Abn logo
Aug 13 2020 @ 00:20AM

రైలు కూతకు జీఎంఆర్‌ రెడీ!

  • ప్రైవేట్‌‌  రైళ్లు నడిపేందుకు గ్రూప్‌ ఆసక్తి 
  • హైదరాబాద్‌కు చెందిన మేధా గ్రూప్‌ సైతం.. 
  • పోటీలో మొత్తం 23 కంపెనీలు 


న్యూఢిల్లీ: ఇప్పటికే విమానాశ్రయాల నిర్వహణలో ఉన్న జీఎంఆర్‌ గ్రూప్‌..  రైళ్లు నడిపేందుకూ ఆసక్తిగా ఉంది. దేశంలో తొలి ప్రైవేట్‌ రైల్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి బుధవారం నాడు ప్రీ-అప్లికేషన్‌ సమావేశం జరిగింది. జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌, హైదరాబాద్‌కు చెందిన మేధా గ్రూప్‌ సహా మొత్తం 23 కంపెనీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయని రైల్వే శాఖ తెలిపింది. ఎల్‌అండ్‌టీ, సీమెన్స్‌, బొంబార్డియర్‌, ఆల్‌స్టోమ్‌, బీఈఎంఎల్‌, ఐఆర్‌సీటీసీ, భెల్‌, సీఏఎఫ్‌, స్టెరిలైట్‌, భారత్‌ ఫోర్జ్‌, జేకేబీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, టిటాగర్‌ వ్యాగన్‌ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. 151 మోడ్రన్‌ ట్రెయిన్ల ద్వారా 12 క్లస్టర్లలోని 109 మార్గా ల్లో ప్యాసింజర్‌ రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ బిడ్లు ఆహ్వానిస్తోంది. మొత్తం రెండు దశల్లో బిడ్డింగ్‌ జరగనుంది. రైల్వే శాఖ నడిపించే రైళ్లకు ఇవి అదనం. మొత్తం రైళ్లలో కేవలం 5 శాతం. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రైవేట్‌ రంగం నుంచి రూ.30,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని రైల్వే శాఖ అంచనా. 

ఈ ప్రాజెక్టులో ఎంపిక చేసిన 12 క్లస్టర్లలో సికిందరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, పాట్నా, జైపూర్‌, ప్రయాగ్‌రాజ్‌, హౌరా, ఛండీగఢ్‌ ఉన్నాయి. ఇందులో ఢిల్లీ, ముంబై నుంచి రెండేసి చొప్పున క్లస్టర్లను ఏర్పాటు చేసింది. ప్రతి క్లస్టర్‌ను ప్రత్యేక ప్రాజెక్టుగా భావించడం జరుగుతుందని, ప్రతి క్లస్టర్‌కు ప్రత్యేకంగా బిడ్డింగ్‌ జరుగుతుందని రైల్వే శాఖ తెలిపింది. 2023 మార్చి నాటికి ప్రైవేట్‌ రైళ్ల సేవలను అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ యోచిస్తోంది. తొలుత 12 రైళ్లతో సేవలు ప్రారంభించే అవకాశం ఉంది. 2027 నాటికి 151 రైళ్ల సేవలు ప్రారంభమవుతాయని అంచనా. ప్రైవేట్‌ రైళ్లకు ఆధునిక హంగులు 

ప్రైవేట్‌ కంపెనీలు నడపబోయే రైళ్లలో ఉండాల్సిన హంగులు, సౌకర్యాలపై రైల్వే శాఖ బుధవారం నాడు ముసాయిదా నివేదికను విడుదల చేసింది. 


కీలకాంశాలు.. 

  1. రైలు బోగీల్లో ఎలకా్ట్రనిక్‌ స్లైడింగ్‌ డోర్లు ఏర్పాటు చేయాలి. డబుల్‌ గ్లేజ్డ్‌ సేఫ్టీ గ్లాస్‌తో కూడిన కిటికీలు, అంధుల కోసం బ్రెయిలీ లిపి సంకేతాలు, ఎమర్జెన్సీ టాక్‌ బ్యాక్‌, ప్రయాణికుల నిఘా వ్యవస్థతో పాటు సమాచార, గమ్యస్థానాల బోర్డులుండాలి. 
  2. ప్రయాణికులకు ధ్వనిరహిత ప్రయాణ అనుభూతినందించాలి. గంటకు గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో రైలు దూసుకెళ్లాలి. లెవెల్‌ ట్రాక్‌పై 140 సెకండ్లలో సున్నా నుంచి 160 కిలోమీటర్ల వేగం  అందుకోవాలి. 
  3. ఎమర్జెన్సీ బ్రేకులుండాలి. గంటకు 160 కీ.మీ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఎమర్జెన్సీ బ్రేక్‌ వేస్తే, 1,250 మీటర్లలోపే రైలు నిలిచిపోవాలి. 
  4. 35 ఏళ్లపాటు నడిచేలా రైళ్లను డిజైన్‌ చేసుకోవాలి. 
  5. ప్రతి బోగీలోనూ కనీసం 4 ఎలక్ట్రిక్‌ లేదా న్యుమాటికల్‌ పవర్డ్‌, ప్లగ్‌ డోర్లుండాలి. ఒక్కోవైపు రెండు చొప్పున ఏర్పాటు చేయాలి. బోగీల్లోని అన్ని ద్వారాలు మూతపడ్డాకే రైలు కదిలే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అత్యవసర సమయాల్లో ప్రయాణికులే డోర్లు తెరిచేందుకు అవసరమైన ఏర్పాట్లూ చేయాలి. 

Advertisement
Advertisement
Advertisement