వడం వంటి కార్యకలాపాలపై ఇన్నోవెక్స్‌ దృష్టి కేంద్రీకరిస్తుంది. ఇన్నోవెక్స్‌ను ప్రారంభించిన సందర్భంగా ఎయిర్‌బస్‌, ప్లగ్‌ అండ్‌ ప్లే, స్వీడిష్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌ఐ), టీ-హబ్‌, ఐఐటీ, హైదరాబాద్‌, ఇక్రిశాట్‌ తదితరాలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది.


డిజిటల్‌, నాన్‌ డిజిటల్‌ రంగాల్లో సామర్థ్యాలను పెంచడానికి, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించడానికి ఉపయోగపడే సొల్యూషన్లపై ఇన్నోవేక్స్‌ దృష్టి సారిస్తుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, జీఎంఆర్‌ గ్రూప్‌ (ఎయిర్‌పోర్ట్స్‌) చైర్మన్‌ జీబీఎస్‌ రాజు, జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌ ఎస్‌జీకే కిషోర్‌ పాల్గొన్నారు.



‘కొవిడ్‌’తో విమానయాన రంగం కుదేలు

కొవిడ్‌ వల్ల దేశంలో విమానయాన రంగం తీవ్రంగా దెబ్బ తిన్నదని ప్రదీప్‌ సింగ్‌ ఖరోలా అన్నారు. విమానాశ్రయాల్లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా విమాన ప్రయాణాన్ని జీఎంఆర్‌ పునర్నిర్వచించిందన్నారు.




ఆరు చోట్ల విమానాశ్రయాలకు  సహకరిస్తాం

తెలంగాణలో 6 చోట్ల విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీ్‌పసింగ్‌ ఖరోలా అన్నారు. ఆయన శనివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. వరంగల్‌ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌, ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలో విమానాశ్రయాలను (ఎయిర్‌ స్ట్రిప్‌) ఏర్పాటు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. వాటికి సత్వరం మంజూరు చేయాలని కేసీఆర్‌ కోరగా ప్రదీప్‌ సానుకూలంగా స్పందించారు. 


Updated Date - 2021-04-04T05:53:08+05:30 IST