గోవా మద్యం.. ఏపీలో అమ్మేద్దాం..

ABN , First Publish Date - 2021-07-30T07:09:59+05:30 IST

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న మద్య నియంత్రణ విధానం అటు ఆంధ్రా, ఇటు ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికార పార్టీ నేతలకు కాసులు కురిపిస్తోంది. తెలంగాణ మద్యాన్ని ఏపీకి అక్రమంగా తరలించడం

గోవా మద్యం.. ఏపీలో అమ్మేద్దాం..

20 లక్షల పెట్టుబడికి రూ.కోటి ఆదాయం..

సిమెంటు ట్యాంకర్లలో నకిరేకల్‌కు కార్టన్లు..

అక్కడి నుంచి వివిధ మార్గాల్లో ఆంధ్రాకు

నకిరేకల్‌, శాలిగౌరారం యువకుల దందా..

ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో నేతల మిలాఖత్‌

యథేచ్ఛగా ఆంధ్రాకు మద్యం అక్రమ రవాణా..

రైళ్లు, పడవల్లో తరలిస్తున్న చిరు వ్యాపారులు


నల్లగొండ, జూలై 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న మద్య నియంత్రణ విధానం అటు ఆంధ్రా, ఇటు ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికార పార్టీ నేతలకు కాసులు కురిపిస్తోంది. తెలంగాణ మద్యాన్ని ఏపీకి అక్రమంగా తరలించడం సాధారణంగా జరుగుతున్నా, తెలంగాణ కంటే ఇంకా తక్కువ ధరకు గోవా మద్యం లభిస్తుండడంతో అక్రమార్కులు ఆ వైపు దృష్టిసారించారు. పెద్దల దందా ఈ రీతిన ఉండగా.. రైళ్లు, నాటు పడవలు, బైక్‌లపై చిరువ్యాపారులు ఉమ్మడి నల్లగొండ నుంచి పెద్ద ఎత్తున ఆంధ్రాకు అక్రమ మద్యం తరలిస్తున్నారు. ప్రజాప్రతినిధుల సిఫారసుల మేరకే పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారుల పోస్టింగ్స్‌, ఇతర వ్యవహారాలు కొనసాగుతుండటం, వారు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో మద్యం అక్రమ రవాణా ప్రధాన రహదారుల మీదుగా యథేచ్ఛగా సాగుతోంది.


సరిహద్దుల్లో అధికార పార్టీ నేతల దందా..

మద్య నియంత్రణ పేరుతో ఏపీ ప్రభుత్వం పెద్దగా గుర్తింపు లేని విస్కీ, బ్రాందీ, బీరు కంపెనీలను అందుబాటులోకి తెచ్చింది. ఆ మద్యంపై అక్కడి ప్రజలు అయిష్టత చూపుతుండటం, ధరలు ఎక్కువగా ఉండటంతో తెలంగాణ మద్యంపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో రాష్ట్ర సరిహద్దునే ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మోస్తరు నుంచి ప్రీమియం బ్రాండ్ల మద్యానికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మ్యాన్షన్‌ హౌస్‌ ఫుల్‌ బాటిల్‌ రూ.650 కాగా, అదే బాటిల్‌ సరిహద్దు దాటితే రూ.1,300 పలుకుతోంది. తెలంగాణలో రాయల్‌స్టాగ్‌ విస్కీ ఫుల్‌ బాటిల్‌ రూ.800 కాగా, ఏపీ బార్డర్‌లోకి ప్రవేశిస్తే రూ.1,600కు విక్రయిస్తున్నారు. ఇలా ఏపీలో ఏ బాటిల్‌కైనా ఎమ్మార్పీకి రెట్టింపు ధర వస్తోంది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కృష్ణానది సరిహద్దులోని నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ కీలక నేత ఏపీలోని గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన అధికార పార్టీ నేతలతో కలిసి దందా సాగిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌ ప్రాంతానికి చెందిన మద్యం వ్యాపారులకు తాజాగా నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్‌ నియోజకవర్గాల్లో షాపులు దక్కాయి.


వీరంతా ఏకమై, వారికి వచ్చే మద్యం స్టాక్‌ డీసీఎంను నేరుగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా రాత్రి వేళ ఏపీకి తరలిస్తున్నారు. ఇలా తరలించినందుకు ఒక్కో డీసీఎంపై రూ.3 లక్షలు హుజూర్‌నగర్‌కు చెందిన అధికార పార్టీ నేతకు అందుతున్నట్లు సమాచారం. ఆ నేత సూచించిన మేరకు మద్యం తరలించిన వైన్‌షాపుల యజమానులకు ఒక్కో ఫుల్‌బాటిల్‌పై ఎమ్మార్పీకి అదనంగా రూ.100 గిట్టుబాటు అవుతుంది. ఇరు రాష్ట్రాల అధికార పార్టీ నేతలు చేతులు కలపడంతో రాష్ట్ర సరిహద్దుల్లోని పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. రెండు రోజులకోసారి రాత్రివేళ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఒక డీసీఎం సరుకు ఏపీలోకి ప్రవేశిస్తోంది. 


ట్యాంకర్‌ సరుకు తరలిస్తే రూ.కోటి..

తెలంగాణలో మద్యం కన్నా గోవాలో తక్కువ ధరకు మద్యం అందుబాటులోకి వస్తుండటంతో నల్లగొండ జిల్లాలోని నకిరేకల్‌, శాలిగౌరానికి చెందిన ఏడుగురు యువకులు అక్రమ దందాకు పాల్పడుతున్నారు. పాతికేళ్ల వయసులోపు వీరంతా విమానాల్లో గోవాకు వెళ్తారు. అక్కడ ఒక సిమెంట్‌ ట్యాంకర్‌ను మాట్లాడుకుని దాంట్లో మద్యం బాటిళ్లు నింపుతారు. తిరిగి విమానంలో జిల్లాకు చేరుకుంటారు. మద్యం స్వాధీనం చేసే బాధ్యత ట్యాంకర్‌ యజమానిదే. ఆయన పోలీసుల కళ్లు గప్పి నకిరేకల్‌కు స్టాక్‌ చేరవేస్తారు. ఇక్కడి నుంచి వివిధ మార్గాల్లో ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాలకు మద్యం అక్రమంగా తరలుతోంది. తెలంగాణలో మ్యాన్షన్‌ హౌస్‌ ఫుల్‌బాటిల్‌ ధర రూ.650. అదే బాటిల్‌ గోవాలో రూ.270కే వస్తోంది. గోవా నుంచి ఒక్కో ట్యాంకర్‌లో 300 కార్టన్ల ఫుల్‌ బాటిళ్లను నల్లగొండ జిల్లాకు తరలిస్తారు. అక్కడి నుంచి ఏపీకి తరలిస్తున్నారు. ఏపీలో మ్యాన్షన్‌ హౌస్‌ ఫుల్‌బాటిల్‌ను రూ.1,300కు విక్రయిస్తున్నారు. గోవాలో ట్యాంకరు లోపల సరిపోయే రూ.20 లక్షల మందు కొనుగోలు చేసి నకిరేకల్‌కు సరఫరా చేస్తారు. అక్కడి నుంచి మద్యాన్ని దశల వారీగా వివిధ మార్గాల్లో ఏపీకి తరలిస్తారు. ఫలితంగా రూ.20 లక్షల పెట్టుబడికి రూ.కోటి ఆదాయం వస్తోంది. ఈ దందాకు పాల్పడుతున్న ట్యాంకర్‌ను గతంలో ఒకసారి ఏపీ పోలీసులు, జూలై 13న నకిరేకల్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారం రెండు నెలలుగా సాగుతోంది.


రైళ్లు, నాటు పడవల ద్వారా దందా..

నల్లగొండ, మిర్యాలగూడ ప్రాంతాల నుంచి గుంటూరు, ఆంధ్రాలోని జిల్లాలకు మద్యం తరలించేందుకు అక్రమార్కులు ప్యాసింజర్‌ రైళ్లను ఎంచుకుంటున్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన 20 మంది యువకులు నల్లగొండ జిల్లాలోకి వచ్చి మద్యం కొంటున్నారు. రద్దీగా ఉండే నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లను రవాణాకు ఎంచుకుంటున్నారు. పెద్ద బ్యాగుల్లో అడుగున దుస్తులు, మధ్యలో మద్యం బాటిళ్లు, వాటిపైన బట్టలు పెట్టుకుని రవాణా చేస్తున్నారు. ఈ మార్గంలో రైల్వే కానిస్టేబుళ్లను మచ్చిక చేసుకొని, కొంత ముట్టజెప్పి దందా కొనసాగిస్తున్నారు. ఇటీవల మిర్యాలగూడలో ఈ గ్యాంగ్‌ పట్టుబడగా, వీరితో చేతులు కలిపిన రైల్వే కానిస్టేబుల్‌ను ఛత్తీ్‌సగఢ్‌కు బదిలీ చేశారు. ఇక ఏపీతో సరిహద్దు కలిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని యువకులు నాటు పడవల ద్వారా ఏపీలోని బెల్టుషాపులకు మద్యాన్ని చేరవేస్తున్నారు. దీంతో ఫుల్‌బాటిల్‌పై రూ.300 అదనంగా వస్తోంది. మరోవైపు ఏపీకి చెందిన యువకులు బైక్‌లపై పుస్తకాలు పెట్టుకునే బ్యాగ్‌లతో వచ్చి మందు బాటిళ్లు నింపుకొని వెళ్తున్నారు. బాటిల్‌పై రూ.200 ఆదాయం వస్తుండటంతో యువకులు ఈ పనిలో పడ్డారు.  


అక్రమ రవాణాను అరికడతాం

నకిరేకల్‌, శాలిగౌరారానికి చెందిన కొందరు యువకులు గ్రూపుగా ఏర్పడి గోవా నుంచి అక్రమంగా మద్యం తెస్తున్నారు. ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉండడంతో ఇక్కడి నుంచి రవాణా చేసి జేబులు నింపుకుంటున్నారు. గతంలో ఏపీలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ ట్యాంకర్‌ పట్టుబడగా ఇటీవల నకిరేకల్‌లో గోవా మద్యం పట్టుబడింది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి అక్రమ రవాణాను అరికడతాం.

శింబు ప్రసాద్‌, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ 

Updated Date - 2021-07-30T07:09:59+05:30 IST