పల్లెకు పోదాం.. పండుగ చేద్దాం

ABN , First Publish Date - 2021-01-13T05:51:55+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగల్లో ప్రధానమైన సంక్రాంతి పండుగ సందడి ప్రారంభమైంది. బతుకుతెరువు, ఉపాధి, విద్యావకాశాల కోసం నగరాలు, పట్టణాల్లో నివసించే కుటుంబసభ్యులు పల్లెలకు చేరుతున్నారు.

పల్లెకు పోదాం.. పండుగ చేద్దాం
యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌గేట్‌ వద్ద వాహనాల రద్దీ

ఇళ్ల ముందు రంగవల్లులు 

పిండి వంటల ఘుమఘుమలు

గాలిపటాల రెపరెపలు 

జాతీయ రహదారులపై వాహనాల రద్దీ

పల్లెల్లో మొదలైన సంక్రాంతి సందడి 

నేడు భోగి పండుగ

సంక్రాంతి పండుగ అంటే ఊరంతా సంబురమే. మహిళల పిండి వంటలు, పురుషుల కోడి పందేలు, చిన్నారుల గాలిపటాల కేరింతలు, యువతుల రంగవల్లులతో పల్లెలు సందడిగా మారాయి. ఇన్నాళ్లు పడిన కష్టం ధాన్యం రాశులై ఇంటికి చేరడంతో అందరి కళ్లలో ఆనందం వెల్లివిరిస్తోంది. ఇళ్ల ముందు ముగ్గులు, మధ్యలో గొబ్బెమ్మలు, గంగిరెద్దుల విన్యాసాలు, తోలుబొమ్మలాటలు చూడముచ్చటగా ఉన్నాయి. మూడు రోజులపాటు జరిగే సంక్రాంతి సంబురాల్లో భాగంగా నేడు భోగి, 14న మకర సంక్రాంతి, 15న కనుమ జరుపుకోనున్నారు.

యాదాద్రి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగల్లో ప్రధానమైన సంక్రాంతి పండుగ సందడి ప్రారంభమైంది. బతుకుతెరువు, ఉపాధి, విద్యావకాశాల కోసం నగరాలు, పట్టణాల్లో నివసించే కుటుంబసభ్యులు పల్లెలకు చేరుతున్నారు. పచ్చటి పొలాలు, పాడి పంటలతో కళకళలాడే పల్లెల్లో మమకారం పంచే బంధుమిత్రుల మధ్య పండుగ చేసుకోవడానికి పల్లెబాట పట్టారు. దారులన్నీ గ్రామీణ ప్రాంతాలవైపే అన్నట్లుగా మంగళవారం జాతీయ రహదారులన్నీ వాహనాలతో బారులు తీరాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా గల జాతీయ రహదారులతోపాటు ప్రధానమైన రాష్ట్ర రహదారులవెంట బండెనక బండికట్టి అన్నట్లు వాహనాలు బారులుతీరాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో నివసించే ఆంధ్రప్రదేశ్‌వాసులకు అతిపెద్ద పండుగల్లో సంక్రాంతి అత్యంత ముఖ్యమైంది. వీరంతా తమతమ బంధుమిత్రులతో సొంతూళ్లలో పండుగ చేస్కుందాం అంటూ నాలుగు రోజుల ముందు నుంచే ప్రయాణాలు ప్రారంభించారు. దీంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. మంగళవారం సైతం జాతీయ రహదారి 65పై పెద్దసంఖ్యలో వాహనాలు బారులుతీరాయి. రాష్ట్రంలోని రెండో అతిపెద్ద నగరం వరంగల్‌తోపాటు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మెదక్‌ జిల్లాలకు చెందిన నగరవాసులు పల్లెలకు వెళుతుండటంతో హైదరాబాద్‌-భూపాల పట్నం 163 జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. కొవిడ్‌-19 భయపడుతున్న మధ్య తరగతి వర్గాలు ప్రజారవాణా వ్యవస్థకంటే వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.  


కిక్కిరిసిన గ్రామీణ ప్రాంతాల బస్సులు

బతుకుతెరువు కోసం హైదరాబాద్‌లో జీవిస్తున్న పేద, మధ్య తరగతి ప్రజలు పండుగ కోసం సొంతూళ్లకు పయనంకావడంతో గ్రామాలకు వెళ్లే బస్సులు కిక్కిరిస్తున్నాయి. హైదరాబాద్‌ నగరంనుంచి యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాతోపాటు ఉమ్మడి వరంగల్‌, మెదక్‌ జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంతాల బస్సుల్లో పండుగ రద్దీ నెలకొంది. దీంతో నగర శివారులోని ఉప్పల్‌తోపాటు భువనగిరి, చౌటుప్పల్‌ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.  


పిండి వంటల్లో మహిళలు బిజీ

 కరోనా కారణంగా గడిచిన 10 నెలలుగా పండుగలు, సంబరాలకు దూరంగా ఉంటున్న నగర ప్రజలు గ్రామాలకు చేరుకుంటుండటంతో సంక్రాంతి సందడి నెలకొంది. దూరంగా ఉంటున్న కుటుంబసభ్యులు పండుగకు ఊరొచ్చారనే సంతోషంతో ఇళ్లలో పిండివంటల తయారీ, కొత్త దుస్తుల షాపింగ్‌లతో సందడిగా మారాయి. 


జర్నీ సాఫీగా  

సంక్రాంతి జర్నీ సాఫీగా సాగడానికి జీఎంఆర్‌, జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతి వాహనానికి ఫాస్టాగ్‌ అమర్చాలనే ఉద్ధేశంతో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. టోల్‌గేట్ల వద్ద ఫాస్టాగ్‌ అమర్చడంకోసం 25 ఏజెన్సీలను, 60మంది సిబ్బందిని ఏర్పాటుచేసి, ప్రత్యేక కౌంటర్లను నెలకొల్పారు. ఈ సిబ్బంది ఫాస్టాగ్‌లేని వాహనాలను దూరం నుంచే గుర్తించి, కారు వద్దకే వచ్చి ఫాస్టాగ్‌లను ఐదు నిమిషాల్లోనే అమర్చుతున్నారు. ఇప్పటికే పంతంగి టోల్‌గేట్‌ వద్ద 90 శాతం వాహనాలకు ఫాస్టాగ్‌లు అమర్చారు. అధిక వాహనాలకు ఫాస్టాగ్‌లు ఉండటంతో టోల్‌గేట్ల వద్ద బారులు తీరడం తగ్గి, సంక్రాంతి ప్రయాణాలు సాఫీగా సాగుతున్నాయి. 


బారులు తీరిన వాహనాలు 

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌ మహానగరంలో స్థిరపడిన వారంతా మంగళవారం పట్నం విడిచి సొంత ఊళ్లకు ప్రయాణమయ్యారు. దీంతో వరంగల్‌- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ బాగా పెరిగింది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండల పరిధిలోని గూడూరు, నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని కొర్లపహాడ్‌ వద్ద వాహనాలు బారులు తీరాయి. 


ఘనంగా గోదా, రంగనాయకుల ఎదుర్కోలు మహోత్సవం

ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మంగళవారంరాత్రి నల్లగొండ పట్టణంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో గోదాదేవి, రంగనాయకస్వామిల ఎదుర్కోలు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని, స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి వేర్వేరు వాహనాలపై ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రజలు, భక్తుల సమక్షంలో శాస్త్రోక్తంగా నిశ్చితార్థం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ చకిలం వేణుగోపాల్‌రావు, ఈఓ మొకిరాల రాజేశ్వర్‌శర్మ, దయాకర్‌, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-13T05:51:55+05:30 IST