ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో జీవోల మంట!

ABN , First Publish Date - 2022-01-20T04:28:42+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 23 శాతం ఫిట్‌మెంట్‌ను వ్యతిరేకిస్తూ, హెచ్‌ఆర్‌ తగ్గింపు, సీసీఏ రద్దు, 70-75 సంవత్సరాల పెన్షనర్లకు ఇచ్చే అదనపు పెన్షన్‌కు సంబంధించి విడుదల చేసిన జీవోలపై ఉద్యోగ, ఉపాధ్యాయులు రగిలి పోతున్నారు.

ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో  జీవోల మంట!
జలవనరుల శాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న ఉద్యోగులు

ప్రభుత్వ నిర్ణయాలపై ఆగ్రహం

కార్యాచరణ కోసం విజయవాడకు చేరిన జేఏసీ నాయకులు 

జిల్లాలో ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ, ఉపాధ్యాయ నాయకులు నిరసన

నేడు కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపు


రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. విడుదల చేసిన జీవోలను వెంటనే రద్దు చేసి, మెరుగైన పీఆర్సీతో ఉత్తర్వులు ఇవ్వాలనే డిమాండ్‌తో సమ్మెలోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. బుధవారమే ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ, ఉపాధ్యాయ సంఘ నాయకులు జిల్లావ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. గురువారం కలెక్టరేట్‌ ముట్టడికి ఫ్యాప్టో నాయకులు పిలుపునిచ్చారు. ఈ నిరసనకు జేఏసీ నాయకులూ మద్దతు ఇవ్వడంతో ఉద్యోగు, ఉపాధ్యాయులంతా కలెక్టరేట్‌ వద్దకు చేరిపోనున్నారు. 

నెల్లూరు (హరనాథపురం), జనవరి 19 : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 23 శాతం ఫిట్‌మెంట్‌ను వ్యతిరేకిస్తూ, హెచ్‌ఆర్‌ తగ్గింపు, సీసీఏ రద్దు, 70-75 సంవత్సరాల పెన్షనర్లకు ఇచ్చే అదనపు పెన్షన్‌కు సంబంధించి  విడుదల చేసిన జీవోలపై ఉద్యోగ, ఉపాధ్యాయులు రగిలి పోతున్నారు. రాష్ట్రస్థాయి కార్యాచరణ కోసం ఏపీజేఏసీ, ఏపీజేఏసీ-అమరావతి నాయకులంతా విజయవాడకు చేరుకున్నారు. మరోవైపు బుధవారం జిల్లావ్యాప్తంగా ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యోగులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించారు. పీఆర్సీ జీవోలతో తమకు ఒరిగిందేమీ లేదని, ఉన్న జీతం కోతకు గురైందని ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు, ఖర్చులకు అనుగుణంగా పీఆర్సీ ఇవ్వాల్సిన ప్రభుత్వం ఉన్న జీతంలో కోతపెడుతోందని మండిపడ్డారు. జీతాల్లో కోత పెడితే ప్రభుత్వానికి రూ.750 కోట్లు మిగులుతుందని, ఉద్యోగులను క్షోభకు గురిచేయడం తగదని ఆవేదన చెందారు.

ఇరిగేషన్‌ కార్యాలయం ఎదుట ఆ శాఖ ఉద్యోగుల సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకుడు రవి కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ మోసపూరిత ఉత్తర్వులతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఉద్యోగులంతా ఏకతాటిపై నిలిచి మెరుగైన పీఆర్సీ వచ్చే వరకు పోరాటం సాగిద్దామని పిలుపునిచ్చారు.

నెల్లూరులోని రోడ్డు భవనాల శాఖ సర్కిల్‌ కార్యాలయం, డివిజన్‌ కార్యాలయాల ఎదుట ఆ శాఖ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉద్యోగుల సూచనలు, సలహాలను నాయకులు తీసుకొన్నారు. 

ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు గురువారం కలెక్టరేట్‌ ముట్టడి చేపట్టనున్నట్లు యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష్య, కార్యదర్శులు జీజె.రాజశేఖర్‌, వీవీ.శేషు తెలిపారు. ఏపీజేఏసీ అమరావతి, ఏపీజేఏసీ  రాష్ట్ర చైర్మన్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావులు సంపూర్ణ మద్దతు తెలపడంతో ఈ కార్యక్రమం పెద్దఎత్తున జరగనుంది. మరోవైపు ఈ ముట్టడికి ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయం సంఘం నాయకులు మద్దతు తెలిపారు. 

Updated Date - 2022-01-20T04:28:42+05:30 IST