అమరావతికే.. అనుకూలం

ABN , First Publish Date - 2020-10-28T10:27:49+05:30 IST

దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీల కోసం రాజధాని అమరావతిని కాపాడుకుంటామని మాజీ జడ్జి, హైకోర్టు న్యాయవాది, జైబీమ్‌ యాక్సిస్‌ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్‌కుమార్‌, ముస్లిం.

అమరావతికే.. అనుకూలం

శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు జనం జై 

మూడు రాజధానులపై రెతులతో కలిసి ప్రత్యక్ష పోరు

రాజధానికి భూములిచ్చిన వారిలో 40 శాతం దళిత రైతులే

రైతులకు సంఘీభావం తెలిపిన మాజీ జడ్జి శ్రావణ్‌కుమార్‌ 

ఈవీఎంలతో గెలిచి సీఎం అయితే పాలన ఇలాగేనన్న బషీర్‌

315వ రోజు కొనసాగిన ఆందోళనలు.. పలువురు సంఘీభావం

దళిత రైతులను సంకెళ్లతో జైలుకు తరలించడంపై పలువురు ఆగ్రహం


శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు.. అందరూ అమరావతికే అనుకూలంగా జై కొడుతున్నారు. అయినా మాట తప్పి.. మడమ తిప్పిన ముఖ్యమంత్రి జగన్‌ జనం మాట ఆలకించడంలేదు. మూడు రాజధానులకు ఏ ఒక్కరూ అనుకూలంగా లేరు. అయినా మొండిగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. 315 రోజులుగా అమరావతి కోసం ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వానికి కనపడటంలేదా.. అని మాజీ జడ్జి, హైకోర్టు న్యాయవాది, జైబీమ్‌ యాక్సిస్‌ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్‌కుమార్‌, ముస్లిం లీగ్‌ పార్టీ ఏపీ అధ్యక్షుడు బషీర్‌ అహ్మద్‌ తెలిపారు. అమరావతి  ఆందోళనలకు సంఘీభావం తెలిపిన వారు.. రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులకు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాసిన చట్టాలు, రాజ్యాంగం అండగా ఉంది.. భయపడాల్సిన పనిలేదని చెప్పారు.


తుళ్లూరు, అకోబరు 27: దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీల కోసం రాజధాని అమరావతిని కాపాడుకుంటామని మాజీ జడ్జి, హైకోర్టు న్యాయవాది, జైబీమ్‌ యాక్సిస్‌ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్‌కుమార్‌, ముస్లిం లీగ్‌ పార్టీ ఏపీ అధ్యక్షుడు బషీర్‌ అహ్మద్‌ తెలిపారు. తుళ్లూరు, వెలగపూడి, మందడం గ్రామాల్లోని దీక్షా శిబిరాలను వివిధ దళిత సంఘాల నాయకులతో కలసి మంగళవారం సందర్శించిన వారు రాజధాని రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్లో 40 శాతం మంది దళితులున్నారన్నారు. ప్రభుత్వానికి దళిత జాతి అంటే చులకన అన్నారు. మాట్లాడితే దళితుల మీద దాడి చేస్తున్నారన్నారు.  రాష్ట్ర రాజధాని అమరావతి కాకుండా చేస్తే కోటి మంది దళితుల శవాలపై తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రంలో ముస్లిం, మైనార్టీ, బీసీ, దళితులు  అన్ని వర్గాల ప్రజలు అమరావతి రైతులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇక నుంచి రైతులతో కలిసి ప్రత్యక్ష పోరులోకి దిగుతామని తెలిపారు. జగన్‌ ఒంటెదొద్దు పోకడలు మానుకోవాలన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు పని చేయాలన్నారు.  


 ముస్లిం లీగ్‌ రాష్ట్ర అధ్యక్షుడు బషీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ జగన్‌కు, పెయిడ్‌ ఆర్టిస్టులకు మంచి బుద్ధిని ప్రసాదించాలన్నారు. అమరావతికి ముస్లింల మద్దతు ఉందన్నారు. ఎన్నికలకు ముందు జగన్‌ రాజఽధాని మూడు ముక్కలు.. చెక్కలు అనలేదన్నారు. రాజధాని మూడు ముక్కలు చేయడానికి సిద్ధపడితే దానికన్నా ముందు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీకి దిగాలని సవాల్‌ చేశారు. పరిపాలన చట్ట బద్ధంగా సాగడం లేదన్నారు. ఈవీఎంలతో సీఎం అయిన వ్యక్తి సీఎం అయితే పాలన ఇలానే ఉంటుందన్నారు. జగన్‌ పులివెందుల పంచాయతీ సర్పంచ్‌గానే అనుకుంటున్నాడన్నారు. మూడు రాజధానులు అంటున్న వారు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ను  రేపల్లెలో.. కోర్టులను వినుకొండ లో పెడతారా అని ప్రశ్నించారు.

  

నియంతలా వ్యవహరిస్తున్న సీఎం : శోభారాణి

అమరావతి రైతులు భూములను కులాలకు ఇవ్వలేదని, 151 సీట్లు రావడంతో జగన్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని హైకోర్టు న్యాయవాది చందోలు శోభారాణి తెలిపారు. దళితుల నియోజకవర్గంలో రాజధాని ఉండకూడదని కుట్రలు చేస్తున్నారన్నారు. అమరావతి రైతులకు పార్టీలకు అతీతంగా మద్దతు ఉంటుందన్నారు. పెయిడ్‌ ఆర్టిస్టులను తీసుకొచ్చి రైతులకు వ్యతిరేకంగా శిబిరం ఏర్పాటు చేయించడానికి సిగ్గుగా లేదా అని ఎంపీ నందిగం సురేష్‌ను ప్రశ్నించారు. ఎంపీగా  గెలిచిన సురేష్‌ తన జాతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ.. తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోని తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవీ వెంటనే రాజీనామా చేయాలన్నారు. 


 రాజధాని రైతు ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్‌ పువ్వాడ సుధాకర్‌ మాట్లాడుతూ రాజధాని రైతులకు అన్ని పార్టీలు అండగా ఉన్నాయన్నారు. రైతులను నడి రోడ్డు మీద పడేసి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. కార్యక్రమంలో రాజధాని దళిత జేఏసీ సభ్యులు పులి చిన్నా, మార్టిన్‌, చిలకా బసవయ్య, ముళ్లమూడి, రవి, జొన్నకూటి ఏడుకొండలు, ముస్లిం, మైనార్టీ, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-10-28T10:27:49+05:30 IST